
భిన్నత్వంలో ఏకత్వం - అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం
నేటి ప్రపంచం ఎటు చూసినా యుద్ధాల భయాందోళనలు, ప్రకృతి వైపరీత్యాల విలయతాండవంతో, మనుషుల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలతో సతమతమవుతోంది. ఎక్కడో సరిహద్దుల్లో జరిగే యుద్ధం, ఇక్కడ ఏ పాపం తెలియని చిన్నారి కంటి కన్నీటికి కారణమవుతోంది. ప్రకృతి ప్రకోపానికి ఒక దేశం అతలాకుతలమవుతుంటే, ఆ ఆవేదన ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో మనకు కావలసింది కేవలం ఆయుధాలో, అధికారమో కాదు. ఒక మనిషి పడే కష్టాన్ని చూసి మరో మనిషి స్పందించే గుణం. "నీ కష్టం నాది, నా భవిష్యత్తు నీతో ముడిపడి ఉంది" అనే సంఘీభావం. ఇది మాత్రమే ఈ గాయపడిన ప్రపంచానికి మందులా పనిచేస్తుంది. మనం విడివిడిగా విచ్ఛిన్నం కావడం కంటే, ఒకరికొకరు తోడుగా నిలబడితేనే ఈ చీకటి రోజులను దాటగలం.
ఆధునిక సాంకేతికతతో మనం చంద్రుడిపై అడుగు పెడుతున్నా, తోటి మనిషి ఆకలిని, బాధను తీర్చడంలో ఇంకా వెనుకబడే ఉన్నాం. దేశాలుగా, కులాలుగా, మతాలుగా మనం గీసుకున్న ఎన్నో గీతలు మనల్ని దూరం చేస్తున్నాయి, కానీ ఆకలికి భాష లేదు, కన్నీటికి రంగు లేదు. అట్టడుగున ఉన్న పేదవాడి ఆర్తనాదం విన్నప్పుడు మనలో కలిగే ఆ సన్నని చలనం మనల్ని మానవులుగా నిలబెడుతుంది. రేపటి తరం మన నుండి ఆశించేది మనం సంపాదించిన ఆస్తులు కాదు, మనం ఒకరిపై ఒకరు చూపిన నిస్వార్థమైన ప్రేమ, సంఘీభావం. ప్రపంచం ఎంతటి సంక్షోభంలో ఉన్నా, ఒక చేయి మరో చేయిని పట్టుకుని "నేనున్నాను" అని ధైర్యం చెబితే, ఏ అసాధ్యాన్నైనా మనం సుసాధ్యం చేయగలం.
నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో, ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న 'అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం' నిర్వహిస్తుంది. మనం ఎంత వైవిధ్యభరితమైన ప్రపంచంలో ఉన్నప్పటికీ, మన పురోగతి, మనుగడ అనేది ఒకరికొకరు తోడుగా ఉండటంపైనే ఆధారపడి ఉంటుందని ఈ రోజు గుర్తు చేస్తుంది.
ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వాలు, పౌర సమాజం, వ్యక్తులు సమిష్టి బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చే రోజు.
ఈ దినోత్సవం ఎలా మొదలైంది?
ఈ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర సహస్రాబ్ది ప్రారంభం నుండి ప్రారంభమైంది. మిలీనియం డిక్లరేషన్ (2000) లో భాగంగా 21వ శతాబ్దంలో అంతర్జాతీయ సంబంధాలకు ఉండవలసిన ప్రాథమిక విలువల్లో 'సంఘీభావం'ఒకటిగా ప్రపంచ నాయకులు గుర్తించారు.
ఫిబ్రవరి 3, 2003న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం 57/265 ద్వారా ప్రపంచ సంఘీభావ నిధి ని ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికాన్ని నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యం. డిసెంబర్ 22, 2005న ఐక్యరాజ్యసమితి తీర్మానం 60/209 ద్వారా ప్రతి ఏటా డిసెంబర్ 20ని 'అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం'గా అధికారిక ప్రకటన చేసింది
21వ శతాబ్దంలో సంఘీభావం అంటే ఏమిటి?
ఐక్యరాజ్యసమితి ప్రకారం, సంఘీభావం అంటే పెద దేశాలకు కేవలం విరాళాలు ఇవ్వడం లేదా జాలి చూపడం కాదు. అది ఒక నిర్మాణాత్మక అవసరం. దేశాలన్నీ ఉమ్మడి ప్రయోజనాల పట్ల అవగాహన కలిగి ఉండటం, ఒక సమాజంగా ఐక్యతను చాటడమే దీని ఉద్దేశ్యం. వాతావరణ మార్పులు, వ్యాధులు లేదా ఆర్థిక అస్థిరత వల్ల ఒక దేశం ప్రభావితమైతే, అది కాలక్రమేణా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని గ్రహించడమే నిజమైన సంఘీభావం.
ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు
ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవం ద్వారా నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి పెడుతుంది
భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకోవడం:
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవిస్తూనే, మానవత్వంతో అందరం ఒక్కటే అని చాటిచెప్పడం ఈ రోజు ప్రత్యేకత. ప్రపంచంలోని వివిధ దేశాలు, భాషలు, మతాలు మరియు సంస్కృతుల మధ్య ఉన్న వైవిధ్యాన్ని గౌరవించడమే ఈ దినోత్సవం యొక్క అసలు ఉద్దేశ్యం. మన ఆచార వ్యవహారాలు వేరైనప్పటికీ, అందరం ఒకే మానవ జాతికి చెందినవారమనే 'వసుధైక కుటుంబం' భావనను ఇది చాటిచెబుతుంది. ఈ వైవిధ్యం అనేది సమాజాల మధ్య అడ్డుగోడగా కాకుండా, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడానికి పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక బలమైన శక్తిగా మారాలి. భిన్నత్వాన్ని గౌరవించినప్పుడే నిజమైన శాంతి ప్రపంచ సోదరభావం సాధ్యమవుతాయి.
అంతర్జాతీయ ఒప్పందాలను గుర్తు చేయడం:
అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ప్రపంచ దేశాలకు ఒక 'రిమైండర్' (జ్ఞాపిక) లా పనిచేస్తుంది. వివిధ దేశాలు ఐక్యరాజ్యసమితి వేదికగా మానవ హక్కులు, వాతావరణ మార్పులు మరియు పేదరిక నిర్మూలనపై సంతకాలు చేసిన ఒప్పందాలను గౌరవించాలని ఈ రోజు గుర్తు చేస్తుంది. కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి, ప్రపంచ సమాజం పట్ల తమకున్న బాధ్యతను నిలబెట్టుకోవాలని దేశాలను ఇది కోరుతుంది. ప్రభుత్వాలు తమ వాగ్దానాలను నెరవేర్చినప్పుడే, అంతర్జాతీయ సంబంధాలలో నమ్మకం పెరుగుతుంది. ప్రపంచం సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది.
ప్రజా చైతన్యం:
పేదరికాన్ని పారద్రోలడానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి సంఘీభావం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించాలి. ఏ దేశాభివృద్ధికైనా, సమాజ మార్పుకైనా ప్రజా చైతన్యం అనేది వెన్నెముక వంటిది. ప్రజలు తమ హక్కుల గురించి మాత్రమే కాకుండా, బాధ్యతల గురించి కూడా ఎప్పుడైతే అవగాహన కలిగి ఉంటారో, అప్పుడే ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వం తీసుకువచ్చే పథకాలు, అంతర్జాతీయ ఒప్పందాలు లేదా పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా సామాన్యుడికి చేరాలంటే నిరంతర చైతన్య కార్యక్రమాలు అవసరం. అవగాహన ఉన్న సమాజం అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది, మార్పును ఆహ్వానిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో సంఘీభావంతో పోరాడుతుంది. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో ప్రజలు చైతన్యవంతులైనప్పుడే, వారు స్వయం శక్తితో ఎదగడానికి దేశ ప్రగతిలో భాగస్వాములు కావడానికి వీలు పడుతుంది.
కొత్త కార్యక్రమాలను ప్రోత్సహించడం:
అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం కేవలం ఉన్న సమస్యలను చర్చించడానికే కాదు, వాటిని పరిష్కరించే కొత్త ఆలోచనలకు ప్రాణం పోయడానికి ఒక వేదికగా నిలుస్తుంది. పేదరిక నిర్మూలన, ఆకలి చావులు, నిరుద్యోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, యువ ఆవిష్కర్తలు సరికొత్త మార్గాలను అన్వేషించాలని ఈ రోజు పిలుపునిస్తుంది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యను అందించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టడం లేదా పేద దేశాలకు ఆర్థిక చేయూతనిచ్చే కొత్త నిధులను సృష్టించడం వంటి వినూత్న కార్యక్రమాలను ఈ రోజు ప్రోత్సహిస్తుంది. నిరంతరం మారుతున్న ప్రపంచంలో, పాత పద్ధతులతో కాకుండా సరికొత్త వ్యూహాలతోనే మనం ప్రపంచవ్యాప్త మార్పును తీసుకురాగలమని ఇది గుర్తు చేస్తుంది.
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రాముఖ్యత
ప్రస్తుత కాలంలో మహమ్మారులు, వాతావరణ మార్పులు, యుద్ధాల వల్ల ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో సంఘీభావం మరింత ముఖ్యం. ఉదాహరణకి నేడు వాతావరణ మార్పులు, పర్యావరణ వినాశనం అనేది ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. ఇది మానవాళి మనుగడకే పెను సవాలుగా మారింది. ధనిక దేశాలు విడుదల చేసే కాలుష్యం వల్ల ఎక్కడో ఉన్న ద్వీప దేశాలు మునిగిపోతుంటే, కొన్ని దేశాలలో అడవుల నరికివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో, భూగోళాన్ని రక్షించుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ విభేదాలను పక్కన పెట్టి సంఘీభావం'తో ముందుకు రావడం అత్యవసరం. పారిస్ ఒప్పందం వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించాలని, పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆచరణ ఇంకా వేగవంతం కావాలి. కేవలం మాటలతో కాకుండా, ధనిక దేశాలు పేద దేశాలకు సాంకేతిక, ఆర్థిక చేయూతనిస్తూ, అందరం కలిసి ఈ "సాధారణ శత్రువు" (పర్యావరణ సంక్షోభం) పై పోరాడితేనే, మనం వచ్చే తరాలకు నివసించదగ్గ భూమిని అందించగలం.
అలాగే, ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం దేశాల సరిహద్దులను మాత్రమే కాకుండా, మానవత్వపు పునాదులను కూడా దెబ్బతీస్తున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితి వంటి వేదికల ద్వారా యుద్ధ బాధితులకు అండగా నిలుస్తూ తమ సంఘీభావాన్ని చాటుతున్నాయి. ముఖ్యంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో పౌరులకు ఆశ్రయం, ఆహారం, మందులు, ప్రాథమిక నిత్యావసరాలు, అందించడానికి 'హ్యుమానిటేరియన్ కారిడార్స్' (మానవతా కారిడార్లు) ఏర్పాటు చేయడంలో దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. శరణార్థులకు ఆశ్రయం కల్పించడం, యుద్ధాన్ని ఆపడానికి దౌత్యపరమైన చర్చలు జరపడం, అంతర్జాతీయ న్యాయస్థానాల ద్వారా శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించడం వంటివి సమిష్టి కృషిలో భాగమయ్యాయి. ఆయుధాల మోత కంటే శాంతి గొంతుక బలంగా వినిపించాలని, యుద్ధం వల్ల కలిగే ఆర్థిక సామాజిక నష్టాల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి దేశాలన్నీ తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో చేతులు కలుపుతున్నాయి. ఇది ప్రపంచ ఏకీకరణకు ఒక పునాది.
పెరుగుతున్న అసమానతలు:
ప్రపంచీకరణ వల్ల సంపద పెరిగినప్పటికీ, అది అందరికీ సమానంగా అందడం లేదు. "ఎక్కువ ప్రయోజనం పొందిన వారు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి" అనే సూత్రమే దీనికి పరిష్కారం. అభివృద్ధి చెందిన దేశాల వల్ల కలిగే కాలుష్య ప్రభావం పేద దేశాలపై ఎక్కువగా పడుతోంది. ఇక్కడ 'వాతావరణ న్యాయం' జరగాలంటే ప్రపంచ దేశాల మధ్య సంఘీభావం అవసరం.
మనం ఏమి చేయవచ్చు?
ఈ దినోత్సవం కేవలం నాయకుల కోసం మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోండి. అవగాహన పెంచుకోండి. సామాజిక సంక్షేమం, పర్యావరణం పట్ల మీ ప్రతినిధులను బాధ్యులుగా చేయండి. స్థానిక స్వచ్ఛంద సంస్థలకు లేదా అంతర్జాతీయ సహాయ నిధులకు మీ వంతు మద్దతు అందించండి.
మనం 2026 ఆ తర్వాతి కాలం వైపు అడుగులు వేస్తున్న వేళ, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ఇచ్చే సందేశం ఒక్కటే: "మనం కలిసుంటేనే బలం." విభజనలు పెరిగిపోతున్న ఈ కాలంలో, సంఘీభావాన్ని ఎంచుకోవడమే ఆశావహమైన మార్గం. పేదరికాన్ని నిర్మూలించడానికి, భూమిని రక్షించడానికి, ప్రతి మనిషి గౌరవంగా జీవించడానికి సంఘీభావమే పునాది.
