Let's talk: editor@tmv.in
భార్య ‘ఖాళీగా ఉంది’ అనుకోవడం.. ఆమెను అర్థం చేసుకోలేకపోవడమే : ఢిల్లీ హైకోర్టు

భార్య ‘ఖాళీగా ఉంది’ అనుకోవడం.. ఆమెను అర్థం చేసుకోలేకపోవడమే : ఢిల్లీ హైకోర్టు

Pinjari Chand
24 ఫిబ్రవరి, 2026

‘ఖాళీగా ఉండే భార్య’ అనే అపోహను ఖండిస్తూ, ఇల్లాలు చేసే శ్రమ, సంపాదించే జీవిత భాగస్వామి సమర్థంగా పనిచేయడానికి తోడ్పడుతుందని ఢిల్లీ హైకోర్టు సోమవారం పేర్కొంది. భరణం (మెయింటెనెన్స్) నిర్ణయించే సమయంలో ఆమె చేసిన కృషిని విస్మరించడం అన్యాయమని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 16న ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ భార్య ఉద్యోగం చేయకపోవడాన్ని భర్త మీద ఉద్దేశపూర్వకంగా ఆధారపడిందనేలా చూడొద్దని పేర్కొన్నారు. భరణం నిర్ణయించేటప్పుడు కేవలం ఆర్థిక ఆదాయాన్ని మాత్రమే కాకుండా, వివాహ బంధం కొనసాగిన సమయంలో ఆమె ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల ద్వారా అందించిన ఆర్థిక విలువను కూడా గుర్తించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఉద్యోగం లేని జీవిత భాగస్వామిని ‘ఖాళీగా ఉంది’ అని అనుకోవడం ఇంట్లో ఆమె చేసే కృషిని అర్థం చేసుకోలేకపోవడాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించింది. ఇంటిని నడపడం, పిల్లలను చూసుకోవడం, కుటుంబాన్ని ఆదుకోవడం. ఇవన్నీ శ్రమే. ఇవి బ్యాంక్ స్టేట్మెంట్లలో కనిపించకపోయినా కుటుంబ వ్యవస్థకు అవి బలమైన ఆధారమని కోర్టు పేర్కొంది.

భరణం కేసులో కీలక వ్యాఖ్యలు

గృహ హింస నిరోధక చట్టం కింద వేరుగా నివసిస్తున్న భార్యకు భరణం మంజూరు అంశాన్ని విచారిస్తున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు, ఆమె శారీరకంగా ఆరోగ్యంగా, చదువుకున్నవారని, ఉద్యోగం చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రయత్నించలేదని పేర్కొంటూ మధ్యంతర భరణాన్ని నిరాకరించింది. అప్పీల్ కోర్టు కూడా ఆమెకు ఉపశమనం ఇవ్వలేదు. 2012లో వివాహం జరిగిన ఈ దంపతుల్లో, 2020లో భర్త భార్య, వారి చిన్న కుమారుడిని విడిచిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. భర్త హైకోర్టులో వాదిస్తూ, భార్య సంపాదించగలిగే స్థితిలో ఉన్నప్పటికీ ‘ఖాళీగా కూర్చొని’ భరణం అడగొద్దని, తనే పిల్లవాడి విద్యా ఖర్చులు భరిస్తున్నానని తెలిపాడు.

‘సంపాదించే సామర్థ్యం’ వేరు, ‘వాస్తవ ఆదాయం’ వేరు

సంపాదించే సామర్థ్యం, వాస్తవంగా సంపాదించడం, రెండు వేరు అంశాలని కోర్టు స్పష్టం చేసింది. కేవలం సంపాదించగల సామర్థ్యం ఉందని చెప్పి భరణం నిరాకరించడం సరైన విధానం కాదని పేర్కొంది. మహిళలు పనిచేయాలనుకుంటే ప్రోత్సహించాలి. కానీ ఆమె సంపాదించగలదనే కారణంతో మాత్రమే భర్తపై ఆధారపడకూడదని చెప్పి భరణం నిరాకరించడం లోపభూయిష్టమైన విధానమని కోర్టు వ్యాఖ్యానించింది.

కుటుంబ బాధ్యతల ఆర్థిక విలువ

భార్య వివాహం తర్వాత ఉద్యోగాన్ని వదిలి కుటుంబ బాధ్యతలు చేపట్టినట్లయితే, సంవత్సరాల తర్వాత అదే స్థాయి జీతంతో లేదా స్థాయిలో తిరిగి ఉద్యోగం పొందడం సులభం కాదని కోర్టు గుర్తించింది. వివాహ వివాదాల్లో భర్తలు ‘చదువుకున్న భార్య కావాలనే ఉద్యోగం చేయడం లేదు’ అని ఆరోపిస్తూ భరణం నిరాకరించేందుకు ప్రయత్నించడం సరైంది కాదని తెలిపింది. కుటుంబ నిర్మాణానికి సమయం, శ్రమ, వెచ్చించిన సంవత్సరాలు జీవిత భాగస్వామి ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా చట్టం రక్షణ కల్పించాల్సిందేనని కోర్టు పేర్కొంది.

రూ.50,000 భరణం మంజూరు

ప్రస్తుత కేసులో భార్య గతంలో లేదా ప్రస్తుతం ఉద్యోగం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని గుర్తించిన కోర్టు, గృహ హింస చట్టం కింద ఆమెకు రూ.50,000 భరణం మంజూరు చేసింది. అలాగే, భరణం కేసులు తరచుగా తీవ్ర విభేదాలకు దారితీస్తున్నాయని, దీర్ఘకాలికంగా దంపతులకూ, వారి చిన్నారులకూ మేలు చేయవని కోర్టు అభిప్రాయపడింది. వివాహ వివాదాల్లో మధ్యవర్తిత్వం (మెడియేషన్) ద్వారానే సరైన పరిష్కారం సాధ్యమని సూచించింది. కోర్టు ప్రక్రియల్లో భార్య ఖర్చులను ఎక్కువగా చూపడం, భర్త ఆదాయాన్ని తక్కువగా చూపడం వంటి పరిస్థితులు సంభవిస్తాయని, అందువల్ల సంభాషణకు అనుకూల వాతావరణం అవసరమని పేర్కొంది.

భార్య ‘ఖాళీగా ఉంది’ అనుకోవడం.. ఆమెను అర్థం చేసుకోలేకపోవడమే : ఢిల్లీ హైకోర్టు - Tholi Paluku