
భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ లాంచ్.. ధర ఎంతంటే?
ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మరో సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ మోడల్ 'ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో'ను ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ’ పేరుతో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరి 23, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.
బ్యాటరీ, పర్ఫార్మెన్స్
ఈ ఎలక్ట్రిక్ కారులో 39.4 kWh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే దాదాపు 285 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. కేవలం 8.3 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. ఛార్జింగ్ విషయానికొస్తే, ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 50 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ నిండుతుంది. ఇది నగరాల్లో ప్రయాణించే వారికి ఎంతో అనువుగా ఉంటుంది.
అధునాతన ఫీచర్లు
ఈ కారులో భద్రతకు పెద్దపీట వేశారు. డ్రైవర్‌కు సహాయపడే లెవల్ 2 ADAS ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంటే ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి సాంకేతికత డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. అలాగే 360-డిగ్రీల కెమెరా, అలెక్సా వాయిస్ కంట్రోల్, హర్మాన్ కార్డన్ ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారు ఏఎక్స్5, ఏఎక్స్7ఎల్ అనే రెండు రకాల్లో లభిస్తుంది.
నగరవాసుల కోసమే ప్రత్యేకం
సాధారణ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో మోడల్ ఇప్పటికే మార్కెట్లో పెద్ద విజయాన్ని సాధించింది. అదే డిజైన్, సౌకర్యాలను కొనసాగిస్తూ, ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకువచ్చామని మహీంద్రా ఆటోమొబైల్ విభాగం సిఈఓ నళినీకాంత్ గొల్లగుంట తెలిపారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు, నగరంలో తిరిగేవారు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని ఆశించే వారికి ఈ కారు ఒక సరైన ఎంపిక అని ఆయన పేర్కొన్నారు. అదనంగా 50 వేల రూపాయలు చెల్లిస్తే ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకునే వాల్ ఛార్జర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
