
భారత ప్రభుత్వ నిర్ణయాలను ట్రంప్ ప్రకటిస్తున్నారు: జైరాం రమేష్
మనదేశంలో దేశ ప్రధాని తీసుకునే నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వం పై ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తుందని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. భారత ప్రభుత్వ నిర్ణయాలను ట్రంప్ అధ్యక్షుడు వాషింగ్టన్‌లో ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఆయనను ప్రశంసిస్తుంటే, అక్కడ ఆయన పన్నులు(టారిఫ్) వేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంట్‌లో అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం వివరాలను వెల్లడించాలని, ఇంకా అది ఎందుకు పూర్తికాలేదో చెప్పమని జైరాం కోరారు.
జైరాం రమేష్ మాట్లాడుతూ భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందా లేదా అన్న విషయాన్ని కూడా ప్రధాని దేశ ప్రజలకు చెప్పాలి. భారత్ రష్యానుంచి ముడి చమురు కొనదు అని ట్రంప్ ఏవిధంగా చెబుతారు. 56 ఇంచుల ఛాతీ ఎక్కడ పోయింది. ఇంత జరుగుతున్నా ప్రధాని ఎందుకు మాట్లాడలేదు. గాజా యుద్ధ విరమణకు సంబంధించిన మీటింగ్ కు ఎందుకు వెళ్లలేదు. ప్రతి సంవత్సరం వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని, దేశం నుంచి ఆర్థిక మంత్రి ఇక్కడి నుంచి వెళతారని, ఈసారి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఎందుకు మీరు ట్రంప్ నుంచి భయపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఆమెరికా విదేశాంగ మంత్రి, అధ్యక్షుడు సింధూర్ ఆగిపోయిందని ప్రకటిస్తారు. ట్రంప్ ఇంగ్లాండ్,ఖతార్, సౌదీ, ఈజిప్టులోనూ ట్రంప్ భారత్–పాకిస్థాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెబుతారు. యుద్ధం ఆపకుంటే ఆయన పన్నులు పెంచుతామని బెదిరిస్తున్నారు. ప్రధాని వీటికి భయపడుతున్నారా. పదేపదే ట్రంప్ దేశ నిర్ణయాలు అమెరికాలో ప్రకటిస్తున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని మోడీని అడిగారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎందుకు పూర్తి కాలేదు? పార్లమెంట్‌కి వచ్చి ప్రధాని నిజం చెప్పాలి. మన విదేశీ విధానం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
ప్రధాని వివరణ ఇవ్వాలి: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత, లోక సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రిపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ట్రంప్‌కు మోడీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల ట్రంప్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను ఉదహరించారు. ఇందులో రష్యా ముడిచమురు భారత్ కొనదని చెప్పడం. ఆర్థిక మంత్రి అమెరికా పర్యటన రద్దు, షార్మ్ –ఎల్-షేక్ సమావేశానికి హాజరుకాకపోవడం, ఆపరేషన్ సిందూర్ విషయంలో ఇప్పటికీ 71 సార్లకు పైగా ట్రంప్ యుద్ధం ఆపానని ప్రకటనలు చేయడం. వీటిపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు. దేశానికి ఆయన వివరణ ఇవ్వాలని కోరారు.
భారత ప్రభుత్వం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు అంశంపై ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎండీటీ ఏజెన్సీ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ స్పందించారు.
భారతదేశం ముడిచమురు, గ్యాస్‌ను ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. మన ప్రాధాన్యం భారత వినియోగదారుడి హితం కోరడం. మన దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకునే రూపొందించారు. స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో సరఫరా చేయడం ప్రధాన లక్ష్యాలు. అమెరికా విషయంలో, గత దశాబ్ద కాలంగా మనం ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించేందుకు ప్రయత్నించామని వివరించారు.
