
భారత పర్యటనలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్
మహాత్మా గాంధీ వారసత్వం భారతీయులు–జర్మన్లను మిత్రులుగా ఏకం చేస్తుందని, నేటి ప్రపంచంలో గాంధీ బోధనలు ఎన్నడూ లేనంతగా అవసరమయ్యాయని తన తొలి భారత పర్యటనలో భాగంగా జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి మెర్జ్ సోమవారం ఉదయం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. మెర్జ్ ఆశ్రమానికి చేరుకునే కొద్దిసేపటి ముందే అక్కడికి చేరుకున్న ప్రధాని , జర్మన్ ఛాన్సలర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం, ఇద్దరు నేతలు ‘హృదయ్ కుంజ్’ను సందర్శించారు. స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో గాంధీ, కస్తూర్బా గాంధీలు నివసించిన ఈ గది ఆశ్రమంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి. ఆశ్రమంలో ఖాదీ నూలును చర్కా (నూలు వడికే చక్రం) సహాయంతో ఎలా వడుకుతారో మెర్జ్ ప్రత్యక్షంగా వీక్షించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఖాదీ, స్వావలంబనను ప్రోత్సహించేందుకు మహాత్మా గాంధీ చర్కాపై నూలు వడకడం ఒక ప్రధాన ఉద్యమంగా కొనసాగించారు. సబర్మతి ఆశ్రమాన్ని మహాత్మా గాంధీ 1917లో స్థాపించారు. 1917 నుంచి 1930 వరకు గాంధీ అక్కడే నివసించగా, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఇది ప్రధాన కేంద్రంగా నిలిచింది.
గాంధీ వారసత్వం మిత్రులుగా చేస్తోంది
ఆశ్రమ సందర్శకుల పుస్తకంలో మెర్జ్ ఇలా రాశారు ప్రతి వ్యక్తి స్వేచ్ఛ, గౌరవం పట్ల మహాత్మా గాంధీకి ఉన్న అచంచలమైన విశ్వాసం నేటికీ మాకు ప్రేరణనిస్తోంది. నేటి ప్రపంచానికి గాంధీ బోధనలు మరింత అవసరమైన ఈ సమయంలో, ఆయన వారసత్వం భారతీయులు, జర్మన్లను మిత్రులుగా ఏకం చేస్తోంది అని రాశారు. చారిత్రక ఆశ్రమంలో నివాళులు అర్పించిన అనంతరం, ప్రధాని మోడీ, ఛాన్సలర్ మెర్జ్ సబర్మతి రివర్‌ఫ్రంట్‌కు చేరుకుని అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం–2026ను ప్రారంభించారు. అనంతరం ఇద్దరూ గాలిపటాలు ఎగరేశారు. ఈ సందర్భంగా మహిళా కళాకారులతో మోడీ, మెర్జ్ మాట్లాడి గాలిపటాలు తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు. ఉత్సవ ప్రారంభం అనంతరం, ఇద్దరు నేతలు ఓపెన్ వాహనంలో మైదానాన్ని చుట్టివచ్చి గాలిపటాలు ఎగరేయడంలో పాల్గొన్నారు.
సబర్మతి ఆశ్రమం మహాత్మా గాంధీ ఆదర్శాలకు శక్తివంతమైన గుర్తు: ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి అహ్మదాబాద్‌లోని చారిత్రక సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా చూపిన శాశ్వత ప్రభావాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఈ పర్యటనపై సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రధాని మోడీ స్పందిస్తూ సబర్మతి ఆశ్రమం మహాత్మా గాంధీ ఆదర్శాలకు శక్తివంతమైన గుర్తుగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ధైర్యం, ప్రేరణ ఇచ్చిన గాంధీజీ సిద్ధాంతాలను ఇది స్మరింపజేస్తుంది. ఈ ఉదయం అహ్మదాబాద్‌లో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించాను అని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో సబర్మతి నది ఒడ్డున ఉన్న గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధాని మోడీ, ఛాన్సలర్ మెర్జ్ ఇద్దరూ మహాత్మా గాంధీ విగ్రహానికి పూల నివాళులు అర్పించి ఘనంగా స్మరించారు అని గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా గాంధీజీ సరళ జీవన విధానం, స్వావలంబన సందేశం, సత్యం–అహింస విలువల పట్ల ఇద్దరు నేతలు గాఢమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ప్రధాన కార్యదర్శి ఎం.కే. దాస్, సబర్మతి ఆశ్రమం చైర్‌పర్సన్ కార్తికేయ సారాభాయ్, సబర్మతి ఆశ్రమం పునర్వికాస కమిటీ చైర్మన్ ఐ.పీ. గౌతమ్, అహ్మదాబాద్ కలెక్టర్ సుజీత్ కుమార్, జర్మన్ ప్రతినిధి బృంద సభ్యులు, అలాగే గాంధీ ఆశ్రమంతో సంబంధం ఉన్న ప్రముఖులు హాజరయ్యారని ప్రకటన తెలిపింది. ఇదిలా ఉండగా జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ప్రస్తుతం రెండు రోజుల అధికారిక భారత పర్యటనలో ఉన్నారు. ఛాన్సలర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు ఆయన రావడం ఇదే తొలి పర్యటన. ఈ పర్యటన ద్వారా భారత్–జర్మనీ మధ్య కొనసాగుతున్న ఉన్నతస్థాయి రాజకీయ పరస్పర సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చడమే కాకుండా, రెండు దేశాలు, ప్రపంచ సమాజానికి ప్రయోజనం చేకూరేలా భవిష్యత్ దృష్టితో కూడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం కలగనుందని అధికారులు భావిస్తున్నారు. జనవరి 13న ఛాన్సలర్ మెర్జ్ బోష్, అనంతరం నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని సందర్శించి జర్మనీకి తిరిగి వెళ్లనున్నారు.
50 దేశాల నుంచి
గుజరాత్ ప్రభుత్వ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది 50 దేశాల నుంచి 135 మంది గాలిపటాల కళాకారులు, భారత్ నుంచి దాదాపు వెయ్యి మంది ప్లయర్లు ఈ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో భాగంగా, గత రెండు రోజులుగా గాలిపటాల కళాకారులు రాజ్కోట్, సూరత్, ధోలవీర (కచ్), స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (నర్మద) వంటి ప్రాంతాలను సందర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు. అహ్మదాబాద్‌లో ఈ ఉత్సవం జనవరి 14 వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవాన్ని ప్రతి ఏడాది ఉత్తరాయణం (మకర సంక్రాంతి)కి ముందు నిర్వహిస్తారు. జనవరి 14న సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించడాన్ని, వేసవి కాలానికి మార్పును ఇది సూచిస్తుంది. గత సంవత్సరం ఈ ఉత్సవాన్ని గుజరాత్ అంతటా 3.83 లక్షల మందికి పైగా సందర్శకులు వీక్షించారు. ఈ ఏడాది ఐదు లక్షల మందికి పైగా పర్యాటకులు గుజరాత్‌కు రావచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం ద్వారా ధోలవీర, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రముఖ సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలను గుజరాత్ టూరిజం ప్రపంచానికి పరిచయం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది.
