


భారత సామాజిక విప్లవ శిఖరం: బాబాసాహెబ్ అంబేద్కర్
జ్ఞానానికి నిలువుటద్దంలా, అణచివేతపై ఎక్కుపెట్టిన బాణంలా ఆధునిక భారతదేశ చరిత్రలో డాక్టర్ భీమ్‌రావ్ రామ్జీ అంబేద్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితం కాకుండా, యావత్ భారత పౌరుల ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని రాజ్యాంగబద్ధం చేసిన మహోన్నత మేధావి ఆయన. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అంటరానితనం అనే అమానవీయ సంకెళ్లను తెంచుకుంటూ, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుండి అత్యున్నత డిగ్రీలు సాధించిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన కలలు గన్న సమసమాజ స్థాపనే లక్ష్యంగా, ఏప్రిల్ 14న జరుపుకునే 'భీమ్ జయంతి' కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాట స్మృతి.
అంబేద్కర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అదొక మహోద్యమం. భారతదేశపు పునాదులను ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకికవాదంతో నిర్మించిన శిల్పి ఆయన. దళితులు, గిరిజనులు, కార్మికులు, మహిళల హక్కుల కోసం తన జీవితాంతం కలంతోనూ, గళంతోనూ పోరాడిన అపర మేధావి. ఆర్ధికవేత్తగా, న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, మానవతావాదిగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. ప్రపంచవ్యాప్తంగా 'జ్ఞాన దినోత్సవం'గా, 'సమానత్వ దినోత్సవం'గా జరుపుకోబడుతున్న ఆయన జయంతి వేడుకలు, నేటికీ వివక్షకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి గొంతుకకు ఒక వెలుగు దివ్వెలా నిలుస్తున్నాయి. అలాంటి మహానీయుని జీవిత విశేషాలు తెలుసుకుందాం…
అడ్డంకులను అధిగమించిన మేధస్సు
భారతదేశ గమనాన్ని మార్చిన మహనీయుడు, సామాజిక విప్లవకారుడు డాక్టర్ భీమ్‌రావ్ రామ్జీ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోహూలో ఒక సాధారణ దళిత కుటుంబంలో జన్మించిన ఆయన, అణచివేతకు గురైన వర్గాల గొంతుకగా నిలిచారు. ప్రతి ఏటా ఏప్రిల్ 14ను 'అంబేద్కర్ జయంతి' లేదా 'భీమ్ జయంతి'గా జరుపుకుంటాము. ఇది కేవలం ఒక వ్యక్తి పుట్టినరోజు మాత్రమే కాదు, భారతదేశంలో సమానత్వం కోసం జరిగిన పోరాటానికి గుర్తుగా 'సమానత్వ దినోత్సవం'గా కూడా పిలువబడుతుంది.
అంబేద్కర్ విద్యాభ్యాసం ఎంతో కష్టతరంగా సాగింది. అస్పృశ్యత కారణంగా తరగతి గది బయట కూర్చుని పాఠాలు వినాల్సి వచ్చినా, ఆయన మొక్కవోని పట్టుదలతో చదివారు. 1907లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో బి.ఏ పూర్తి చేశారు. బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో కొలంబియా యూనివర్సిటీలో ఎం.ఏ, పి.హెచ్.డి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టాను కూడా పొందారు. ఆయన 64 సబ్జెక్టులలో పాండిత్యం సంపాదించడమే కాకుండా 11 భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగేవారు.
సామాజిక పోరాటాలు - చౌదార్ చెరువు సత్యాగ్రహం
భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన పోరాటం చారిత్రాత్మకమైనది. 1927లో మహద్‌లోని చౌదార్ చెరువు నీటిని తాకే హక్కు కోసం ఆయన చేసిన సత్యాగ్రహం దళితుల ఆత్మగౌరవ పోరాటానికి నాంది పలికింది. "జ్ఞానం అందరి సొత్తు, ప్రకృతి వనరులు అందరికీ సమానమే" అని ఆయన చాటిచెప్పారు. అంటరానితనం అనే మహమ్మారిని రూపుమాపడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.
స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రి
భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశ తొలి కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక సామాజిక బహిష్కరణకు గురైన వర్గం నుండి వచ్చిన వ్యక్తి, దేశానికే చట్టాలను రూపొందించే అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ పదవిలో ఉంటూ ఆయన కేవలం న్యాయపరమైన అంశాలకే పరిమితం కాకుండా, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా దేశానికి దిశానిర్దేశం చేసే మహత్తర కార్యానికి నాయకత్వం వహించారు. ముఖ్యంగా మహిళలకు ఆస్తి హక్కులు, వివాహ హక్కులు కల్పించే విప్లవాత్మక 'హిందూ కోడ్ బిల్' ను రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సామాజిక సమానత్వం లేని రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదని నమ్మిన ఆయన, తన మంత్రి పదవి కాలంలో దేశ చట్టవ్యవస్థకు మానవీయ కోణాన్ని అద్దారు.
భారత రాజ్యాంగ రూపకల్పన
స్వతంత్ర భారత దేశానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్ పోషించిన పాత్ర అద్వితీయమైనది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిశానిర్దేశం చేసే అత్యుత్తమ రాజ్యాంగాన్ని ఆయన అందించారు. కుల, మత, లింగ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా ఆర్టికల్స్ రూపొందించారు. అందుకే ఆయనను 'భారత రాజ్యాంగ పితామహుడు' అని పిలుస్తారు.
అంబేద్కర్ కేవలం దళితుల కోసమే కాకుండా మహిళా హక్కుల కోసం కూడా తీవ్రంగా శ్రమించారు. 'హిందూ కోడ్ బిల్' ద్వారా మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు వంటి ప్రాథమిక హక్కులు కల్పించాలని పోరాడారు. "ఒక సమాజం ఎంత పురోగతి సాధించింది అనేది ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతిని బట్టి నేను కొలుస్తాను" అని ఆయన చెప్పిన మాటలు స్త్రీ సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తాయి.
అంబేద్కర్ గురించి చాలామందికి తెలియని విషయం ఆయన గొప్ప ఆర్థికవేత్త అని. నేటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు మూలబీజం అంబేద్కర్ రాసిన ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రుపీ: ఇట్స్ ఒరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’ అనే గ్రంథంలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, కరెన్సీ విలువ ఎలా స్థిరీకరించాలి అనే విషయాలపై ఆయనకు లోతైన అవగాహన ఉండేది.
బౌద్ధ మతం స్వీకారం
హిందూ మతంలోని కుల వివక్షను నిరసిస్తూ, 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో తన లక్షలాది అనుచరులతో కలిసి అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అహింస, సమానత్వం, మానవత్వం ఉన్న మతమే మనుషుల అభివృద్ధికి మార్గమని ఆయన నమ్మారు. ఈ సంఘటన భారత సామాజిక చరిత్రలో ఒక గొప్ప మలుపుగా నిలిచింది.
జాతీయ నివాళులు
అంబేద్కర్ జయంతి రోజున న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర జాతీయ నాయకులు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ముంబైలోని చైత్యభూమి, నాగ్‌పూర్‌లోని దీక్షాభూమికి లక్షలాది మంది ప్రజలు చేరుకుని తమ ప్రియతమ నాయకుడికి నివాళులు అర్పిస్తారు. 2016లో ఆయన 125వ జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.
అంతర్జాతీయ గుర్తింపు
అంబేద్కర్ ఖ్యాతి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఐక్యరాజ్యసమితి 2016 నుండి వరుసగా మూడు సంవత్సరాలు అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించింది. అమెరికాలోని కొలరాడో, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు, కెనడాలోని బ్రిటీష్ కొలంబియా బర్నబీ వంటి నగరాలు ఏప్రిల్ 14ను 'సమానత్వ దినోత్సవం'గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం ఆయన ప్రపంచస్థాయి మేధస్సుకు నిదర్శనం.
భారతరత్న, స్మారక ముద్రలు
అంబేద్కర్ చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగా 1990లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను మరణానంతరం ప్రకటించింది. భారత తపాలా శాఖ 1966 నుండి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ఆయన జ్ఞాపకార్థం తపాలా బిళ్ళలను విడుదల చేసింది. అలాగే ఆయన 125వ జయంతి సందర్భంగా రూ.10 మరియు రూ.125 నాణేలను ప్రభుత్వం విడుదల చేసింది.
డిజిటల్ యుగంలో అంబేద్కర్
అంబేద్కర్ ఆలోచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తున్నాయి. 2015లో గూగుల్ ఆయన గౌరవార్థం ప్రత్యేకమైన 'డూడుల్'ను రూపొందించింది. ఇది భారతదేశంతో పాటు అర్జెంటీనా, చిలీ, బ్రిటన్ వంటి దేశాల్లో ప్రదర్శించబడింది. అలాగే ట్విట్టర్ కూడా ఆయన గౌరవార్థం ప్రత్యేక ఎమోజీని విడుదల చేసింది. 2020లో కోవిడ్ సమయంలో ప్రపంచంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ అంబేద్కర్ జయంతిని నిర్వహించడం విశేషం.
జ్ఞాన దినోత్సవం
మహారాష్ట్ర ప్రభుత్వం 2017లో అంబేద్కర్ జయంతిని 'జ్ఞాన దినోత్సవం'గా ప్రకటించింది. నిరంతరం నేర్చుకోవాలనే తపన, అపారమైన జ్ఞాన సంపద కలిగిన ఆయన జీవితం విద్యార్థులకు మార్గదర్శకం కావాలనేది దీని ముఖ్య ఉద్దేశ్యం. చదువే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆయన బలంగా నమ్మేవారు.
దళితులు, ఆదివాసీలు, కార్మికులు మరియు శ్రామిక వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. రాజ్యాంగంలో రిజర్వేషన్ల కల్పన ద్వారా వెనుకబడిన వర్గాలకు రాజకీయ, విద్యా రంగాల్లో ప్రాతినిధ్యం లభించేలా చూసి అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారు . కుల నిర్మూలన కోసం ఆయన రాసిన 'అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్'(కుల నిర్మూలనం) నేటికీ ఒక ప్రామాణిక గ్రంథంగా నిలిచిపోయింది.
నేటి భారతదేశం అనుభవిస్తున్న ప్రజాస్వామ్య ఫలాలు, ఓటు హక్కు, కార్మిక చట్టాలు (ఎనిమిది గంటల పని దినం వంటివి) అంబేద్కర్ ముందుచూపు ఫలితమే. ఆయన కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు. ఆధునిక భారతదేశ నిర్మాత. నదుల అనుసంధానం, నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా ఆయన అందించిన ప్రణాళికలు అద్భుతమైనవి.
బాబాసాహెబ్ 135వ జయంతి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని 2026 ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని 'మౌ' (ప్రస్తుతం అంబేద్కర్ నగర్) లో జన్మించిన ఈ మహనీయుని స్మరిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజును గెజిటెడ్ సెలవు దినంగా ప్రకటించాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడమే కాకుండా, పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆయన చేసిన సామాజిక విప్లవాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా, దీనిని 'సమానత్వ దినోత్సవం' గా జరుపుకోవడం ద్వారా సామాజిక న్యాయం, మహిళా సాధికారత, కుల నిర్మూలన కోసం ఆయన అందించిన విలువల పట్ల యువతలో చైతన్యాన్ని నింపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ అనుచరులు, మానవతావాదులు ఆయన ఆశయ సాధన కోసం పునరంకితమయ్యే ఒక గొప్ప సందర్భమిది.
ఆయన సేవలను కొనియాడుతూ హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఎన్టీఆర్ గార్డెన్ పక్కన ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ప్రస్తుతం నగరంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాలలో ఒకటిగా నిలుస్తుంది. 125 అడుగుల ఎత్తు కలిగిన ఈ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి, 2023లో ఆవిష్కరించింది. ఈ విగ్రహం 50 అడుగుల ఎత్తైన పీఠంపై (మొత్తం 175 అడుగులు) గంభీరంగా నిలబడి, సామాజిక న్యాయం మరియు సమానత్వానికి ప్రతీకగా కనిపిస్తుంది. రాజ్యాంగ నిర్మాత గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ భారీ కట్టడం పర్యాటకులను విశేషంగా ఆకర్షించడమే కాకుండా, నగరానికే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
పార్లమెంట్ హౌస్ లో వేడుకలు
అంబేద్కర్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో జరిగే వేడుకలు అధికారికంగా నిర్వహిస్తారు. పార్లమెంట్ ప్రాంగణంలోని బాబాసాహెబ్ భారీ విగ్రహం వద్ద ప్రతి ఏటా ఏప్రిల్ 14న దేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, వివిధ రాజకీయ పార్టీల నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనం వెలుపల వేలాది మంది ప్రజలు, బౌద్ధ భిక్షువులు, అంబేద్కర్ అనుచరులు తరలివచ్చి 'జై భీమ్' నినాదాలతో ఆ ప్రాంతాన్ని చైతన్యపరుస్తారు. సామాజిక న్యాయం పట్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉన్న కట్టుబాటును చాటిచెప్పేలా ఈ ఉత్సవం అత్యంత గంభీరంగా, స్ఫూర్తిదాయకంగా సాగుతుంది.
జ్ఞానమే అసలైన ఆయుధం
నేటి ఆధునిక యుగంలో యువతకు బాబాసాహెబ్ అందించిన అతిపెద్ద సందేశం "చదువు". అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ కూడా ఆయన ప్రపంచస్థాయి మేధావిగా ఎదిగారు. నేటి యువత చిన్న చిన్న కష్టాలకే కుంగిపోకుండా, క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన జీవితం నిరూపిస్తుంది. కేవలం డిగ్రీలు పొందడమే కాకుండా, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండటం, విశ్లేషణాత్మక ఆలోచనలు పెంచుకోవడం, నిరంతర అభ్యాసకుడిగా ఉండటం అనేది ప్రతి యువకుడు ఆయన నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం.
అంబేద్కర్ కేవలం తన వ్యక్తిగత అభివృద్ధి కోసమే కాకుండా, తన జాతి కోసం, దేశం కోసం జీవించారు. "బోధించు, సమీకరించు, పోరాడు" అనే నినాదం నేటి యువతకు దిక్సూచి కావాలి. సామాజిక మాధ్యమాల్లో కేవలం సమయాన్ని వృధా చేయకుండా, సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించే ధైర్యాన్ని, రాజ్యాంగం పట్ల గౌరవాన్ని యువత పెంపొందించుకోవాలి. కుల, మత వైషమ్యాలకు అతీతంగా మానవత్వాన్ని ప్రేమించే గుణాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యతను ఆయన స్ఫూర్తితో స్వీకరించినప్పుడే, భారతదేశం ఆయన కలలుగన్న సమసమాజంగా మారుతుంది. యువత తమ మేధస్సును దేశ ప్రగతికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించినప్పుడే బాబాసాహెబ్‌కు ఇచ్చే నిజమైన నివాళి.
