Let's talk: editor@tmv.in
భారత సైన్యానికి లైట్‌ మెషీన్‌ గన్స్‌ అందజేత

భారత సైన్యానికి లైట్‌ మెషీన్‌ గన్స్‌ అందజేత

Pinjari Chand
29 మార్చి, 2026

దేశీయ రక్షణ తయారీ రంగంలో మరో కీలక మైలురాయిగా అదానీ ఢిపెన్స్‌, ఎయిరోస్పేస్‌ సంస్థ నిలిచింది. భారత సాయుధ దళాలకు 41,000 ఎల్‌ఎంజీల ఆర్డర్‌లో భాగంగా తొలి విడతగా 2,000 ‘ప్రహర్’ లైట్ మెషిన్ గన్స్ (ఎల్‌ఎంజీస్‌)ను శనివారం అందజేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఇజ్రాయెల్‌ వెపన్‌ ఇండస్ట్రీస్‌ (ఐడబ్ల్యూఐ)తో సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఆయుధాలను తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద అమలవుతూ, దేశీయ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తోంది. రక్షణ శాఖలో అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (అక్విజిషన్) ఏ. అన్బరాస్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సరఫరా షెడ్యూల్ కంటే 600 రోజులు ముందుగానే పూర్తయ్యిందని, దీని వల్ల సుమారు 20 నెలల సమయం ఆదా అయిందని తెలిపారు. భారత రక్షణ పరిశ్రమ వేగం, సామర్థ్యం పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా అశీష్‌ రాజ్‌వంశీ మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాల కృషితో సంస్థ చిన్న భాగాల తయారీదారుగా ఉండి పూర్తి ఆయుధ తయారీదారుగా (ఓఈఎం) మారిందని తెలిపారు. దేశంలో చిన్న ఆయుధాల తయారీలో పూర్తి సామర్థ్యాన్ని నిర్మించడం తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం సంస్థ ఏడాదికి ఒక లక్ష గన్స్ తయారు చేసే సామర్థ్యాన్ని సాధించిందని, అత్యాధునిక నాణ్యత ప్రమాణాలతో ఉత్పత్తి జరుగుతోందని ఆయన వివరించారు. ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీతో తయారీ ప్రక్రియను ఆధునీకరించామని తెలిపారు.

పెరగనున్న భారత సైన్యం సామర్థ్యం

ఇక ఐడబ్య్లూఐ సీఈఓ షుకి ష్క్వార్ట్జ్‌ మాట్లాడుతూ ‘ప్రహర్’ ఎల్‌ఎంజీలు భారత సైన్య సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని తెలిపారు. ఇవి ఇజ్రాయెల్‌లో ‘నెగెవ్ ఎన్‌జీ7’ పేరుతో ఉపయోగంలో ఉన్నాయని చెప్పారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఇజ్రాయెల్‌లోని తమ ఉత్పత్తి కేంద్రాలు, భారత్‌లోని సంయుక్త సంస్థ ద్వారా అవసరాలను పూర్తిగా తీర్చగలమని ఆయన భరోసా ఇచ్చారు.

‘ప్రహర్’ ఎల్‌ఎంజీ ఓపెన్ బోల్ట్ వ్యవస్థపై పనిచేస్తూ, గ్యాస్ ఆపరేటెడ్ మెకానిజంతో రూపొందించింది. దీని బరువు సుమారు 7.6 కిలోలు ఉండి, మడత స్టాక్‌తో తేలికగా మోయడానికి అనుకూలంగా ఉంటుంది. పారాట్రూపర్లకు ఉపయోగపడే విధంగా దీని డిజైన్ రూపొందించారు. ఈ డెలివరీతో దేశీయ రక్షణ తయారీలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో ముందడుగు వేసినట్టైంది.

భారత సైన్యానికి లైట్‌ మెషీన్‌ గన్స్‌ అందజేత - Tholi Paluku