
భారత యువ స్క్వాష్‌లో అనహత్ సింగ్ సంచలనం
భారత్ యువ స్క్వాష్ తార అనహత్ సింగ్ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి, ప్రపంచ ఏడవ ర్యాంకింగ్ డిఫెండింగ్ ఛాంపియన్ టిన్నే గిలిస్‌ను ఓడించి కెనడియన్ ఉమెన్స్ ఓపెన్ సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది.
న్యూఢిల్లీకి చెందిన 17 ఏళ్ల ఈ టీనేజ్ సెన్సేషన్, వరల్డ్ ర్యాంక్ 43లో ఉండగా, సీడ్ నంబర్ 2ను స్ట్రెయిట్ గేమ్స్‌లో 3-0 (12-10, 11-9, 11-9)తో మట్టికరిపించింది. మంగళవారం రాత్రి 36 నిమిషాల పాటు సాగిన క్వార్టర్ ఫైనల్ ఒక ఉతఖంటభరితమైన పోరాటంగా సాగింది. టాప్ 10 క్రీడాకారిణి పై అనహత్ తొలిసారి విజయం సాధించింది. ఆమె ప్రొఫెషనల్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద మైలురాయి.
పిఎస్‌ఏ టూర్ సిల్వర్ ఈవెంట్‌లో అనహత్ అద్భుత ఫామ్‌లో ఉంది. ఇంతకుముందు ప్రీ-క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 20 మెలిస్సా అల్వెస్‌ను కూడా ఓడించింది. ఆమె నిర్భీతమైన ఆట, కోర్టులో త్వరిత కదలికలు స్క్వాష్ ప్రపంచంలోని నిపుణుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.
‘నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆమె టాప్-10 క్రీడాకారిని, ఇలాంటి ఒకరిని మొదటిసారి ఓడించాను’ అని అనహత్ తన గెలుపు తర్వాత అన్నారు. ‘ఈ వారం నా ఆటతో చాలా సంతోషంగా ఉన్నాను. నా కోచ్‌లు నిన్నటి ఆటలానే ఆడితే ఎవరితోనైనా గెలవగలనని చెప్పారు. నా ఉత్తమ స్క్వాష్‌ను ఆడాలనే మనస్తత్వంతో వచ్చాను, అది ఫలించింది’ అని ఆమె జోడించారు.
సెమీఫైనల్స్‌లో అనహత్ మరో బలమైన ప్రత్యర్థి , సీడ్ నంబర్ 4 జినా కెన్నెడీతో తలపడనుంది. ఆమె పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, స్థిరత్వానికి ఇది మరో పెద్ద పరీక్ష అవుతుంది.
టోర్నీకి ముందు తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న అనహత్, ‘ఈ ఈవెంట్‌కు ముందు నా ఆట బాగాలేదు, ఆశలు తక్కువే ఉన్నాయి’ అని అన్నారు. ‘కానీ యూఎస్ ఓపెన్ సమయంలో గ్రెగ్ ఉన్నారు. నాలుగు రోజులు ఆయనతో శిక్షణ తీసుకున్నాను. కష్టపడి, దృష్టి సాదిస్తే అవకాశం ఉంటుందని తెలిసింది. ఇప్పుడు అది ఈ ఫలితాలు ఇస్తోంది’ అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. టొరంటోలో ఈ బ్రేక్ త్రూ ప్రదర్శనతో అనహత్ ప్రపంచ స్థాయిలో తన రాకను ప్రకటించింది. భారత స్క్వాష్‌కు తదుపరి పెద్ద స్టార్ దొరికింది అనేందుకు ఇది సంకేతం.
