Let's talk: editor@tmv.in
భారీ ప్రోత్సాహకాలతో ఏపీ క్వాంటం పాలసీ ఆవిష్కరణ

భారీ ప్రోత్సాహకాలతో ఏపీ క్వాంటం పాలసీ ఆవిష్కరణ

Panthagani Anusha
29 డిసెంబర్, 2025

క్వాంటం కంప్యూటింగ్ రంగంలో దేశంలోనే ముందుండాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అత్యాధునిక సాంకేతికతల గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ–2025–30ను ఆవిష్కరించారు. అమరావతిని కేంద్రంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ ఈ విధానానికి ప్రధాన ఆధారంగా నిలవనుంది.

క్వాంటం కంప్యూటింగ్‌లో నోబెల్ బహుమతి సాధించే ఏ ఆంధ్రుడికైనా రూ.100 కోట్ల బహుమతి ప్రకటించి ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చంద్రబాబు, ఇప్పుడు విధాన పరంగా కూడా క్వాంటం రంగంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు దూకుడు చూపుతున్నారు. ఈ ప్రకటన యువత ముఖ్యంగా జెన్‌జీ వర్గంలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

స్టార్టప్‌లకు భారీ గ్రాంట్లు

ఏపీ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ–2025–30 విధానం కింద ఈ అత్యాధునిక రంగంలోకి అడుగుపెట్టే అంకుర సంస్థలకు కొండంత అండగా నిలిచేలా సరికొత్త పాలసీలో భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా వినూత్న ఆలోచనలతో వచ్చే ఐడియేషన్ స్థాయి స్టార్టప్‌లకు రూ. 30 లక్షల గ్రాంటును మంజూరు చేయడంతో పాటు, వాటిని పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తులుగా మలచడానికి రూ. 1 కోటి వరకు సీడ్ ఫండింగ్ ను ప్రభుత్వం అందజేయనుంది. కేవలం నిధులే కాకుండా స్థానిక ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలో పోటీ పడేలా చేసేందుకు పరిశ్రమల విస్తరణ దశలో ఉన్న సంస్థలకు రూ.5 కోట్ల వరకు గో-టు-మార్కెట్ సపోర్ట్ అందించి, దేశీయంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో అడుగుపెట్టేలా చేయనున్నారు. అంతేకాక పేటెంట్ దాఖలుపై 75 శాతం వ్యయాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది.

అద్దె సబ్సిడీ, సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాలు

ప్రారంభ దశలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గుర్తించిన ప్రాంతాల్లో గరిష్ఠంగా 20 మంది ఉద్యోగులకు వర్క్‌స్టేషన్ అద్దెపై 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. అదేవిదంగా భారీ పెట్టుబడులు అవసరం లేకుండా క్వాంటం కంప్యూటింగ్, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఉచితంగా లేదా రాయితీతో వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. దేశ విదేశాల్లో జరిగే ప్రముఖ టెక్నాలజీ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లలో పాల్గొనేందుకు కూడా స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించనున్నారు.

మూడు దశల వ్యూహం

2030 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం రంగంలో గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం మూడు దశల వ్యూహాన్ని రూపొందించింది. మొదటి దశలో విద్యార్థుల్లో ఆధునిక కంప్యూటింగ్‌పై పటిష్టమైన పునాదులు వేయడం, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రతిభా వనరులను తయారు చేయనుంది. రెండో దశలో క్వాంటం సిస్టమ్‌ల పరీక్షలు, బెంచ్‌మార్కింగ్‌కు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. మూడో దశలో పరిశ్రమల పైలట్ ప్రాజెక్టులు, ఇన్క్యుబేషన్‌కు అమరావతిని కేంద్రంగా మార్చనున్నారు.

సాంప్రదాయ ఉపాధి నమూనాలకే పరిమితమవుతున్న ఇతర రాష్ట్రాలకంటే భిన్నంగా, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు ఆంధ్రప్రదేశ్‌ను నడిపించాలన్న దూరదృష్టితో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. భారత ఐటీ విప్లవానికి పునాది వేసిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్‌లోనూ అదే స్థాయి మార్పు తేవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ క్వాంటం టెక్నాలజీలు భవిష్యత్తు గ్లోబల్ కంప్యూటింగ్, తయారీ రంగం, జాతీయ పోటీ సామర్థ్యాన్ని నిర్ణయించబోతున్నాయి. ఈ మార్పులో ఆంధ్రప్రదేశ్ ముందుండాలి. అమరావతిలోని క్వాంటం వ్యాలీ ద్వారా ప్రతిభ, పరిశోధన, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, రాష్ట్ర యువతకు భవిష్యత్‌కు అనుగుణమైన ఉన్నత విలువ గల ఉద్యోగాలు సృష్టిస్తాం అని స్పష్టం చేశారు.

క్వాంటం రంగంలో ఆలోచన నుంచి మార్కెట్ స్థాయికి వరకు పూర్తి స్థాయి స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో రూపొందిన ఈ విధానం భారతదేశ క్వాంటం కంప్యూటింగ్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను మార్గదర్శక రాష్ట్రంగా నిలబెట్టనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారీ ప్రోత్సాహకాలతో ఏపీ క్వాంటం పాలసీ ఆవిష్కరణ - Tholi Paluku