
భార్య పిల్లలను చంపి భర్త ఆత్మహత్య
ఆర్థిక సమస్యలు, అప్పుల భారం ఒక కుటుంబాన్ని ఎంతటి దారుణ నిర్ణయానికి పురిగొల్పాయో నిరూపించే హృదయ విదారక ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. నగరం శివారు ప్రాంతమైన ఇంజంబాక్కంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేక 45 ఏళ్ల కుటుంబ యజమాని మొదట తన భార్య (35) ఇద్దరు కుమారులను హత్య చేసి, ఆపై తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
బుధవారం ఉదయం 8 గంటల సమయంలో స్థానికుల సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భాగంగా బాధితుడు తాను చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసినసట్లు పేర్కొన్నారు. కాగా తాను రాసిన నోట్ లో తలకు మించిన అప్పుల భారం తాళలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు అని అధికారులు వెల్లడించారు. నివాసం కోసం ఇటీవల ఈ ప్రాంతానికి మారిన బాధితుడు ఆర్థిక సమస్యలతో తీవ్రంగా కుంగిపోయాడని నోట్‌లో తెలుస్తోంది.
మరోవైపు కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ మృతులదేహాలను పరిశీలించిన సమయంలో భార్య, పిల్లల ముఖాలపై ప్లాస్టిక్ కవర్లు కప్పి ఉన్నాయని అయితే, వారి శరీరాలపై ఎటువంటి అనుమానస్పద ఆనవాళ్లు లేకపోవడంతో, వారి మరణానికి ఖచ్చితమైన కారణం తెలియాలంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాల్సిఉందని పేర్కొన్నారు.
మూడు నెలల క్రితమే సేలం నుంచి మకాం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కుటుంబం నిజానికి సేలంకు చెందినవారు కాగా ఈ మధ్య కాలంలోనే ఇంజంబాక్కంలోని ఈ కొత్త ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కొద్ది కాలంలోనే సామూహిక ఆత్మహత్యకు పాల్పడేంతటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇకపోతే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబాలు ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కర్ణాటకలోని హోస్కోటే సమీపంలోని గోనకనహల్లి గ్రామంలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణ. ఆర్థిక సమస్యలు, పేదరికం, రుణబాధలు, అలాగే వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా కుంగిపోయిన ఒక దంపతులు, నిరాశకు లోనై తమ ఇద్దరు చిన్న పిల్లలను హతమార్చి అనంతరం తామూ ఆత్మహత్యకు యత్నించారు.
ఇలాంటి సంఘటనలు సమాజానికి తీవ్రమైన హెచ్చరికలుగా మారుతున్నాయి. ఆర్థిక ఒత్తిడి, రుణభారం వంటి సమస్యలు మానసిక ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపగలవో ఈ ఘటనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అధికారులు ప్రజలకు ఇలాంటి ఒత్తిడుల్లో సహాయం కోసం ముందుకు రావాలని మానసిక సలహా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
