
భూ అక్రమాల్లో నా ప్రమేయం ఉంటే రాజీనామా చేస్తా: మిజోరం సీఎం
లెంగ్‌పుయి భూవ్యవహారంలో ఆర్థిక అక్రమాల ఆరోపణలకు సంబంధించి తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు తేలితే తక్షణమే రాజీనామా చేస్తానని మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా ప్రకటించారు. తాను కమీషన్లు స్వీకరించానన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన, ప్రతిపక్షం ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో నా ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే , ఈ రాష్ట్రాన్ని నడిపే అర్హత నాకు లేదని భావించి వెంటనే పదవికి రాజీనామా చేస్తానని సీఎం స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 13న కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జాన్ – రోత్-లువాంగ్-లియానా లాల్దుహోమాపై అవినీతి ఆరోపణలు చేశారు. ఐజాల్‌లోని కాంగ్రెస్ భవన్‌లో జరిగిన రాజకీయ సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ సీఎంకు రూ.14 కోట్ల వాటా ఉద్దేశించిందని, అందులో రూ.10 కోట్లు అందుకున్నారని సమాచారమని ఆరోపించారు. చెల్లింపులు బంగారంగా ఇవ్వాలని సీఎం కోరారని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ కేసును సీబీఐ విచారిస్తోంది
సోమవారం ఓ స్థానిక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాల్దుహోమా ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు, అధికార పార్టీ జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్‌పీఎం) ప్రతిష్ఠకు నష్టం కలిగించాయని అన్నారు. ఇదిలా ఉండగా, గత మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) ప్రభుత్వ కాలంలో, అప్పటి ముఖ్యమంత్రి జోరాంతంగా నేతృత్వంలో లెంగ్‌పుయి విమానాశ్రయం సమీపంలో ఉన్న భూమిని భారత వైమానిక దళానికి శాశ్వత ‘డైరెక్ట్ పర్చేజ్’ ఒప్పందం ద్వారా అక్రమంగా విక్రయించే ప్రయత్నం జరిగిందని లాల్దుహోమా ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రస్తుత ప్రభుత్వం భూస్వామి, కొనుగోలుదారుని మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తోందని, శాశ్వత విక్రయం కాకుండా లీజింగ్ విధానాన్ని అనుసరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సీబీఐ విచారిస్తుంది. అప్పుడు అన్నీ స్పష్టమవుతాయని సీఎం అన్నారు.
ఐజాల్‌కు సుమారు 32 కి.మీ దూరంలో, రాష్ట్రంలోని ఏకైక విమానాశ్రయం సమీపంలో ఉన్న ఈ భూమిని యుద్ధవిమానాలు, రీఫ్యూయెలింగ్ సదుపాయాల కోసం భారత వైమానిక దళం స్వాధీనం చేసుకుంది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆరోపణలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. సుమారు రూ.187.90 కోట్ల ఆర్థిక అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తూ సీబీఐ దర్యాప్తు కోరాయి. అసలైన భూస్వాములు కాకపోయిన ఈ వ్యవహరంలో ఇద్దరు వ్యక్తులు పరిహారంలో పెద్ద మొత్తాన్ని పొందగా, అసలు భూస్వాములకు తగిన న్యాయం జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐజాల్‌లోని సీబీఐ అధికారి ప్రకారం, ఈ అంశాన్ని మణిపూర్‌లోని ఇంఫాల్ శాఖకు పంపినట్లు తెలిపారు.
