Let's talk: editor@tmv.in
భూమి మీదే..హక్కు మీదే 2027 మార్చి నాటికి రీసర్వే పూర్తి: ఏపీ సీఎం
భూమి మీదే..హక్కు మీదే 2027 మార్చి నాటికి రీసర్వే పూర్తి: ఏపీ సీఎం

భూమి మీదే..హక్కు మీదే 2027 మార్చి నాటికి రీసర్వే పూర్తి: ఏపీ సీఎం

Panthagani Anusha
10 ఏప్రిల్, 2026

రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి యజమానులే సర్వాధికారులని భూమిపై ప్రజలకు భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లాలో నిర్వహించిన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా ఆయన భూసర్వే 2.0 పోర్టల్‌ను ప్రారంభించి రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. 2027 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూసర్వే ప్రక్రియను పూర్తి చేసి మొత్తం 1.12 కోట్ల మంది పట్టాదారులకు ఆధునిక పాస్‌పుస్తకాలను అందజేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.

సాంకేతిక పరిరక్షణతో భూ రికార్డులు

గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. కొత్తగా పంపిణీ చేస్తున్న పాస్‌పుస్తకాల్లో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు, క్యూఆర్ కోడ్ లను పొందుపరిచినట్లు వెల్లడించారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఈ-కేవైసీ, ఆధార్ అనుసంధానం ద్వారా భూ వివరాలను భద్రపరిచామని యజమాని అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరగకుండా ‘డిజిటల్ లాకింగ్’ వ్యవస్థను తీసుకొచ్చామని వివరించారు. ఇప్పటికే 21.2 లక్షల పాస్‌బుక్కులు పంపిణీ చేశామని ఈ నెలలో మరో 1.5 లక్షలు జూలై నాటికి మరో 9 లక్షల పుస్తకాలను అందజేస్తామని వెల్లడించారు.

దుర్మార్గపు చట్టాల రద్దు - వివాదాలకు చెక్

రైతుల పాలిట శాపంగా మారిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని గత ప్రభుత్వం పాస్‌పుస్తకాలపై వ్యక్తుల ఫోటోలు ముద్రించి ప్రజలను మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. వివాదాస్పద 22ఏ జాబితా నుండి సుమారు 1.3 లక్షల ఎకరాల సర్వీస్ ఇనాం భూములను విముక్తం చేశామని మరో లక్ష ఎకరాలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 16,800 గ్రామాల్లో సర్వే చేపట్టగా ఇప్పటికే 7,000 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని మిగిలిన గ్రామాల్లో యుద్ధప్రతిపాదికన సర్వే కొనసాగుతుందని తెలిపారు.

బహుముఖ అభివృద్ధి దిశగా అడుగులు

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. పర్యాటక ప్రాజెక్టులు, సీ-వీడ్ కల్టివేషన్ మత్స్య సంపద ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు. స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడతామని ఇతర ప్రాంతాల పడవల ఆధిపత్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అదేవిదంగా సోలార్ రూఫ్‌టాప్ విధానం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గించి సామాన్యులపై భారం పడకుండా చూస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన గుర్తుచేశారు.

భయం పోయి.. భరోసా వచ్చింది

గత ప్రభుత్వం భూముల విషయంలో సృష్టించిన భయానక వాతావరణం, అవినీతి వల్ల భూ యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల టెర్రర్ రాజకీయాలకు కాలం చెల్లిందని పారదర్శకతతో కూడిన పాలనను అందిస్తున్నామని చెప్పారు. పునర్నిర్మాణం, పునరుద్ధరణే మంత్రంగా ముందుకు సాగుతూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.