Let's talk: editor@tmv.in
భారత రాజ్యాంగమే దేశ పరిమళం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాజ్యాంగమే దేశ పరిమళం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Pinjari Chand
27 నవంబర్, 2025

మన రాజ్యాంగం కేవలం చట్టాలు ఉన్న పుస్తకం మాత్రమే కాదు. ఇది దేశ గర్వం, దేశ గుర్తింపు, దేశ ఆత్మవిశ్వాసమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్వేగంగా మాట్లాడారు. బుధవారం సంవిధాన్ సదన్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలో ఆమె మాట్లాడారు. వలస పాలకుల ఆనవాళ్లను పూర్తిగా తుడిచేసి.. జాతీయతా భావనతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది మన రాజ్యాంగం అని రాష్ట్రపతి కొనియాడారు. ఈ ఆలోచనతోనే బ్రిటిష్ కాలం నాటి మూడు నేర చట్టాలను పూర్తిగా తొలగించి, భారతీయ ఆత్మకు తగ్గట్టు మూడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు.

భారతీయ న్యాయ సంహిత

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత

భారతీయ సాక్ష్య అధినియమం

‘శిక్ష కాదు.. న్యాయం’ ముఖ్యం అనే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఈ చట్టాలు 2024 జులై 1 నుంచి అమలులోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్ల బ్రిటిష్ బానిసత్వం నుంచి న్యాయవ్యవస్థ పూర్తిగా విముక్తి పొందింది. ట్రిపుల్ తలాక్ నిషేధం, జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, నారీ శక్తి బంధన్ చట్టం తదితర చట్టాలను గురించి వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఆ ప్రజాస్వామ్యానికి గుండెలాంటిది భారత పార్లమెంటు అని రాష్ట్రపతి గర్వంగా చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టే మన పార్లమెంటు.. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ఆమె ప్రకటించారు.

ప్రజాస్వామ్యంలో అందరూ భాగస్వామ్యం

మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు గిరిజనులు, దళితులు, రైతులు, యువత, మధ్యతరగతి, నవ మధ్యతరగతి. అందరూ భాగస్వాములు కావడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతోందని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. కొన్నేళ్లలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక న్యాయ విజయమని రాష్ట్రపతి వెల్లడించారు. ఈ వేగంతోనే భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా మలయాళం, మరాఠీ, నేపాళీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీ లాంటి తొమ్మిది భాషల్లో రాజ్యాంగం డిజిటల్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. అసలు రాజ్యాంగంలోని అద్భుత కాలిగ్రఫీపై ప్రత్యేక పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. ప్రారంభంలో రాష్ట్రపతి స్వయంగా రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు.

ఎంపీలకు రాష్ట్రపతి అభినంధన

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీలను అభినందించారు. రాజ్యాంగ రూపకల్పనలో నిర్మాతల దృష్టి, కలలను నిజం చేసేందుకు పార్లమెంట్ కృషి చేస్తోందని కొనియాడారు. సంవిధాన హాలులోనే 1949 నవంబర్ 26న మన రాజ్యాంగం ఆమోదించారు. అంబేద్కర్‌ నాయకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మహాగ్రంథం దేశానికి మార్గదర్శి అని ఆమె స్మరించారు. వందే మాతరం రచనకు 150 ఏళ్ల పూర్తి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలను ఆమె ప్రస్తావించారు.

తమిళంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తన మాతృభాష తమిళంలోనే ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజ్యాంగం ప్రతి పుటలో మనదేశ ఆత్మ ప్రతిఫలిస్తోందని కొనియాడారు. అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, దుర్గాబాయి దేశ్ ముఖ్ లతో పాటు అనేకమంది మహానుభావులు చేసిన కృషిని గుర్తుచేశారు. “ఇవ్వాళ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కావడానికి రాజ్యాంగ నిర్మాతలే కారణం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, స్పీకర్ ఓం బిర్లాతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. స్పీకర్ బిర్లా మాట్లాడుతూ మన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, గౌరవమనే హక్కులను హామీ ఇస్తోందని అన్నారు.

ప్రధాని మోడీ సందేశం

రాజ్యాంగ దినోత్సవాన్ని 2015లో ప్రకటించిన నేపథ్యాన్ని గుర్తుచేసిన మోడీ, రాజ్యాంగ కర్తవ్యాలపై ప్రజల భాగస్వామ్యం పెరగాలి అని పిలుపునిచ్చారు. 2014, 2019లో పార్లమెంట్ లో ద్వారాల వద్ద నాడు సాష్టాంగ నమస్కారాలు చేసిన సందర్భాన్ని స్మరించుకున్నారు. రాజ్యాంగం పట్ల గౌరవమే మన ఆచారంలో ప్రతిబింబిస్తుంది అన్నారు.

సుప్రీంకోర్టు లో సంవిధాన్ వేడుకల్లో పాల్గోన్న విదేశీ న్యాయమూర్తులు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి పలు దేశాల ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. సీజేఐ సూర్యకాంత్ స్వయంగా అతిథులను ఆహ్వానించి, భారత న్యాయ వ్యవస్థ ప్రతిష్టను పరిచయం చేశారు. విదేశీ న్యాయమూర్తులు సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చితో కలిసి కోర్టు విచారణలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ఛీఫ్ జస్టిస్ ల్యోన్పో నోర్బు త్షేరింగ్, కెన్యా ఛీఫ్ జస్టిస్ మార్థా కె. కుమీ, మారిషస్ ఫస్ట్ ఉమెన్ సీజేఐ రెహానా బీబీ మంగళీ-గుల్బుల్, శ్రీలంక ఛీఫ్ జస్టిస్ ప్రీతి పడ్మన్ సురసేనా, అయా దేశాల సీనియర్ న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని కొనియాడారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, రాకేష్ ద్వివేది, ఇతరులు అతిథులను స్వాగతించారు. నేషనల్ లా డే గానూ ఇదే రోజు జరుపుకుంటారని తెలిపారు.

భారత రాజ్యాంగమే దేశ పరిమళం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - Tholi Paluku