Let's talk: editor@tmv.in
భూటాన్ న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం: సీజేఐ

భూటాన్ న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం: సీజేఐ

Pinjari Chand
6 మార్చి, 2026

భూటాన్ న్యాయవ్యవస్థలో టెక్నాలజీ ఆధారిత సంస్కరణలు అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గురువారం సూచించారు. న్యాయం అందుబాటులో ఉండాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం కీలకమని ఆయన అన్నారు. భూటాన్ రాజధాని థింపూలోని రాయల్‌ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ లో జరిగిన కార్యక్రమంలో ‘21వ శతాబ్దంలో న్యాయప్రవేశం: టెక్నాలజీ, లీగల్ ఎయిడ్, ప్రజా కేంద్రిత కోర్టులు’ అనే అంశంపై ఆయన ప్రధాన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా భూటాన్ ప్రధానమంత్రి ట్సేరింగ్‌టోబ్గేకు భారత సుప్రీంకోర్టు, హైకోర్టులు కలిసి భూటాన్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేశానని చెప్పారు. ఈ కాలంలో టెక్నాలజీ ఒక సాధనం మాత్రమే. కానీ అది ప్రజలకు అందుబాటులో ఉండేలా, సులభంగా ఉపయోగించుకునేలా ఉండాలి. న్యాయం కోర్టు గదుల గోడల మధ్య మాత్రమే ఉండే విలువ కాదు; అది ప్రజల జీవితాల్లోకి చేరాల్సిన జీవంతమైన విలువ అని ఆయన వ్యాఖ్యానించారు. భూటాన్ విద్యార్థులు భారత కోర్టుల్లో ప్రత్యక్ష అనుభవం పొందేలా ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు నిర్వహించడానికి భారత న్యాయవ్యవస్థ ఆసక్తిగా ఉందన్నారు. అవసరమైతే వసతి, భోజనం వంటి సదుపాయాలను కూడా కల్పించడానికి సిద్ధమని చెప్పారు. కోర్టు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా అనుభవించడం మంచి న్యాయ విద్యలో కీలక భాగం అని సూర్యకాంత్ పేర్కొన్నారు.

టెక్నాలజీ పెరగాలి

న్యాయవ్యవస్థలో నైతిక ప్రమాణాలు, పారదర్శకత, మానవ గౌరవం వంటి విలువలను కాపాడుకుంటూనే టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా కేంద్రిత కోర్టులు అంటే టెక్నాలజీ సహాయంతో చట్టపరమైన క్లిష్టతను తగ్గించి, మొబైల్ ఫోన్ ద్వారానే కోర్టు సేవలు పొందగలిగే విధంగా వ్యవస్థ ఉండాలని చెప్పారు. భారత న్యాయవ్యవస్థ గతంలో చేతితో రాసిన పిటిషన్లు, భారీ ఫైళ్లతో నిండిన పత్రాలపై ఆధారపడేదని ఆయన గుర్తుచేశారు. ఆ ఫైళ్ల నిల్వకు కోర్టుల్లో స్థలం కూడా సరిపోని పరిస్థితులు ఉండేవని చెప్పారు. కానీ 21వ శతాబ్దంలో పరిస్థితి మారిందని, టెక్నాలజీ న్యాయరంగంలో భారీ మార్పులు తీసుకువచ్చిందని ఆయన వివరించారు. వర్చువల్ విచారణలు, ఈ-ఫైలింగ్, ఆన్‌లైన్ వివాద పరిష్కార విధానాలు వంటి చర్యలతో న్యాయం భౌగోళిక పరిమితులను దాటి ప్రజలకు చేరువైందని చెప్పారు. డిజిటల్ ఫైలింగ్ వ్యవస్థలు, కేసు నిర్వహణ సాఫ్ట్‌వేర్‌లతో పారదర్శకత, వేగం పెరిగిందని తెలిపారు. న్యాయమూర్తులు ఇప్పుడు కేసుల చరిత్ర, పూర్వ తీర్పులు, విచారణ వివరాలు అన్నింటినీ తక్షణమే డిజిటల్ రూపంలో చూడగలుగుతున్నారని చెప్పారు.

ఇక్కడ సంస్కరణలు అవసరం

భూటాన్ వంటి చిన్న దేశానికి ఖరీదైన మార్పులు అవసరం లేదని, కానీ సమగ్రంగా పనిచేసే సంస్కరణలు అవసరమని సూచించారు. ‘జస్టిస్ కియోస్క్’ అనే మోడల్‌ను అమలు చేస్తే దూర గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా రాజధాని కోర్టుల్లో జరిగే విచారణల్లో ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చని చెప్పారు. దీంతో ప్రజలు ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే చిన్న స్థాయి భూ వివాదాలు లేదా చిన్న కేసులను బ్యాంకింగ్ యాప్‌లా సులభమైన మొబైల్ ఇంటర్‌ఫేస్ ద్వారా నమోదు చేసే విధానం కూడా ఉండాలని సూచించారు. మూడవ ముఖ్యమైన చర్యగా డిజిటల్ సేవల ద్వారా లీగల్ ఎయిడ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. టెలీ సేవల ద్వారా పారాలీగల్ సిబ్బందిని పేదవారితో అనుసంధానం చేసి ప్రారంభ దశలోనే న్యాయ సలహా అందిస్తే వివాదాలు పెద్ద కేసులుగా మారకుండా నివారించవచ్చని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు.

భూటాన్ న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం: సీజేఐ - Tholi Paluku