Let's talk: editor@tmv.in
భారత విప్లవ వీరగాథ: దేశం గర్వించే నేతాజీ

భారత విప్లవ వీరగాథ: దేశం గర్వించే నేతాజీ

Dantu Vijaya Lakshmi Prasanna
23 జనవరి, 2026

భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎందరో వీరులు తమ రక్తాన్ని ధారపోశారు. కానీ, "బానిసలుగా బ్రతకడం కంటే, స్వతంత్రం కోసం పోరాడుతూ మరణించడం మేలు" అని గర్జించిన ఏకైక సింహం నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొందుతున్న కాలంలో, వారి కళ్లలోకి కళ్లు పెట్టి చూసి, సాయుధ పోరాటంతో గడగడలాడించిన ధీశాలి ఆయన.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక గొప్ప భారతీయ జాతీయవాది. ఆయన అపారమైన దేశభక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆయనను 'ఆజాద్ హింద్ ఫౌజ్' వ్యవస్థాపకుడిగా మనం గౌరవిస్తాము. "తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా" (మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్నిఇస్తాను) అనేది ఆయన అత్యంత ప్రసిద్ధ నినాదం. నేడు మనం ఆయన జయంతిని 'పరాక్రమ్ దివస్' గా జరుపుకుంటున్నాము. నేతాజీ 129వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఒక ప్రత్యేక కథనం…

ఒక అసాధారణ మేధావి

1897 జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో ఒక సంపన్న కుటుంబంలో సుభాష్ జన్మించారు. తండ్రి జానకినాథ్ బోస్ ప్రసిద్ధ న్యాయవాది, తల్లి ప్రభావతి దేవి క్రమశిక్షణ గల గృహిణి. 14 మంది సంతానంలో సుభాష్ 9వ వారు. చిన్నతనం నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహ మెండుగా ఉండేవి.

కటక్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత, కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. అక్కడ ఒక ఆంగ్లేయ ప్రొఫెసర్ భారతీయులను కించపరచడాన్ని సహించలేక, ఆయనపై తిరుగుబాటు చేసి కాలేజీ నుంచి బహిష్కరించబడ్డారు. ఈ సంఘటన ఆయనలోని విప్లవకారుడిని మేల్కొల్పింది. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లి, ప్రపంచంలోనే అత్యంత కఠినమై న ఐ.సి.ఎస్ (ICS) పరీక్షలో 4వ ర్యాంకు సాధించారు. కానీ, బ్రిటిష్ వారికి సేవ చేయడం ఇష్టం లేక, ఆ ఉన్నతమైన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి దేశం కోసం తిరిగి వచ్చారు.

గాంధీజీతో విభేదాలు

భారతదేశం తిరిగి వచ్చిన బోస్, చిత్తరంజన్ దాస్ మార్గదర్శకత్వంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలినాళ్లలో మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే, గాంధీజీ అనుసరించే "అహింసా మార్గం" ద్వారా మాత్రమే స్వాతంత్ర౦ రాదని సుభాష్ చంద్రబోస్ నమ్మేవారు. "బ్రిటిష్ వారు మనల్ని తుపాకులతో భయపెడుతున్నప్పుడు, మనం చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం లేదు" అనేది ఆయన వాదన.

1938లో హరిపుర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1939లో త్రిపురి కాంగ్రెస్ ఎన్నికల్లో గాంధీజీ మద్దతు ఉన్న పట్టాభి సీతారామయ్యను ఓడించి రెండోసారి అధ్యక్షుడయ్యారు. కానీ, పార్టీలో అంతర్గత విభేదాల వల్ల ఆయన రాజీనామా చేసి, 'ఫార్వర్డ్ బ్లాక్' పార్టీని స్థాపించారు.

కళ్ల గప్పి విదేశాలకు..

రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు, బ్రిటిష్ వారి బలహీనతను మనకు అవకాశంగా మార్చుకోవాలని బోస్ భావించారు. దీనిని పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను గృహనిర్బంధంలో ఉంచింది. కానీ, 1941 జనవరి 16 అర్ధరాత్రి, ఒక పఠాన్ వేషధారణలో బ్రిటిష్ గూఢచారుల కళ్లుగప్పి కోల్‌కతా నుంచి తప్పించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, రష్యా మీదుగా జర్మనీ చేరుకున్నారు. అక్కడ హిట్లర్‌ను కలిసి భారత స్వాతంత్ర౦ కోసం మద్దతు కోరారు.

ఆజాద్ హింద్ ఫౌజ్: సాయుధ సంగ్రామం

జర్మనీ నుంచి జలాంతర్గామిలో ప్రయాణించి జపాన్ చేరుకున్న బోస్, అక్కడ రాష్ బిహారీ బోస్ స్థాపించిన 'ఇండియన్ నేషనల్ ఆర్మీ' బాధ్యతలు చేపట్టారు. ఆయన రాకతో సైన్యంలో కొత్త ఉత్సాహం వచ్చింది. సింగపూర్‌లో ఆయన చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది.

"మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర౦ ఇస్తాను!"

ఆయన సైన్యంలో కుల, మత విభేదాలు లేవు. మహిళల కోసం రాణి ఝాన్సీ రెజిమెంట్' ను ఏర్పాటు చేసి, స్త్రీలు కూడా యుద్ధరంగంలో పోరాడగలరని నిరూపించారు. "ఢిల్లీ చలో" నినాదంతో ఐఎన్‌ఏ దళాలు మణిపూర్ సరిహద్దుల వరకు వచ్చి బ్రిటిష్ సైన్యంతో హోరాహోరీగా తలపడ్డాయి.

ఒక వీడని చిక్కుముడి

1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు ప్రకటించారు. అయితే, ఈ మరణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఆయన చనిపోయారా లేక అజ్ఞాతంలోకి వెళ్లారా అనే దానిపై అనేక కమిషన్లు వేసినా స్పష్టమైన ఆధారాలు లభించలేదు.

నేతాజీ వారసత్వం

నేతాజీ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడు. స్వాతంత్ర౦ వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉండాలో ఆయన ముందే ఊహించారు. ప్రణాళికా సంఘం ఏర్పాటు ఆలోచన ఆయనదే.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర చరిత్రలో ఒక ధ్రువతార. ఆయన చూపిన ధైర్యం భారత సైనికుల్లో జాతీయతను నింపింది. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర౦లో నేతాజీ చిమ్మిన రక్తం, ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనివి. భారతీయుల గుండెల్లో ఆయన ఎప్పటికీ 'నేతాజీ'గానే నిలిచిపోతారు.

పరాక్రమ్ దివస్

భారత ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని 'పరాక్రమ్ దివస్' గా జరుపుకోవాలని 2021వ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించింది. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని, జనవరి 19, 2021న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. మొదటి పరాక్రమ్ దివస్ జనవరి 23, 2021న దేశవ్యాప్తంగా మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు.

నేతాజీ చూపిన అసమానమైన ధైర్యాన్ని, దేశం పట్ల ఆయనకు ఉన్న నిరుపమానమైన దేశభక్తిని గౌరవిస్తూ, యువతలో స్ఫూర్తిని నింపడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం 2026వ జనవరి 23న మనం నేతాజీ 129వ జయంతిని 'పరాక్రమ్ దివస్'గా జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా ఈ రోజున నేతాజీ సాధించిన విజయాలను స్మరించుకుంటూ, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అండమాన్ నికోబార్ దీవులలోని అతిపెద్ద అనామక ద్వీపాలకు పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టడం వంటి కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం ఈ పరాక్రమ్ దివస్ సందర్భాంగానే చేపట్టింది.

"రక్తం ధారపోసిన వీరుడికి... రక్తం ఉడికే యువత సమర్పించే నివాళి!"

ఆకాశమంత ఎత్తు ఎదిగినా, తన మూలాలను మర్చిపోని ఒక మహా మనిషి.. సుఖాల సుడిగుండంలో మునిగిపోకుండా, దేశం కోసం కష్టాల కడలిని ఈదిన ఒక అగ్నిపుత్రుడు.. ఆయనే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్.

నేడు మనం పీల్చుకుంటున్న ఈ స్వేచ్ఛా వాయువుల వెనుక, ఎందరో వీరుల ప్రాణత్యాగాలు ఉన్నాయి. కానీ, ఒక వ్యక్తి మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే కదిలించి, "నా దేశం నాది" అని ప్రపంచం గర్వించేలా గర్జించాడు. నేటి యువతకు నేతాజీ అంటే కేవలం ఒక చరిత్ర పుస్తకంలోని పాఠం కాదు, మన గుండెల్లో నిరంతరం మండే ఒక స్ఫూర్తి జ్వాల!

మనం ఒక చిన్న కష్టం వస్తేనే కుంగిపోతుంటాం, కానీ ఆనాడు నేతాజీ.. తనకున్న ఐ.సి.ఎస్ హోదాను, విలాసవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా వదిలేశారు. ఎందుకు? మనందరం ఈరోజు తలెత్తుకుని బ్రతకడం కోసం! ఆయన నాడు ఇచ్చిన నినాదం 'జై హింద్'.. అది కేవలం ఒక మాట కాదు, అది ఒక జాతి ఆత్మగౌరవం.

"నా రక్తం ధారపోస్తాను.. మీరు నాకు తోడుగా రండి" అని ఆయన పిలుపునిచ్చినప్పుడు, వేలమంది యువకులు ప్రాణాలకు తెగించి ఆయన వెనుక నడిచారు. మరి ఈరోజు, అదే దేశం కోసం మనం కనీసం ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండలేమా? నేతాజీ జయంతి అంటే కేవలం ఆయన ఫోటోకు పూలమాల వేయడం కాదు.. ఆయన ఆశయాలను మన గుండెల్లో నింపుకోవడం.

ఆయనలోని ధైర్యం మన ఊపిరి కావాలి.. ఆయనలోని దేశభక్తి మన రక్తంలో ప్రవహించాలి. పదండి.. నేతాజీ చూపిన బాటలో, నవ భారతాన్ని నిర్మించేందుకు మనం కూడా ఒక సైనికుల్లా కదులుదాం.

జై హింద్.. జై నేతాజీ!