Let's talk: editor@tmv.in
భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్​ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్​ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
5 ఫిబ్రవరి, 2026

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో తెలంగాణను దోచుకోవడమే కాకుండా, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా కాలరాసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మిర్యాలగూడలో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్'కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.

బహిరంగ సభలో ఆయన బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తావించిన సీఎం, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో న్యాయమూర్తులు, సినీ ప్రముఖులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు ఎవరినీ వదలలేదని విమర్శించారు. పదేళ్ల పాలనలో ఉండి తెలంగాణను దోచుకున్నారు. కోట్లాది రూపాయలు సంపాదించారు. సంపాదన వరకు ఓ రకంగా సహించవచ్చు. కానీ భార్యాభర్తల మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణలను కూడా ట్యాప్ చేయడం ఎంతటి నైతిక దిగజారుదనానికి నిదర్శనం? అని సీఎం ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఫిబ్రవరి 1న కేసీఆర్‌ను ఆయన నివాసంలోనే తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుమారు ఐదు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరింత ముందుకు వెళ్లి, ఇలాంటి నేరాలు చేసిన వారిని నేరస్తుల్లా తలపై నల్ల గుడ్డ వేసి తీసుకురావాలి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల‌ను కూడా అలా విచారణకు తీసుకురావాలి. కనీసం వారి ముఖాలపై నల్ల మట్టి పూయాల్సింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ను తెలంగాణ జాతిపీత‌గా బీఆర్‌ఎస్ నేతలు కీర్తించడంపై కూడా సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన గొప్పదనం తెలంగాణ ప్రజల కోసం కాదు, తన పార్టీ నాయకులకే పరిమితం అని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

రైతు భరోసా - మున్సిపల్ ఎన్నికల హామీ

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను కోరిన సీఎం, బీఆర్‌ఎస్ నాయకులు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి. వారి వద్ద అవినీతి డబ్బు పుష్కలంగా ఉంది. ఎకరాల కొద్దీ భూముల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారు. బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. వారు ఇచ్చేది తీసుకుని, ఓటు మాత్రం మీ మనసు చెప్పినట్లే వేయండి అని వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యిన వెంటనే రైతు భరోసా పథకం కింద మరో రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు నేరుగా నగదు సహాయం అందిస్తామని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లో రైతులు, వ్యవసాయ రంగానికి సుమారు రూ.1.10 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం వివరించారు. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు కాంగ్రెస్‌కు ఓటు వేసి, బీఆర్‌ఎస్, బీజేపీలు డిపాజిట్లు కోల్పోయేలా చూడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విద్య, మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం బుధవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రూ. 200 కోట్లతో నిర్మించనున్న 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్'కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ. 1,138 కోట్ల భారీ చెక్కును అందజేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు.

ప్రసంగంలో సీఎం రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై వివరించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, పంటలకు బోనస్, ఉచిత విద్యుత్ పథకాలు రైతులకు ఎంతగానో ఉపకరిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం తమదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.