Let's talk: editor@tmv.in
భూ కక్ష్యను విడిచి జాబిల్లి వైపు ‘ఆర్టెమిస్-2’ ప్రయాణం

భూ కక్ష్యను విడిచి జాబిల్లి వైపు ‘ఆర్టెమిస్-2’ ప్రయాణం

Shaik Mohammad Shaffee
4 ఏప్రిల్, 2026

అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 1972లో 'అపోలో-17' తర్వాత మొదటిసారిగా మానవుడు భూ కక్ష్యను దాటి అంతరిక్ష అగాథంలోకి అడుగుపెట్టాడు. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా ఓరియన్ వ్యోమనౌక తన ప్రధాన ఇంజిన్‌ను ఆరు నిమిషాల పాటు మండించి (ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ బర్న్), భూమి గురుత్వాకర్షణ శక్తులను దాటుకుని చంద్రుడి వైపు పయనాన్ని మొదలుపెట్టింది. ఈ చారిత్రాత్మక యాత్రలో రీడ్ వైజ్‌మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌లతో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ పాల్గొంటున్నారు.

నింగిలోకి 'ఇంటిగ్రిటీ'

ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6:35 గంటలకు ఎస్.ఎల్.ఎస్ రాకెట్ ద్వారా ఓరియన్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నౌకకు వ్యోమగాములు 'ఇంటిగ్రిటీ' అని పేరు పెట్టారు. అంతరిక్షంలోకి చేరిన వెంటనే ఓరియన్ తన నాలుగు సౌర ఫలకాలను విప్పి సూర్యుడి నుంచి శక్తిని గ్రహించడం ప్రారంభించింది. మొదటి 24 గంటల పాటు భూమికి 46,000 మైళ్ల ఎత్తులో పరిభ్రమిస్తూ నౌకలోని కీలక వ్యవస్థలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఐ.సి.పి.ఎస్ స్టేజ్‌ను టార్గెట్‌గా చేసుకుని వ్యోమగాములు మాన్యువల్ పైలటింగ్ ప్రదర్శనను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.

దైనందిన పనులు.. వ్యోమగాముల సన్నద్ధత

చంద్రుడి వైపు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించే ముందు వ్యోమగాములు అంతరిక్ష వాతావరణానికి అలవాటు పడ్డారు. వ్యోమనౌకలోని కమ్యూనికేషన్ వ్యవస్థను డీప్ స్పేస్ నెట్‌వర్క్‌కు అనుసంధానించారు. ఈ ప్రయాణంలో భాగంగా మొదటిసారి వ్యోమగాములు విశ్రాంతి తీసుకోవడం, ఫ్లైవీల్ వ్యాయామాలు చేయడం వంటివి పూర్తి చేశారు. వ్యోమనౌకలోని టాయిలెట్ వ్యవస్థలో తలెత్తిన చిన్నపాటి సమస్యను కూడా ఇంజనీర్లు వెంటనే చక్కదిద్దారు. ప్రయాణంలో భాగంగా ఎస్.ఎల్.ఎస్ రాకెట్ నుంచి నాలుగు చిన్న 'క్యూబ్‌శాట్' ఉపగ్రహాలను కూడా ప్రయోగించారు.

ఏప్రిల్ 6న 'చందమామ' దర్శనం

షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6వ తేదీ సోమవారం నాడు ఓరియన్ నౌక చంద్రుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. ఈ సందర్భంగా వ్యోమగాములు చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత స్పష్టత కలిగిన కెమెరాలతో ఫోటోలు తీయనున్నారు. ముఖ్యంగా భూమికి కనిపించని చంద్రుడి అవతలి వైపు భాగాన్ని వీరు నేరుగా వీక్షించనున్నారు. అక్కడ సూర్యకాంతి తక్కువగా ఉన్నప్పటికీ, ఏర్పడే నీడల సహాయంతో చంద్రుడిపై ఉన్న లోయలు, శిఖరాలు, క్రేటర్లను సమగ్రంగా అధ్యయనం చేసే అవకాశం కలుగుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లక్ష్యం.. అంగారక గ్రహం!

ఈ 10 రోజుల పరీక్షా యాత్ర ముగిసిన తర్వాత వ్యోమగాములు తిరిగి భూమికి పయనమై శాన్ డియాగో తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో దిగనున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయడం, అక్కడ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం సులభతరమవుతుంది. వీటన్నింటికీ మించి మానవుడిని మొదటిసారి అంగారక గ్రహం మీదకు పంపే భారీ ప్రాజెక్టుకు ఆర్టెమిస్ మిషన్ ఒక బలమైన పునాదిగా నిలవనుంది.