Let's talk: editor@tmv.in
భూటాన్‌తో భారత్ బంధం చారిత్రకమైనది: ప్రధాని మోడీ

భూటాన్‌తో భారత్ బంధం చారిత్రకమైనది: ప్రధాని మోడీ

Shaik Mohammad Shaffee
12 నవంబర్, 2025

రెండు రోజుల భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భూటాన్ రాజధాని థింపూలోని చాంగ్లిమితాంగ్ సెలబ్రేషన్ గ్రౌండ్‌లో జరిగిన భారీ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశం-భూటాన్ మధ్య ఉన్న శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, అభివృద్ధి భాగస్వామ్యాన్ని గట్టిగా నొక్కి చెప్పారు.

నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 70వ జయంతి సందర్భంగా కింగ్ జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని త్షెరింగ్ తోబ్‌గేలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. “ఈ రోజు భూటాన్‌కే కాక ప్రపంచ శాంతిని విశ్వసించే ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనది" అని ప్రధాని మోడీ అన్నారు. ఈ వేడుకకు భారతదేశం నుండి తీసుకువచ్చిన గౌతమ బుద్ధుడి పవిత్ర పిప్రహ్వా అవశేషాల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఢిల్లీ ఘటనపై విచారం

సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన భయంకరమైన సంఘటనను ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎంతో భారమైన హృదయంతో భూటాన్‌కు వచ్చానని, ఈ సంఘటన దేశాన్ని తీవ్రంగా కలచివేసిందని చెబుతూ " ఈ పేలుళ్ల వెనుక ఉన్న కుట్రను మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి. దీని వెనుక ఉన్న నేరస్తులు తప్పించుకోలేరు. బాధ్యులైన వారందరినీ చట్టం ముందు నిలబెడతాం” అని హామీ ఇచ్చారు.

భారత్-భూటాన్‌ల మధ్య ఉన్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ, “వసుధైవ కుటుంబకం” అనే ప్రాచీన భారత సూత్రం నుంచి భారత్‌ ప్రేరణ పొందుతుందని, “సర్వే భవంతు సుఖినః” మంత్రంతో ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తుందని అన్నారు. భారతదేశం పీస్ ప్రేయర్ ఫెస్టివల్‌లో పాల్గొనడం, రెండు దేశాల మధ్య శాంతి, కరుణను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసే ఉద్దేశ్యంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.

తన జన్మస్థలం వడ్నగర్, కార్యస్థలం వారణాసికి బౌద్ధ సంప్రదాయంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, వారణాసిలో భూటాన్ ఆలయం, గెస్ట్ హౌస్ నిర్మాణానికి భారతదేశం స్థలాన్ని కేటాయిస్తుందని ప్రకటించారు.

నాల్గవ రాజుకి నివాళులర్పిస్తూ, మోదీ ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆయనను "జ్ఞానం, సరళత, ధైర్యం, నిస్వార్థ సేవల కలయిక" అని అభివర్ణించారు. భూటాన్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే సంప్రదాయాలను కాపాడినందుకు ఆయనను ప్రశంసించారు. నాల్గవ రాజు ‘గ్రాస్ నేషనల్ హ్యాపినెస్’ భావన మానవ-కేంద్రీకృత వృద్ధికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫ్రేమ్‌వర్క్‌గా మారిందని కొనియాడారు.

భూటాన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్-నెగటివ్ దేశంగా మారడం "అసాధారణ విజయం" అని ప్రధాని మోడీ అభినందించారు. ఇండో-భూటాన్ ఇంధన భాగస్వామ్యంలో భాగంగా కొత్తగా 1,020 మెగావాట్ల పునాత్‌సాంగ్‌చు–II హైడ్రోపవర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది భూటాన్ సామర్థ్యాన్ని 40 శాతం పెంచుతుంది. పెండింగ్‌లో ఉన్న మరొక హైడ్రోపవర్ ప్రాజెక్టును కూడా తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోలార్ ఎనర్జీలో కూడా సహకారాన్ని విస్తరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భూటాన్‌లో ఇంధన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి భారత్ 4,000 కోట్ల రూపాయల రాయితీ రుణాన్ని కూడా ప్రకటించింది.

“కనెక్టివిటీ అవకాశాలను సృష్టిస్తుంది, అవకాశం సంపదను సృష్టిస్తుంది” అని పేర్కొంటూ, రైల్వే, రోడ్డు కనెక్టివిటీని పెంపొందించేందుకు కొత్త ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రకటించారు. గెలెఫు , సామ్ట్సే నగరాలను భారత రైల్వే నెట్వర్క్‌తో అనుసంధానిస్తామని, దీంతో రైతులు, పరిశ్రమలకు వాణిజ్య మార్గాలు సులభమవుతాయని తెలిపారు. గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్టుకు భారత మద్దతు ఉంటుందని, గెలెఫు సమీపంలో కొత్త ఇమిగ్రేషన్ చెక్‌పాయింట్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

2024లో భారత ప్రభుత్వం భూటాన్ ఐదేళ్ల ప్రణాళికకు రూ.10,000 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఆర్థిక, ఆరోగ్య రంగాలకు నిధులు కేటాయించారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు, భూటాన్‌లో యూపీఐ చెల్లింపు సౌకర్యాలను విస్తరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా మోడీ ప్రస్తావించారు.

భారత్-భూటాన్ సంబంధాల బలమైన లబ్ధిదారులు యువతేనని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇరు దేశాల యువత విద్య, నైపుణ్య అభివృద్ధి, క్రీడలు, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పనిచేస్తున్నారని, సంయుక్త ఉపగ్రహ అభివృద్ధి కూడా దానిలో భాగమని వివరించారు. భారతదేశంలోని రాజగిరిలో ఇటీవల ప్రారంభించిన రాయల్ భూటానీస్ టెంపుల్‌ను ప్రస్తావించారు.

చివరగా " భారత్‌, భూటాన్‌లు సరిహద్దుల ద్వారా మాత్రమే కాదు, సంస్కృతుల ద్వారా కూడా అనుసంధానమై ఉన్నాయి. మా సంబంధం విలువలు, భావోద్వేగాలు, శాంతి, అభివృద్ధి మీద ఆధారపడి ఉంది " అని ప్రధాని మోడీ అన్నారు. బుద్ధుడు, గురు రిన్పోచే ఆశీస్సులతో రెండు దేశాలు శాంతి, అభివృద్ధి, ఐక్యత మార్గంలో కలిసి ముందుకు సాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

భూటాన్‌తో భారత్ బంధం చారిత్రకమైనది: ప్రధాని మోడీ - Tholi Paluku