Let's talk: editor@tmv.in
భారత సందర్శనకు యూకే ప్రధాని

భారత సందర్శనకు యూకే ప్రధాని

Yekkirala Akshitha
9 అక్టోబర్, 2025

ఇండియా, బ్రిటన్​ మధ్య సంబంధాలు మరింత బలపడే విధంగా, ఆ దేశ ప్రధాని కీర్​ స్టార్మర్ అక్టోబర్ 8(బుధవారం) ముంబైలో తొలి అధికారిక సందర్శన కోసం విచ్చేశారు. రెండు రోజుల పాటు ఆయన దేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సహకరించుకునేందుకు అడుగులు పడనున్నాయి. స్టార్మర్ ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగిడిన వెంటనే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్​ నాథ్ షిండే, అజిత్ పవార్, గవర్నర్ ఆచార్య దేవ్‌ప్రత తదితరులు స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్రమోడి సోషల్ మీడియాలో ఇది చారిత్రాత్మక సందర్శన అని పేర్కొంటూ, యూకే అతిపెద్ద వ్యాపార ప్రతినిధి మండలిని తీసుకుని వచ్చిందని తెలిపారు.

పెట్టుబడులను సులభం చేయడం

ఇరు దేశాల మధ్య ఈ ఏడాది జూలైలో కుదుర్చుకున్న Comprehensive Economic and Trade Agreement (CETA) ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని ప్రధాని స్టార్మర్ పిలుపునిచ్చారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రధాన వస్తువులపై (వస్త్రాలు, విస్కీ, ఆటోమొబైల్స్) తదితర వస్తువులపై పన్నులు తగ్గించడం, సేవలను విస్తరించడం,పెట్టుబడుల ప్రవాహాలను సులభతరం చేయడం లక్ష్యంగా ఉండనుంది. ఈ ఒప్పందంతో 2040 నాటికి వార్షిక వ్యాపార పరిమాణం 3.4 లక్షల కోట్ల రూపాయల వరకూ పెరిగే అవకాశముందని యూకే ప్రభుత్వం భావిస్తున్నది.

రక్షణ, క్రిటికల్ టెక్నాలజీస్, వాతావరణ మార్పు, ఆరోగ్యం, విద్య, కనెక్టివిటీ రంగాలలో కలిసి పనిచేయడం విజన్ 2035 ప్రణాళికలో భాగంగా ఉంది. ఫిన్‌టెక్, క్వాంటం కంప్యూటింగ్, గ్రీన్ టెక్‌ల వంటి రంగాల్లో పరిశోధన సాగుతుందని భావిస్తున్నారు.

యూకే లో భారతీయ సినిమాల నిర్మాణం

ప్రధాని స్టార్మర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోను సందర్శించి 2026 నుంచి యూకేలో భారతీయ సినిమాల నిర్మాణం జరుగుతుందని ప్రకటించారు. ఇది ఉద్యోగాలను సృష్టించి , ఇరు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధాలను బలపరుస్తుందని భావిస్తున్నారు. ముంబైలోని కోపరేజ్ గ్రౌండ్‌లో జరిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ ను వీక్షించారు.

ప్రధాన సమస్యలు

వీసా, వలస విధానాల్లో మార్పులకు సంబంధించి ఎలాంటి చర్చలు ఉండవని స్టార్మర్ స్పష్టంగా తెలిపారు. యూకే లో వలసల నియంత్రణకు సంబంధించి ఉభయపక్షాలపై ఒత్తిడి ఉన్నందున పెద్ద ఎత్తున వీసా విధానాల్లో మార్పులు ఆశించలేమని చెప్పారు.వ్యాపార ఒప్పందాలు పూర్తయినా పూర్తి ప్రయోజనాలు అందుకోవడానికి కాస్తా సమయం, న్యాయపరమైన చర్యలు అవసరం. పన్నుల తగ్గింపులు, నియంత్రణ, సరళీకరణ, వివాద పరిష్కారం తదితర అంశాలు సక్రమంగా అమలు కావాల్సి ఉంది. ప్రపంచ భద్రత, వాతావరణ మార్పులు, ప్రాంతీయ స్థిరత్వం (ఇండో-పసిఫిక్ వంటి)పై కూడా చర్చించవచ్చని భావిస్తున్నారు. యూఎస్,యూరోప్, చైనా వంటి ఇతర దేశాలతో యూకే సంబంధాలు కూడా వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు.

తదుపరి కార్యక్రమాలు

• ఇరు దేశాల ప్రధానుల మధ్య సమావేశం గురువారం జరుగుతుంది. తరువాత ఇరువురు ప్రధానులు రాజభవన్ వద్ద సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు.

• 6వ అంతర్జాతీయ ఫిన్‌టెక్ కార్యక్రమంలో ఇరువురు ప్రధాన మంత్రులు డిజిటల్ ఫైనాన్స్, నియంత్రణ, విస్తరణ అంశాలపై ప్రసంగిస్తారు.

• ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, ఔషధాల రంగాలలో భారత పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు ఉంటాయి.

• అకాడమిక్ మార్పిడి, సంయుక్త పరిశోధనా కేంద్రాలు, మీడియా సహకారం పై చర్చ ఉంటుంది.

పన్నుల తగ్గింపు, సేవల సరళీకరణ, నియంత్రణ ఎలా అమలవుతాయో చూడాలి. బ్రిటన్ ప్రధాని సందర్శన భారత-యూకే సంబంధాల పరంగా ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ సందర్శన ద్వారా దౌత్య సంబంధాలను వాస్తవ ఫలితాలుగా మార్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతిక మార్పిడి, వ్యూహాత్మక సహకారం మొదలైనవాటిలో భారతదేశానికి ప్రపంచంలో కీలక భాగస్వామిగా తన స్థానాన్ని బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుంది.

భారత సందర్శనకు యూకే ప్రధాని - Tholi Paluku