
భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త రామనాథన్‌కు ప్రతిష్టాత్మక క్రాఫోర్డ్ పురస్కారం
ప్రపంచ పర్యావరణాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ సంతతి శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్ (82)కు ప్రతిష్టాత్మక 'క్రాఫోర్డ్ ప్రైజ్ 2026' వరించింది. భూమి వేడెక్కడానికి (గ్లోబల్ వార్మింగ్) కారణమయ్యే కారకాలపై ఆయన చేసిన పరిశోధనలకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ అవార్డును సైన్స్ రంగంలో 'నోబెల్' బహుమతితో సమానంగా భావిస్తారు.
ఎవరీ వీరభద్రన్ రామనాథన్?
మదురైలో జన్మించి, చెన్నైలో పెరిగిన రామనాథన్ తన వృత్తి జీవితాన్ని సికింద్రాబాద్‌లోని ఒక ఫ్రిజ్‌ల తయారీ కంపెనీలో ఇంజనీర్‌గా ప్రారంభించారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే ఆయన మొదటిసారిగా సీఎఫ్‌సీ (క్లోరోఫ్లోరో కార్బన్ల) గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన అన్నామలై విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించి, డిగ్రీలు పొందారు.ఆ తర్వాత అమెరికా వెళ్లి వాతావరణ శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేశారు.
ఆయన చేసిన గొప్ప ఆవిష్కరణ ఏంటి?
సాధారణంగా భూమి వేడెక్కడానికి కేవలం వాహనాలు, పరిశ్రమల నుండి వచ్చే ‘కార్బన్ డయాక్సైడ్’ మాత్రమే కారణమని భావిస్తాం. కానీ, శాస్త్రవేత్త రామనాథన్ 1975లోనే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. ఇంట్లో వాడే ఫ్రిజ్‌లు, ఏసీలు, స్ప్రే బాటిళ్ల నుండి వెలువడే సీఎఫ్‌సీ అనే వాయువులు పర్యావరణానికి చాలా ప్రమాదకరమని ఆయన నిరూపించారు.
ఈ వాయువులకు కార్బన్ డయాక్సైడ్ కంటే 10,000 రెట్లు ఎక్కువగా వేడిని పట్టి ఉంచే శక్తి ఉందని, తద్వారా ఇవి భూమిని వేగంగా వేడెక్కిస్తాయని ఆయన హెచ్చరించారు. ఆయన చేసిన ఈ కీలక పరిశోధనల వల్లే, పర్యావరణానికి హాని చేసే ఇటువంటి వాయువులను అదుపు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి 'మాంట్రియల్ ప్రోటోకాల్' వంటి అంతర్జాతీయ ఒప్పందాలను చేసుకున్నాయి
భారతదేశ రుతుపవనాలపై పరిశోధన
రామనాథన్ కేవలం గాలిలోని వాయువులనే కాకుండా, ఆసియా దేశాలపైన ఉండే 'నల్లటి మబ్బుల' గురించి కూడా పరిశోధన చేశారు. కాలుష్యం వల్ల ఏర్పడే ఈ మబ్బులు భారతదేశంలో వర్షాలు (రుతుపవనాలు) తగ్గడానికి, హిమాలయాల్లో మంచు కరగడానికి కారణమవుతున్నాయని ఆయన హెచ్చరించారు.
పోప్ నుంచి రాజకీయ నాయకుల వరకు సలహాదారుగా..
ఆయన ప్రతిభను గుర్తించి వాటికన్ సిటీలోని పోప్ ఫ్రాన్సిస్ కూడా పర్యావరణ మార్పులపై రామనాథన్ సలహాలు తీసుకున్నారు. ప్రపంచ దేశాల నాయకులు పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఆయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అవార్డు విశేషాలు
ఈ ప్రతిష్టాత్మక 'క్రాఫోర్డ్' పురస్కారం కింద వీరభద్రన్ రామనాథన్ కు బంగారు పతకంతో పాటు భారీ నగదు బహుమతి లభించనుంది. దీని విలువ సుమారు 8 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు (అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 6.5 కోట్ల రూపాయలకు పైగా) ఉంటుంది. ఈ అత్యున్నత పురస్కారాన్ని 2026 మే నెలలో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్, లండ్ నగరాల్లో నిర్వహించే ‘క్రాఫోర్డ్ డేస్’ వేడుకల్లో ఆయనకు అందజేయనున్నారు.
వాతావరణ శాస్త్రానికి గర్వకారణం
ఈ అవార్డు రావడంపై రామనాథన్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది వాతావరణ శాస్త్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని అన్నారు. భారతీయ మూలాలున్న ఒక శాస్త్రవేత్త అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు పొందడం భారత్‌కు ఎంతో గర్వకారణం. పర్యావరణాన్ని కాపాడటంలో ఆయన చేసిన అలుపెరగని కృషి, రాబోయే తరాల యువ శాస్త్రవేత్తలకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది.
