Let's talk: editor@tmv.in
భీంగల్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దాం: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

భీంగల్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దాం: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

Gaddamidi Naveen
19 జనవరి, 2026

బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి చిరునామా బీఆర్ఎస్ పార్టీనే. రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి మున్సిపాలిటీని గెలిపించుకుందాం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భీంగల్ పట్టణ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలే బీఆర్‌ఎస్ బలం ఏమిటో స్పష్టంగా నిరూపించాయని ఆయన అన్నారు. ఏడు మండల కేంద్రాల్లో ఐదు మండల కేంద్రాల సర్పంచ్ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భీంగల్ మున్సిపాలిటీలో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కే ఉందని స్పష్టం చేశారు.

కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో భీంగల్‌కు అసాధ్యమనుకున్న అభివృద్ధి సాధ్యమైందని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో భీంగల్ మున్సిపాలిటీకి తొలి విడతగా రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ.35 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అదనంగా ఆర్‌అండ్‌బీ ద్వారా సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణానికి రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు నిధులు వచ్చాయని వివరించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లనీరు అందించగలిగామని తెలిపారు.

అలాగే రూ.35 కోట్లతో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, రూ.15 కోట్లతో కప్పల వాగుపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన నిధులతో కూడా పనులు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఆసుపత్రి, వెజ్–నాన్ వెజ్ మార్కెట్ పనులకు బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితి ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీల అమలు శూన్యమని విమర్శించిన ఆయన, అందుకే ప్రజల్లో కాంగ్రెస్ బాకీ కార్డు అనే భావన ఏర్పడిందన్నారు. భీంగల్ అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని వేముల ప్రశాంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

భీంగల్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దాం: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి - Tholi Paluku