
భారత పర్యాటకులకు శుభవార్త.. ‘వీసా ఫీజు’ మినహాయింపు పొడిగించిన దక్షిణ కొరియా
భారత పర్యాటకులకు దక్షిణ కొరియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత్‌తో పాటు మరో ఐదు దేశాల నుంచి గ్రూపులుగా వచ్చే పర్యాటకుల కోసం అమల్లో ఉన్న 'వీసా ప్రాసెసింగ్ ఫీజు' మినహాయింపును మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు దక్షిణ కొరియా ఆర్థిక మంత్రి కూ యున్-చియోల్ బుధవారం ప్రకటించారు.
భారత్‌తో పాటు మరో 5 దేశాలకు అవకాశం
గ్రూప్ టూరిస్టులకు ఇచ్చే సీ-3-2 షార్ట్‌టర్మ్ వీసాపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు బుధవారంతో ముగియాల్సి ఉంది. అయితే దీనిని వచ్చే ఏడాది జూన్ చివరి వరకు పొడిగించినట్లు యోన్హాప్ వార్తా సంస్థ తెలిపింది. ఈ వెసులుబాటు భారత్‌తో పాటు చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, కంబోడియా దేశాల నుండి వచ్చే పర్యాటక బృందాలకు వర్తిస్తుంది.
ఖర్చు ఎంత తగ్గుతుంది?
ఈ నిర్ణయం ద్వారా దేశంలోకి వచ్చే పర్యాటకుల సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కూ యున్-చియోల్ తెలిపారు. సాధారణంగా ఈ రకమైన గ్రూప్ వీసాల కోసం ఒక్కొక్కరికి సుమారు 18,000 వోన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1,000 నుండి రూ.1,100 వరకు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంతో పర్యాటక బృందాలకు ఈ ఖర్చు తప్పుతుంది.
పుంజుకుంటున్న పర్యాటక రంగం
ఇటీవల దక్షిణ కొరియాలో పర్యాటకం వేగంగా పుంజుకుంటోంది. అధికారిక గణాంకాల ప్రకారం, నవంబర్ నెలలో విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 17.3 శాతం పెరిగింది. కరోనా ముందు స్థాయికి పర్యాటక రంగం మళ్లీ చేరుకుంటోందని అధికారులు తెలిపారు.
నవంబర్‌లో దాదాపు 16 లక్షల మంది విదేశీ పర్యాటకులు దక్షిణ కొరియాను సందర్శించారు. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 13.6 లక్షలతో పోలిస్తే ఎక్కువ. అలాగే 2019 నవంబర్‌తో పోలిస్తే 9.6 శాతం అధికంగా ఉంది. దేశాల వారీగా చూస్తే చైనా నుంచి అత్యధికంగా 3.78 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. తర్వాతి స్థానాల్లో జపాన్ (3.63 లక్షలు), తైవాన్ (1.58 లక్షలు), అమెరికా (1.33 లక్షలు), ఫిలిప్పీన్స్ (60 వేల మంది) ఉన్నాయి. చైనా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 2019 స్థాయిలో సుమారు 75 శాతానికి చేరుకుంది. జపాన్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 2019తో పోలిస్తే 40.4 శాతం పెరిగింది.
ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు దక్షిణ కొరియాను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 1.74 కోట్లకు పైగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 15.4 శాతం ఎక్కువగా ఉండగా, 2019తో పోలిస్తే 8.6 శాతం అధికంగా ఉంది. ఇందులో చైనా పర్యాటకుల వాటా దాదాపు 29.2 శాతం కాగా, వారి సంఖ్య సుమారు 50.9 లక్షలుగా నమోదైంది. వీసా ఫీజు మాఫీ పొడిగింపుతో భారత్ నుంచి దక్షిణ కొరియాకు వెళ్లే గ్రూప్ టూరిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పర్యాటక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
