Let's talk: editor@tmv.in
భారత వారసత్వానికి ఈ ఏడాది ప్రత్యేకమైంది:‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ

భారత వారసత్వానికి ఈ ఏడాది ప్రత్యేకమైంది:‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ

Pinjari Chand
29 డిసెంబర్, 2025

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ప్రతి నెల నిర్వహిస్తున్న రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’129వ ఎపిసోడ్ లో 2025 సంవత్సరాన్ని భారతీయ విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాల పరంగా చరిత్రాత్మకమైన ఏడాదిగా అభివర్ణించారు. భారత్‌ విశ్వాసం, సంస్కృతి, ప్రత్యేక వారసత్వం 2025లో ఒకే చోట కలిసి కనిపించాయని ఆయన స్పష్టం చేశారు. జాతీయ భద్రత, క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగం, అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రభావం ఈ ఏడాది స్పష్టంగా కనిపించిందని ప్రధాని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయునికి గర్వకారణంగా మారిందని, దేశ భద్రత విషయంలో భారత్ ఎలాంటి రాజీ పడదని ప్రపంచానికి స్పష్టమైన సందేశం వెళ్లిందన్నారు.

పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ ఖచ్చితమైన దాడులు నిర్వహించిందని ప్రధాని గుర్తు చేశారు. మే 10న ఇరు దేశాలు సైనిక ఉద్రిక్తత ముగింపుపై అవగాహనకు వచ్చాయని తెలిపారు. జాతీయ గేయం‘వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని, #VandeMataram150 హ్యాష్‌ట్యాగ్‌తో విశేష స్పందన లభించిందని మోడీ చెప్పారు.

క్రీడారంగంలో 2025 మరపురాని ఏడాదిగా నిలిచిందని పేర్కొంటూ, భారత పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ గెలుచుకున్నాయని తెలిపారు. అలాగే మహిళల బ్లైండ్ టీం టీ 20 వరల్డ్ కప్, ఆసియా కప్ టీ20 విజయాలతో పాటు పారా క్రీడాకారుల పతకాలు దేశానికి గర్వాన్ని తెచ్చాయని అన్నారు.

శాస్త్ర, అంతరిక్ష రంగాల్లో భారత్ భారీ ముందడుగు వేసిందని, శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారని చెప్పారు. ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, దానికి ప్రధాన కారణం దేశ యువశక్తేనని ప్రధాని పేర్కొన్నారు.

ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండింది

సంవత్సరం ఆరంభంలో ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహాకుంభ్ 2025 ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సంవత్సరం చివర్లో అయోధ్యలోని రామ జన్మభూమి మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి భారతీయుని గుండెను గర్వంతో నింపిందని అన్నారు. 2025లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ్ మేళా అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించిందని పేర్కొన్నారు. మహాశివరాత్రి శుభదినాన మహాకుంభ్ ముగియడం విశేషమని, కోట్లాది మంది భక్తుల భాగస్వామ్యంతో ఆధ్యాత్మిక ఐక్యత, దైవిక శక్తి ప్రతిబింబించిందని ఆయన తెలిపారు.

రామ మందిరం – దేశ గౌరవానికి చిహ్నం

అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ శిఖరంపై ఇటీవల 191 అడుగుల ఎత్తైన కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా రామ మందిర నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఇది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఘట్టమని వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ భాషలకు గౌరవం

మన్ కీ బాత్‌లో ప్రధాని విదేశాల్లో భారతీయ భాషల పరిరక్షణపై జరుగుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫిజీలోని రకిరాకి ప్రాంతంలోని ఒక పాఠశాలలో తొలిసారిగా నిర్వహించిన ‘తమిళ్ డే’ కార్యక్రమాన్ని ప్రధాని కొనియాడారు. విద్యార్థులు కవితలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తమ భాషపై గర్వాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. తమిళం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషలలో ఒకటి అని ప్రధాని పేర్కొన్నారు. వారణాసిలో నిర్వహించిన కాశీ తమిళ సంగమం కూడా భాషా అధ్యయనానికి దోహదపడిందన్నారు. అలాగే దుబాయ్‌లో ఏర్పాటు చేసిన కన్నడ పాఠశాల ద్వారా పిల్లలకు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పుతున్నారని తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా భారతీయ భాషల పట్ల గౌరవం పెరుగుతుండటం గర్వకారణమని చెప్పారు.

స్వదేశీ ఉత్పత్తులపై ప్రధాని ప్రశంసలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2025 సంవత్సరం భారతదేశానికి ఆర్థికంగా, ఆత్మవిశ్వాస పరంగా కీలక మలుపుగా నిలిచిందని అన్నారు. స్వదేశీ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో పెరిగిన ఉత్సాహం భారత్‌కు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ ఉద్యమాల వల్ల 2025 భారత్‌కు అపూర్వమైన ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ప్రజలు భారతీయుల శ్రమతో తయారైన వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. ఈ రోజు గర్వంగా చెప్పగలం. 2025 భారత్‌ను మరింత బలంగా నిలబెట్టిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

మేక్ ఇన్ ఇండియా – వోకల్ ఫర్ లోకల్‌కు ప్రజల మద్దతు

స్వదేశీ ఉత్పత్తుల వినియోగం ఈ ఏడాది గణనీయంగా పెరిగిందని ప్రధాని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ అనే భావనలు కేవలం నినాదాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో భాగమయ్యాయని చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా స్థానిక వ్యాపారాలకు బలం, ఉపాధి అవకాశాల పెంపు, దేశీయ తయారీ సామర్థ్యాల అభివృద్ధి జరిగిందని ప్రధాని వివరించారు. దీంతో పాటు, ఢిల్లీ చాంద్ నీ చౌక్ ఎంపీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ చేసిన ప్రకటనను ప్రధాని ప్రస్తావించారు. ప్రధాని మోడీ పిలుపుతో ఈ ఏడాది స్వదేశీ దీపావళిగా జరుపుకున్నామని తెలిపారు.

సీఏఐటీ ప్రారంభించిన భారతీయ సామాన్ – హమారా స్వాభిమాన (భారతీయ వస్తువులు – మన గౌరవం) అనే జాతీయ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు.

చైనా ఉత్పత్తులకు గుడ్‌బై

దేశవ్యాప్తంగా వ్యాపారులు స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించగా, వినియోగదారులు కూడా మేక్ ఇన్ ఇండియా భావనపై అపూర్వమైన నమ్మకాన్ని ప్రదర్శించారని ప్రధాని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ రేట్ల తగ్గింపులు దేశీయ వాణిజ్యానికి మరింత బలాన్ని ఇచ్చాయని చెప్పారు. దీని ఫలితంగా, ఈ దీపావళికి చైనా ఉత్పత్తులు భారత మార్కెట్లలో దాదాపు కనిపించకుండా పోయాయి అని సీఏఐటీ వెల్లడించింది. 2021లో ప్రారంభించిన బాయ్‌కాట్ చైనా గూడ్స్ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మారిందని తెలిపారు.