
భారత మహిళల హాకీ జట్టు అదరహో!
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. సోమవారం కాన్బెర్రాలోని నేషనల్ హాకీ సెంటర్‌లో జరిగిన తమ మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యూ21 జట్టును 1-0 గోల్ తేడాతో ఓడించింది. ఈ విజయంలో కనికా సివాచ్ కీలక పాత్ర పోషించింది.
మ్యాచ్ సాగిందిలా
ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. అయితే మూడో క్వార్టర్ ప్రారంభమైన కొద్దిసేపటికే భారత జట్టు ప్రతిభ కనబరిచింది. మ్యాచ్ 32వ నిమిషంలో కనికా సివాచ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌ను నమోదు చేసి, భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయడానికి ప్రయత్నించినా, భారత్ తమ ఆధిక్యాన్ని చివరి వరకూ కాపాడుకొని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా యూ21 జట్టు చేతిలో ఓటమి పాలైన భారత జట్టుకు ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ఉత్సాహంతో పర్యటనలో మిగిలిన మ్యాచ్‌లలో పుంజుకోవాలని భారత యువ క్రీడాకారిణులు ఆశిస్తున్నారు.
మునుపటి మ్యాచ్‌లలో ఫలితాలు
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు శనివారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా యూ21 జట్టు చేతిలో 0-5 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆస్ట్రేలియా తరఫున మకాయ్లా జోన్స్ 10వ, 11వ, 52వ నిమిషాల్లో ఏకంగా హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగింది. సామి లవ్ 38వ, మిగాలియా హోవెల్ 50వ నిమిషాల్లో ఒక్కో గోల్ సాధించారు. అటు శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 2-3 తేడాతో స్వల్ప ఓటమిని చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్‌లో పుంజుకోవాలని ప్రయత్నించినా, ఆరంభంలోనే మకాయ్లా జోన్స్ వరుస గోల్స్‌తో భారత్‌ను డిఫెన్స్‌లో పడేసింది. రెండో క్వార్టర్‌లో భారత డిఫెన్స్ శ్రేణి పటిష్టంగా నిలబడి, గోల్ కీపర్‌తో కలిసి ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే రెండో అర్ధభాగంలో ఆస్ట్రేలియా తమ దూకుడును పెంచింది. సామి లవ్ గోల్‌తో ఆధిక్యాన్ని 3-0కి పెంచగా, నాలుగో క్వార్టర్‌లో మిగాలియా హోవెల్, మకాయ్లా జోన్స్ తమ గోల్స్‌తో భారత్‌కు గెలుపు అవకాశాలను దూరం చేశారు. భారత్ ప్రయత్నించినా, ఆస్ట్రేలియా బలమైన ఆటతీరు ముందు నెగ్గలేకపోయింది.
తదుపరి మ్యాచ్‌లు
భారత జట్టు తమ ఆస్ట్రేలియా పర్యటనను ముగించే ముందు ఆస్ట్రేలియా ప్రముఖ హాకీ వన్ లీగ్‌లో ఆడే క్లబ్ అయిన కాన్బెర్రా చిల్‌తో రెండు మ్యాచ్‌లలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లు మంగళవారం, గురువారం జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో గెలిచి పర్యటనను ఘనంగా ముగించాలని భారత జూనియర్ మహిళల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
