
భూమి పచ్చగా ఉంటేనే జీవం వికసిస్తుంది: రాష్ట్రపతి
భూమి పచ్చగా ఉన్నప్పుడే జీవం సజీవంగా వికసిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్ రచించిన ‘వృక్ష వేదం 2.0’ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రస్తుత కాలాన్ని ఒకవైపు అవకాశాల ‘అమృత కాలం’, మరోవైపు సంక్షోభాల ‘ఆపద కాలం’గా అభివర్ణించారు. మానవజాతి ప్రకృతి మూలాధారాలైన పంచభూతాల పవిత్రతను మరిచిపోతూ లోభానికి దగ్గరగా వెళ్లిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తైత్తిరీయ ఉపనిషత్తులోని శ్లోకాన్ని ఉదహరిస్తూ, పరమాత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి పుట్టాయని వివరించారు. ప్రతి మనిషి ఈ పంచభూతాల నుంచే జన్మిస్తాడని, చివరికి తిరిగి భూమిలో కలిసిపోతాడని చెప్పారు. అందువల్ల ప్రకృతి, జీవజాలంతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గౌరవించే ఆధ్యాత్మిక అవగాహన అవసరమని సూచించారు. ‘వృక్ష వేదం 2.0’లో పేర్కొన్న ‘భూమి పచ్చగా ఉంటేనే జీవం వికసిస్తుంది’ అనే భావనను ఉటంకిస్తూ, గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా గొప్ప మార్పును తీసుకురావాలని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ద్వారా గత ఎనిమిదేళ్లలో సుమారు 19.6 కోట్ల మొక్కలు నాటడం విశేషమని ఆమె ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణను సామూహిక బాధ్యతగా మార్చినందుకు సంతోశ్‌కుమార్, ఆయన బృందాన్ని అభినందించారు.
సంతోశ్‌కుమార్‌కు రాష్ట్రపతి అభినందన
2018 జూలై 17న ‘హరా హై తో భరా హై’ నినాదంతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ హైదరాబాద్ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయికి విస్తరించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉద్యమంలో పౌరులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా భాగస్వాములయ్యారు. తెలంగాణలో రిజర్వ్ అటవీ ప్రాంతాల పునరుద్ధరణ, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌లో 20 వేల మాంగ్రోవ్ మొక్కల నాటకం, ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం వంటి కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేఆర్.సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బీ.పార్థసారధిరెడ్డి అలాగే గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవుల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణకు వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన పర్యావరణ జ్ఞానం ఆధునిక ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపగలదని రాష్ట్రపతి పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన భూమిని అందించాలంటే ప్రతి వ్యక్తి ప్రకృతి సంరక్షణలో చైతన్యంతో ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
