Let's talk: editor@tmv.in
భారీ ఉగ్ర కుట్రకు ‘తెర’లేపారు

భారీ ఉగ్ర కుట్రకు ‘తెర’లేపారు

Pinjari Chand
14 నవంబర్, 2025

ఎర్రకోట దగ్గర కారు పేలిన సంఘటనకు సంబంధించి భద్రతా బలగాలు విచారణను ముమ్మరం చేశాయి. వేగంగా ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేసే పనిలో పడ్డాయి. ఇంకా ఎవరెవరు ఈ మాడ్యుల్ లో ఉన్నారు. ఎవరితో సంబంధాలున్నాయి. వీరికి ఎవరు ఆదేశాలిస్తున్నారు. ఏయే వాహానాలు ఉపయోగించారు. తదితర కోణాల్లో ఎన్ఐఏ అధికారులు కీలక విషయాలు లాగుతున్నారు. అలాగే ఉమర్ కూడా పేలుడులో చనిపోయినట్లు అధికారులు నిర్దారించారు. తీవ్రంగా ఉగ్ర వేటను చేపట్టారు. గురువారం పేలుడు జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ బృందాలు, ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు కలసి శకలాలను పరిశీలిస్తున్నాయి. న్యూ లజపత్‌రాయ్ మార్కెట్ ప్రాంతంలో పేలుడు స్థలానికి సమీపంలో మానవ శరీర భాగాలు దొరికాయి. వాటిని డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు.

కారును నడిపింది ఉమర్ ఉన్ నబే

హ్యూండాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించినప్పుడు డ్రైవర్‌గా ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్ధారించాయి. ఉమర్ డీఎన్‌ఏ తల్లి డీఎన్ఏ నమూనాతో సరిపోలినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఉమర్ నబీ ఆత్మాహుతి చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

టెర్రర్ మాడ్యూల్‌లో వైద్యులు

దర్యాప్తులో భయంకరమైన వివరాలు వెలుగుచూస్తున్నాయి. కనీసం నలుగురు డాక్టర్లు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని యత్నించినట్లు సమాచారం. ఇప్పటివరకు ముగ్గురు డాక్టర్లు (అందులో ఒకరు మహిళ) సహా మొత్తం 8మంది అరెస్టయ్యారు. ఉమర్ నబీ మాత్రం పేలుడులో మృతిచెందాడు. దర్యాప్తు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, ఈ మాడ్యూల్‌లో డాక్టర్లు, మతపెద్దలు, వ్యాపారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అంతర్జాతీయ స్థాయి ట్రాన్స్‌నేషనల్ టెర్రర్ నెట్‌వర్క్ గా గుర్తించారు. ఐ20 పేలిన తర్వాత పోలీసులు ఎకోస్పోర్ట్, బ్రెజ్జా కార్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని వాహనాల కోసం అన్వేషణ చేస్తున్నారు.

భారీ కుట్ర భగ్నం

ప్రాథమిక దర్యాప్తులో ఈ బృందం దేశంలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి పేలుళ్లు జరపాలని ప్రణాళిక వేసినట్లు బయటపడింది. అయితే ఎర్రకోట పేలుడుతో ఆ కుట్ర బట్ట బయలైందని అధికారులు వెల్లడించారు. అలాగే ఫరీదాబాద్ లో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు పట్టుకోవడంతో ఉగ్ర ముప్పు తప్పింది. దర్యాప్తు అధికారుల ప్రకారం, ఇది భారీ స్థాయిలో పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఒకే సమయంలో పలు నగరాల్లో దాడులు జరపాలని ఉగ్రవాదులు ప్రణాళిక సిద్ధం చేశారు.అలాగే దొరికిన కార్లన్నీ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ మాడ్యూల్‌కు సంబంధించివేనని అధికారులు ధృవీకరించారు. ఇంకా రెండు పాత కార్లను కూడా బాంబులతో సర్దుబాటు చేసే పనులు మొదలయ్యాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి.

ఉమర్ ఢిల్లీలోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజ్​ లభ్యం

ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఢిల్లీలోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజీ బయటపడింది. బదర్పూర్ సరిహద్దు వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో ఉమర్ నడిపిన ఐ20 కారు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. తన వాహనం ఆపి టోల్ చెల్లించే సమయంలో మాస్క్‌ వేసుకున్నప్పటికీ అధికారులు ముఖాన్ని స్పష్టంగా గుర్తించారు. అలాగే కారు వెనుక సీట్లో పెద్ద సంచి ఉంది. అతను నేరుగా కెమెరాలోకి చూస్తూ చెల్లింపులు చేయడం చూస్తే, తనపై పోలీసుల నిఘా ఉందని తెలుసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

ఫరీదాబాద్‌లో ఉమర్ బంధువు అరెస్టు

ఫరీదాబాద్ పోలీసులు ఫహీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడే ఎరుపు ఎకోస్పోర్ట్ కారును ఖండవాళీ గ్రామంలో పార్క్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఫహీమ్ ప్రధాన నిందితుడు ఉమర్ బంధువని, పేలుడు ముందు వారిద్దరూ కాంటాక్ట్‌లో ఉన్నారని దర్యాప్తులో తేలింది. అలాగే ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం కాన్పూర్‌లో ఒక మెడికల్ విద్యార్థి మొహమ్మద్ ఆరిఫ్ ను అదుపులోకి తీసుకుంది. ఆరిఫ్‌కు డాక్టర్ షాహీన్ సయీద్ తో సంబంధం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఉమర్ డైరీలో రహస్య సమాచారం

దర్యాప్తులో డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజమ్మిల్ వద్ద నుంచి డైరీలు స్వాధీనం చేసుకున్నారు.

వాటిలో నవంబర్ 8–12 తేదీల మధ్య పేలుడు ప్రణాళిక వివరాలు, జమ్మూ–కాశ్మీర్, ఫరీదాబాద్ ప్రాంతాలకు చెందిన 25మంది పేర్లు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉగ్రదాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. దర్యాప్తు ఏజెన్సీల ప్రకారం, మొత్తం 8 మంది ఉగ్రవాదులు దేశంలోని 4 నగరాలను ముందుగా లక్ష్యంగా చేసుకుని, జంటలుగా విడిపోయి దాడులు చేయాలనే పథకం సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఇక ఈ వివరాలతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. ఎర్రకోట పేలుడు కేవలం మొదటి దశగా, మొత్తం టెర్రర్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు కేంద్ర ఏజెన్సీలు సంయుక్త ఆపరేషన్‌లు ప్రారంభించాయి.

మహిపాల్ పూర్‌లో మరో పేలుడు.. టైరు బ్లాస్ట్ గా నిర్ధారణ

రాజధాని ఢిల్లీలోని మహిపాల్ పూర్ ప్రాంతంలో గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం సుమారు 9.18 గంటల సమయంలో రాడిసన్ హోటల్ వద్ద ‘పేలుడు’ శబ్దం వినిపించిందన్న సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. దర్యాప్తు తర్వాత అనంతరం ఒక డీటీసీ బస్ ఢౌలాక్వాన్ వైపు వెళ్తుండగా వెనుక టైరు పేలిపోవడంతో ఆ పెద్ద శబ్దం వినిపించినట్లు సెక్యూరిటీ గార్డు తెలిపాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడ పరిశీలించినప్పుడు ఎలాంటి పేలుడు ఆనవాళ్లు లేవు, ఎలాంటి గాయాలుగానీ, నష్టం జరగలేదని నిర్ధారించారు. పేలుడు శబ్దం టైరు బ్లాస్ట్ కావడం వల్లే వచ్చింది. పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉంది. ఆందోళన అవసరం లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

భారీ ఉగ్ర కుట్రకు ‘తెర’లేపారు - Tholi Paluku