
భాష పై ప్రేమ.. రోగం కాదు: రాజ్‌ఠాక్రే
భాషా ఉద్యమాలు, భాషపై పట్టుదల ఒక ‘రోగం’ అన్న ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భాషా, ప్రాంతీయ గుర్తింపులు ఈ దేశంలో సహజమైనవని, అవి నిన్నటి–నేటి రాజకీయాలు కాదని, శాశ్వత వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 8న ముంబైలో జరిగిన కార్యక్రమంలో భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి రాజ్ ఠాక్రే ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. భాషపై ప్రేమ, ప్రాంతంపై అభిమానాన్ని ‘రోగం’గా ఎలా అభివర్ణిస్తారు?అంటూ ప్రశ్నించారు. ఆ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ, వాళ్లు మీ మీద ప్రేమతో రాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ భయంతో వచ్చారు. లేదంటే ఇలాంటి సుదీర్ఘ ఉపన్యాసాలకు ఇంతకుముందెన్నడూ ఎవరు రాలేదు. కాబట్టి వాళ్లు మీ కోసమే వచ్చారనే అపోహ నుంచి ముందుగా బయటకు రండి అని భగవత్‌పై ఎద్దేవా చేశారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎందుకు అవసరమైందన్న చరిత్ర భగవత్‌కు తెలియదని అనుకోవడం కష్టమేనని వ్యాఖ్యానించిన ఆయన, భాషపై, ప్రాంతంపై ప్రేమ రోగమే అయితే, ఆ రోగం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉందంటూ తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలసదారులు స్థానిక భాషను, సంస్కృతిని తిరస్కరించినప్పుడు సహజంగానే అసంతృప్తి పెరుగుతుందని, అలాంటి భావోద్వేగాలను ‘రోగం’గా కొట్టిపారేయడం సరికాదని రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. గతంలో భాషా, ప్రాంతీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్న రాష్ట్రాల్లో ఇలాంటి నీతిపాఠాలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
పాలకులు బలహీనంగా ఉన్నందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు
తమను రాజకీయాలకు అతీత సంస్థగా చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్ పరోక్ష రాజకీయ వైఖరులు అవలంబిస్తోందని కూడా రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరాఠీ భాషా గుర్తింపుపై గతంలో ఆర్‌ఎస్‌ఎస్ నేత భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ,
మరాఠీ భావోద్వేగాలను రెచ్చగొట్టడం, గుజరాతీ ఓటర్లను మచ్చిక చేసుకోవడం ద్వారా బీజేపీకి రాజకీయ లాభం చేకూర్చడానికే ఆ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. మరాఠీ ప్రజలు సహనంగా ఉంటారు. ఇక్కడి పాలకులు బలహీనంగా ఉన్నారు. అందుకే భగవత్ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు రోజుల్లో భయ్యాజీ జోషి ‘ముంబై భాష కేవలం మరాఠీ కాదు, గుజరాతీ కూడా’ అన్న వ్యాఖ్యలు చేసి మరాఠీలను రెచ్చగొట్టారు. ఇదంతా బీజేపీకి పరోక్ష మేలు చేయడానికే అని ఆరోపించారు. రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్ ఈ గందరగోళంలో ఎందుకు పడిందని ప్రశ్నించారు.
బీఫ్ ఎగుమతులపై మాట్లాడరెందుకు?
ఆర్‌ఎస్‌ఎస్ చేసిన సేవలను మేం గౌరవిస్తాం. కానీ అది పరోక్ష రాజకీయ వైఖరులు తీసుకోవడం సమర్థనీయం కాదన్నారు. దేశవ్యాప్తంగా హిందీని రుద్దే ప్రయత్నాలపై ముందుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఆ తర్వాతే సామరస్యంపై ఉపన్యాసాలు ఇవ్వాలని సూచించారు. హిందుత్వ పేరుతో జరుగుతున్న గందరగోళంపై మీరు ఎప్పుడు మాట్లాడతారు? ఉత్తర భారతదేశంలో కావర్ యాత్రల పేరుతో మహిళలను బలవంతంగా నృత్యాలు చేయించడం, 2014లో 9వ స్థానంలో ఉన్న బీఫ్ ఎగుమతులు ఇప్పుడు రెండో స్థానానికి చేరడం, గో వధ రాజకీయాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం, ఇవన్నీ ఎప్పుడు ప్రశ్నిస్తారు? అని భగవత్‌ను నిలదీశారు. హిందువులపై దాడి జరిగితే హిందువులుగా మేం నిలబడతాం. రజా అకాడమీ అల్లర్లకు వ్యతిరేకంగా ర్యాలీలు చేసింది ఎంఎన్‌ఎస్. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లపై, హిందూ పండుగల సమయంలో చెవులు పగిలేలా డీజేలు వాడడంపై మేం నిరసన తెలిపాం. తప్పు తప్పే — అది ఎవరు చేసినా మేం ప్రశ్నిస్తామని రాజ్ స్పష్టం చేశారు. మరాఠీ భాష, మరాఠీ ప్రజలే ఎంఎన్‌ఎస్‌కు తొలి ప్రాధాన్యం. భాషా, ప్రాంతీయ గుర్తింపులు ఈ దేశంలో కొనసాగుతాయి. మహారాష్ట్రలో కూడా కొనసాగుతాయి. ఇది మా హక్కు. ఇలాంటి అంశాలు వస్తే మహారాష్ట్ర తగిన రీతిలో సమాధానం ఇస్తుందని రాజ్ ఠాక్రే తేల్చిచెప్పారు.
