
భూమి మండిపోనుందా?
భూమి వేడెక్కుతోంది. మన గుండెల్లో నిప్పు జ్వాలలా పెరుగుతున్న వేడి ఇప్పుడు గాలిలో, నేలలో, సముద్రంలో కూడా ప్రవహిస్తోంది. ఒకప్పుడు కేవలం వేసవి మాత్రమే ఇచ్చే వేడి ఇప్పుడు రాత్రి చల్లదనాన్ని కూడా తినేస్తోంది. ఈ వేడి కేవలం వాతావరణ మార్పు కాదు, ఇది భూమి ఊపిరి తీసుకోవడానికి పడే కష్టం కూడా. భూమి తన భవిష్యత్తు గురించి మనల్ని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు 10ఏళ్ల క్రితం ఒక మాట ఇచ్చాయి. అది పారిస్ ఒప్పందం. ఈ ఒప్పందం భూమి తాపాన్ని తగ్గించేందుకు ఒక వాగ్దానం, ఒక ప్రతిజ్ఞ. కానీ ప్రతి సంవత్సరం గాలి మరింత వేడెక్కుతోంది, భూమి మరింత నిస్సహాయంగా మారుతోంది. ఈ వేడి కేవలం ఉష్ణోగ్రతల గణాంకం కాదు, అది మన జీవితాల మోతాదును మార్చే శక్తి. ప్రతి అదనపు డిగ్రీ మనకు ఒక కొత్త ప్రమాదమనే చెప్పాలి. పారిస్ ఒప్పందం ఈ రెండు అంచుల మధ్య మనల్ని నిలబెడుతోంది. మనం ఎంచుకునే దారి భూమి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
కొత్త అధ్యయనం ప్రకారం ప్రపంచ దేశాలు పారిస్ ఒప్పందం వాగ్దానాలను నిలబెట్టుకుంటే మంచి ఫలితమే ఉంటుంది. అలా జరిగితే ప్రపంచం మొత్తం సంవత్సరానికి 57 రోజుల అధిక వేడి నుంచి విముక్తి పొందగలదు. ఇండియా విషయంలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ ప్రతి సంవత్సరం 30అత్యధిక వేడి రోజుల నుంచి ఉపశమనం పొందుతుంది. ఈ మార్పు మన ఆరోగ్యానికి, మన ఆహార భద్రతకు, మన జల వనరులకు జీవం పోసే అవకాశం కలిగిస్తుంది. కానీ ఇది కేవలం అవకాశం మాత్రమే, ఆచరణలోకి మారాలంటే దేశాలు వేగంగా కదలాలి. ఈ మార్పు కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాదు. మెక్సికోలో 77రోజులు, బ్రెజిల్‌లో 69రోజులు, ఈజిప్టులో 36 రోజులు, అమెరికాలో 30రోజులు, బ్రిటన్‌లో 29రోజుల పాటు వేడి తగ్గే అవకాశం ఉంది. ఇది చాలా విషయమనే చెప్పాలి. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది.
ప్రపంచం ఇప్పటికీ బొగ్గు, చమురు, వాయువుల మీద ఆధారపడుతోంది. ఇవే భూమి వేడిని పెంచే మూలాలు. మనకు శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నా, మనకు మార్గం తెలిసినా, మనం ఇంకా ఆ నిప్పును ఆర్పలేకపోతున్నాం. ఈ నిప్పు క్రమంగా మన భవిష్యత్తును తినేస్తోంది. ప్రతి విద్యుత్ దీపం వెనుక ఒక చమురు చుక్క ఉంటుంది.. ఇదంతా మన ఆకాశాన్ని మూసేస్తున్నాయి. భూమి శ్వాస తీసుకోలేకపోతోంది, మన పిల్లల భవిష్యత్తు వేడెక్కుతోంది. అందుకే పారిస్ ఒప్పందం కేవలం రాజకీయ పత్రం కాదు. ఇది భూమి, మానవజాతి మధ్య చేసుకున్న ఒక నిబద్ధత. ఇది శాస్త్రీయంగా మనకు దిశ చూపిస్తుంది, మానవత్వంగా మన బాధ్యతను గుర్తుచేస్తుంది. దేశాలు ఉద్గారాలను తగ్గించాలి, శుభ్రమైన శక్తిని స్వీకరించాలి, సహజ వనరులను కాపాడాలి. అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు వచ్చి వేగంగా మార్పు తేవాలి.. ఎందుకంటే ఎక్కువ నష్టానికి వారే కారణమయ్యారు.
ఇటు భూమి భవిష్యత్తు ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ప్రతి డిగ్రీ తేడా, ప్రతి రోజు తేడా మన జీవనాన్ని మార్చగలదు. 30రోజులు తక్కువ వేడి అంటే మనకు 30 రోజులు ఎక్కువ ఊపిరి. కానీ ఆ ఊపిరిని నిలబెట్టుకోవడం మన బాధ్యత. భూమి ఇంకా మన కోసం వేచి ఉంది, మన మార్పు కోసం, మన నిర్ణయం కోసం. మనం ఎంచుకునే దారి ఇప్పుడు భూమి భవిష్యత్తు అవుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి..!
