
భూమి అంతమేనా?
భూమి మనకు కేవలం ఒక గ్రహం కాదు. ఇది మనందరి జీవానికి మూలం. మనం చూసే ప్రతి చెట్టు, ప్రతి సముద్రం, ప్రతి పక్షి ఈ భూమి అనే ఒకే కుటుంబానికి చెందినవి. ఎన్నో యుగాలుగా ఈ భూమి మనుషులను, జంతువులను, చెట్లను ప్రేమగా తన ఒడిలో పెంచింది. కానీ ఇప్పుడు ఆ ఒడిలో ఒక బాధ మొదలైంది. సముద్రాలు వేడెక్కుతున్నాయ్.. మంచు పర్వతాలు కరుగుతున్నాయ్.. అడవులు క్రమంగా పొడిబారుతున్నాయ్. మనం చూసి కూడా చూడనట్టు ఉన్న ఈ మార్పులు ఇప్పుడు భూమి జీవానికి ముప్పు తెస్తున్నాయ్. శాస్త్రవేత్తలు ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. భూమి తన మొదటి వాతావరణ పరిమితిని దాటిపోయిందని చెప్పారు. అంటే ప్రకృతి తన సహజ సమతుల్యతను కోల్పోయిందని అర్థం. ఈ మార్పు మొదటగా సముద్రాల లోపల కనిపిస్తోంది. ఒకప్పుడు రంగురంగుల కోరల్ రీఫ్స్‌తో నిండిన సముద్రాలు.. పూల తోటల్లా ఉండేవి. ఇప్పుడు ఆ కోరల్ రీఫ్స్ మరణిస్తున్నాయి. నీటి వేడి పెరిగి, ఆ జీవాలు చలించిపోయాయి. ఒకప్పుడు జీవం ఉప్పొంగిన చోటు.. ఇప్పుడు ఖాళీ ప్రదేశంగా కనిపిస్తోంది. ఇది భూమి మనకు పంపిన మొదటి హెచ్చరిక.
భూమి దాని మొదటి వాతావరణ మార్పు పాయింట్‌ను దాటిందని చెప్పేందుకు కోరల్ రీఫ్స్ మరణాలే ప్రత్యక్ష ఉదాహరణ. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు ఇంతగా పెరిగిపోయాయి కాబట్టే.. వేడిని భరించలేని కోరల్ రీఫ్స్ మెల్లగా మరణిస్తున్నాయి. ఒకప్పుడు ఎరుపు, పసుపు, నారింజ రంగులతో మెరిసిన ఆ జీవులు ఇప్పుడు తెల్లని ఎముకల్లా కనిపిస్తున్నాయి. వాటి మీద ఆధారపడి జీవించిన వేలాది చేపలు, చిన్నజీవులు ఇప్పుడు నివాసం లేక మౌనంగా తేలిపోతున్నాయి. ఆస్ట్రేలియాలో ఉన్న గ్రీట్ బ్యారియర్ రీఫ్ మనకు ఒక అద్భుతమైన ప్రకృతి అద్భుతం. కానీ ఇప్పుడు అది క్షీణించిన జీవన చిహ్నంగా మారింది. అది తిరిగి పూర్వస్థితికి రావడం చాలా కష్టం. సముద్రం చల్లబడినా కూడా ఈ పర్వతాలు మళ్లీ జీవం పొందే అవకాశం చాలా తక్కువ.
మరోవైపు భూమిపై జరిగే ప్రతి మార్పుతో మరోకదానికి సంబంధముంటుంది. ఒక చోట మార్పు మొదలైతే అది ఇంకో చోట ప్రభావం చూపుతుంది. కోరల్ రీఫ్స్ చనిపోతే సముద్రంలోని జీవ వ్యవస్థ దెబ్బతింటుంది. అదే సమయంలో భూమి మీద మరో ప్రమాదం కూడా దగ్గరపడుతోంది. ఆమెజాన్ అరణ్యాలు ఇప్పుడు తమ ఉష్ణమండల సరిహద్దుకు చేరుకున్నాయి. వేడి పెరిగితే, వర్షాలు తగ్గిపోతే, ఈ పచ్చని అరణ్యం మైదానంగా మారే ప్రమాదం ఉంది. అటు మంచు పర్వతాలు కూడా నెమ్మదిగా కరుగుతున్నాయి. గ్రీన్‌లాండ్, అంటార్కిటికా ప్రాంతాల్లో మంచు కరుగుతూ సముద్ర మట్టం పెరుగుతోంది. ఈ మార్పు ఆగకపోతే, రాబోయే శతాబ్దాల్లో సముద్రాలు తీరప్రాంత పట్టణాలను ముంచివేయవచ్చు. సముద్రాల లోతుల్లో మరో మార్పు దాగి ఉంది. అది అట్లాంటిక్ సముద్రంలో ఉండే నీటి ప్రవాహ వ్యవస్థ. ఇది చల్లని నీటిని దక్షిణం నుంచి ఉత్తరానికి తీసుకువెళ్తుంది. అది ఆగిపోతే యూరప్‌లో చలికాలం మరింత కఠినంగా మారుతుంది.. ప్రపంచవ్యాప్తంగా వర్షాల పద్ధతులు మారిపోతాయి. ఇది మానవ సమాజాలకు పెద్ద సవాలు అవుతుంది.
ఇటు ప్రకృతి మనకు హెచ్చరిక ఇచ్చినా, మనిషికి ఇంకా అవకాశం ఉంది. మనుషుల్లో మార్పు రావాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఈ భూమిని రక్షించగలదు లేదా దెబ్బతీయగలదు. ఇప్పుడే ప్రపంచం అంతటా ప్రజలు శక్తిని కొత్త మార్గాల్లో వాడుతున్నారు. సూర్యకాంతి నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే పద్ధతులు పెరుగుతున్నాయి. విద్యుత్ వాహనాలు రోడ్లపై సాధారణమవుతున్నాయి. ఇక ప్రభుత్వాలు కూడా పర్యావరణాన్ని కాపాడే విధానాలు అమలు చేయాలి. వాటిని ప్రజలు కూడా స్వీకరించి జీవనశైలిని మార్చుకోవాలి. ఒకరు ప్రారంభించిన మార్పు మరొకరికి ప్రేరణ అవుతుంది. ఆ మార్పు మన అందరిలో వ్యాపిస్తే, అది కూడా ఒక కొత్త సానుకూల మలుపు అవుతుంది.
చివరగా అందరూ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భూమి ఒక జీవం.. దాని ఊపిరి సముద్రాల నుంచి వస్తుంది. దాని రక్తం నదులలో ప్రవహిస్తుంది.. దాని గుండె అడవులలో కొట్టుకుంటుంది. ఇప్పుడు ఆ గుండె కాస్త వేగంగా కొట్టుకుంటోంది. అది భయంతో కాదు, ఒక హెచ్చరికతో. మనం ఈ గుండెచప్పుడును వినాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే చిన్న చర్య కూడా పెద్ద మార్పుకు దారి తీస్తుంది. ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, విద్యుత్తును వృథా చేయకపోవడం లాంటివి మనం చేయగలిగిన చిన్న విషయాలు. ఇవి మనం చేయగలం కూడా. అందుకే భూమి ఇంకా మనపై నమ్మకాన్ని ఉంచింది. మనం భూమిని వినగలిగితే.. ఆ తల్లిని అర్థం చేసుకుంటే.. ఈ నీలి గ్రహం మళ్లీ పువ్వులా నవ్వుతుంది. లేదంటే మంటల్లో కాలి బూడివుతుంది. ఇక మీరే ఆలోచించుకోండి..!
