Let's talk: editor@tmv.in
భీంగల్ అభివృద్ధి కోసం నిరాహార దీక్ష.. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్
భీంగల్ అభివృద్ధి కోసం నిరాహార దీక్ష.. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్

భీంగల్ అభివృద్ధి కోసం నిరాహార దీక్ష.. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్

Gaddamidi Naveen
16 జులై, 2026

బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని ఆయన ప్రశ్నించారు. పోలీసుల ఆంక్షల నడుమ బుధవారం వేల్పూర్‌లోని తన స్వగృహంలోనే ఆయన నిరాహార దీక్షను కొనసాగించారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం భీంగల్ ప్రజల కోసం 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి 70 శాతం పనులు పూర్తి చేసిందని, మిగిలిన పనులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే గతంలో తాము తీసుకొచ్చిన బస్ డిపోను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందని, దానిని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. భీంగల్ మార్కెట్ పనులు, రూ. 12 కోట్లతో మంజూరైన సీసీ రోడ్ల పనులను అసంపూర్తిగా వదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నాలుగు ప్రధాన డిమాండ్ల సాధనకై భీంగల్‌లో దీక్షకు అనుమతి కోరుతూ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ, తన ఇళ్లను చుట్టుముట్టి నిర్బంధించారని ఆయ‌న‌ తెలిపారు. భీంగల్‌లో దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, స్టేజిని తొలగించడమే కాకుండా, కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను పోలీసులు చించివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను అడ్డుకున్నంత మాత్రాన పోరాటం ఆగదని, భీంగల్ అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మూడు నెలల్లో ఆసుపత్రిని తెరిపిస్తామని హామీ ఇచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట తప్పారని, కాంగ్రెస్ హామీలన్నీ నీటి మూటలేనని ఎద్దేవా చేశారు.

రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం

ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అరెస్టును బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా దీక్ష చేపట్టాలని నిర్ణయించుకుంటే నిర్బంధించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమన్నారు.

తమది 'ప్రజా ప్రభుత్వం' అని చెప్పుకుంటూ ప్రతిపక్షాన్ని నిర్బంధించడం, పోలీసు రాజ్యాన్ని నడపడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. హిట్లర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులపై అణిచివేత చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయ‌న పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
BheemgalBalkondaPrashanthReddyBRSTelanganaPoliticsTelanganaNewsPublicIssuesHospitalDevelopmentRTCDepotRoadDevelopmentMunicipalDevelopment
భీంగల్ అభివృద్ధి కోసం నిరాహార దీక్ష.. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్ - Tholi Paluku