Let's talk: editor@tmv.in
భారత పరిపాలనా సేవల్లో మహిళల ఎదుగుదల - ఒక అభివృద్ధి

భారత పరిపాలనా సేవల్లో మహిళల ఎదుగుదల - ఒక అభివృద్ధి

Dantu Vijaya Lakshmi Prasanna
27 అక్టోబర్, 2025

భారత స్వాతంత్రానికి ముందు వరకు పరిపాలనా రంగంలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండేది. కానీ నేటి పరిస్థితుల్లో మహిళల భాగస్వామ్యం స్పష్టంగా, స్థిరంగా పెరుగుతోంది.ఆ మార్పు యొక్క పయనాన్ని ఒక సారి తెలుసుకుందాం.

ప్రారంభ దశ

భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారి అన్నా రాజం మల్హోత్రా. 1950 దశకంలో ఆమె దేశ సివిల్ సర్వీస్ సేవలో చేరారు. జిల్లాస్థాయి పనిని స్వయంగా చేపట్టడం, న్యాయాధికార శిక్షణ పొందడం, తర్వాత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా ఎదగడం ద్వారా ఆమె మహిళలు కూడా ఉన్నత పరిపాలనా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించగలరని చూపించారు. ఆమె ఆదర్శంగా అప్పటినుండి నేటి తరంవారకు ఎందరో మహిళలు సివిల్ సర్వీస్ ద్వారా ఎంపికయ్యారు . మహిళలు దేశ పరిపాలన విభాగంలో తమవంతు సేవలు అందిస్తున్నారు.

గణాంకాల్లో మార్పు, తాజా ధోరణులు

గత రెండు దశాబ్దాల్లో మహిళా నియామకాల వేగం గణనీయంగా పెరిగింది. 2023 ఐఏఎస్ బ్యాచ్‌లో 180 మంది శిక్షణార్థులలో 74 మంది మహిళలు (41%) ఉండడం ఒక చారిత్రక ఘట్టం. ఇది యుపిఎస్ సి పరీక్షల్లో మహిళలు వేగంగా ముందుకు వస్తున్నారనే సంకేతం.

అయితే, ఈ పెరుగుదల మొత్తం సివిల్ సేవల్లో మహిళల శాతం ఇంకా సుమారు 20–21% వరకే ఉంది. పురోగతి ఉన్నప్పటికీఈ విషయం చరిత్రాత్మక అసమానతలు మన దేశం లో ఇంకా కొనసాగుతున్నాయని సూచిస్తుంది. ఇటీవలి సంవత్సరాల్లో యుపి ఎస్ సి ఫలితాల్లో మహిళా అభ్యర్థుల శాతం, ముఖ్యంగా టాప్ ర్యాంకుల్లో, గణనీయంగా పెరగడం కనిపిస్తోంది. ఇది మహిళల సామర్థ్యాన్ని సమాన పోటీని ప్రతిబింబిస్తుంది.

పెరుగుదలకి కారణాలు

ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరగడం: ఎక్కువ మంది మహిళలు కాలేజీ, ప్రొఫెషనల్ కోర్సులు, యుపి ఎస్ సి కోచింగ్ సెంటర్లలో చేరడం వలన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అదీకాక ఆడపిల్లలకు ఉన్నతవిద్య అవసరాన్ని ప్రతీకుటుంబం గుర్తిస్తుంది.

రోల్ మాడెల్ గా టాపర్లు: టాప్ ర్యాంకులు సాధించిన మహిళలు, ఉన్నత పదవుల్లో ఉన్న మహిళా అధికారులు తదుపరి తరం యువతకు ప్రేరణనిస్తున్నారు. సమాజంలో నేటి యువతలు సోషల్ మీడియా కు దగ్గరగా ఉంటున్నారు. ఎక్కడ ఎవరు విజేతలు ఐనా వారికి సోషల్ మీడియా బ్రహ్మరధం పడుతుంది. కాబట్టి ఆ ప్రభావం యువతలో మేము సాధించాలి అనే పట్టుదలను తెస్తుంది .

సామాజిక దృక్పథంలో మార్పు: పట్టణీకరణ, కుటుంబంలో మార్పులు, తల్లిదండ్రుల ఇద్ధరి ఆదాయాలు పిల్లల భవిష్యత్ పై భరోసా పెంచుతున్నాయి. కుటుంబ మద్దతుతో మహిళలు ఉద్యోగ పరీక్షల కోసం సుదీర్ఘ సమయాన్ని వెచ్చించగలుగుతున్నారు.

సంస్థాగత సహకారం: శిక్షణా కేంద్రాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లింగ సమానతా శిక్షణలు, పిల్లల సంరక్షణా సదుపాయాలు, అనుకూల పోస్టింగ్ విధానాలు ప్రవేశపెట్టాయి.కాబట్టి యువతలో నైపుణ్యాలు మెరుగులు దిద్దుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐతే గురుకుల పాఠ శాలల్లో అలగే స్టడీ సర్కిల్ లలో మహిళల సివిల్ సర్విస్ శిక్షణకు ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది.

రాష్ట్రాల మధ్య వ్యత్యాసం

మహిళల శాతం రాష్ట్రాలవారీగా భిన్నంగా ఉంది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలలో మహిళా ఐఏఎస్ అధికారులు ఎక్కువగా ఉండగా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో తక్కువగా ఉన్నారు. ఈ వ్యత్యాసాలకు స్థానిక నియామక చరిత్రలు, ప్రమోషన్ విధానాలు, అధికారుల వలస ధోరణులు కారణమని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఐపిఎస్ స్థాయి గురించి మాట్లాడుకుంటే ఎందరో ఆదర్శ మహిళలు ఉన్నారు. ప్రతీ రాష్ట్రం నుండి వీరి ప్రాతినిద్యo వుంది .ఐపిఎస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా కిరణ్ బేడీ గురించి తెలిసిందే….

మహిళలు ఉన్నత పోస్టింగ్ ల వరకు ఎదగకపోవడానికి ఇంకా ఉన్న అడ్డంకులు

యుపి ఎస్ సి పరీక్షల్లో ర్యాంకులు సాధించి మంచి పోస్టింగ్ తీసుకున్న మహిళా అభ్యర్ధులు కొన్ని కారణాల వల్ల ఉన్నత అధికారులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. అవి ...

కెరీర్ విరామాలు: ప్రసూతి లేదా కుటుంబ కారణాలతో మహిళలు కొంతకాలం విరామం తీసుకోవడం వలన ప్రమోషన్ అవకాశాలు తగ్గుతాయి.

ఫీల్డ్ పోస్టింగ్స్ సమస్యలు: భద్రత, రవాణా, కుటుంబ సహకారం వంటి అంశాల వల్ల దూర ప్రాంతాల్లో పనిచేయడం కొంతమందికి కష్టంగా ఉంటుంది.

ఉన్నత పదవుల్లో పురుషులు : మధ్యస్థాయి, ఉన్నత స్థాయిలో మహిళలు పెరుగుతున్నా, సెక్రటరీ లేదా కేబినెట్ సెక్రటరీ స్థాయిలో ఇంకా పురుషుల ఆధిపత్యం ఉంది.

అనధికార నెట్వర్క్స్:ముఖ్యమైన బాధ్యతల ఎంపికలో వ్యక్తిగత పరిచయాలు లింగపరమైన పక్షపాతాలు ఇంకా కనిపిస్తున్నాయి.

మహిళల భాగస్వామ్యం ఎందుకు ముఖ్యము

పాలనలో సున్నితత్వం: మహిళల భాగస్వామ్యం పెరగడం వలన ఆరోగ్యం, విద్య, లింగ ఆధారిత హింస, సామాజిక రక్షణ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత లభిస్తుంది.

నాయకత్వ శైలి: వివిధ దృక్పథాలతో ఉన్న బృందాల సమన్వయంతో, ప్రజల అవసరాలకు దగ్గరగా మహిళలు సులువుగా పనిచేస్తారు. .

మోడల్ ప్రభావం: ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు భవిష్యత్తు తరాలకు ప్రేరణనిస్తూ సామాజిక మార్పుకు దారి చూపుతారు.

ఒకమహిళ ఉన్నత స్థాయి పదవిలో ఉంటే ఎలాంటి మార్పులు తీసుకు రాగలదో ఒక ఉదాహరణగా ఒడిశా నుంచి ఐపీఎస్‌లో తొలి మహిళగా పదవిని చేపట్టి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసిన డా. సౌమ్య మిశ్రా గురించి తెలుసుకోవాలసిందే….

ఐపిఎస్ డా. సౌమ్య మిశ్రా ప్రయాణం

ఒడిశా రాష్ట్రం నుంచి భారత పోలీసు సేవ ఐపిఎస్ లో ఎంపికైన తొలి మహిళగా డా. సౌమ్య మిశ్రా చరిత్ర సృష్టించారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఆమె తన కృషి, క్రమశిక్షణ, మరియు ప్రజా సేవ పట్ల నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు సాధించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక బాధ్యతలు

డా. సౌమ్య మిశ్రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆమె కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ జిల్లాల్లో ఏఎస్పీగా మరియు ఎస్పీగా సేవలందించారు. ప్రతి పదవిలోనూ క్రమశిక్షణతో, సమర్థతతో పనిచేసి ప్రజల్లో విశ్వాసాన్ని పొందారు.

నక్సలైట్ల పునరావాసానికి మార్గదర్శి

వరంగల్ జిల్లాలో ఎస్పీగా ఉన్న సమయంలో, లొంగిపోయిన నక్సలైట్ల పునరావాస విధానంలో ఆమె సృజనాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఫలితంగా చాలామంది మావోయిస్టులు ప్రధాన ప్రవాహంలోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా మారింది. ఈ సంస్కరణలు ఆ సమయంలో ప్రశంసలు పొందాయి.

తెలంగాణ జైళ్లశాఖలో కొత్త దిశ

2023 డిసెంబర్‌ నుండి డా. సౌమ్య మిశ్రా తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పదవిలోకి వచ్చిన తర్వాత పలు పరిష్కరణాత్మక చర్యలు ప్రారంభించారు.

జైళ్లలో సంస్కరణలు, ఖైదీల సంక్షేమం

ఆమె ఆధ్వర్యంలో కొత్త కారాగారాల ఏర్పాటు, విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు, పునరావాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జైళ్లలో శిక్షణ, విద్య, మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు.

ప్రజా సేవలో స్ఫూర్తిదాయకమైన ప్రయాణం

ఒక సాధారణ కుటుంబం నుంచి భారత పోలీసు సేవల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న డా. సౌమ్య మిశ్రా, మహిళా అధికారిణులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె సేవా దృక్పథం, సమాజ మార్పు పట్ల ఉన్న నిబద్ధత భారత మహిళా శక్తికి ప్రతీకగా నిలిచింది.

ఇలా కొందరు ఆత్మస్థైర్యం తో దైర్యంగా పనిచేసినా మరికొందరు కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నారు.

భవిష్యత్తుకు సూచనలు

అనుకూల పోస్టింగ్ విధానాలు: కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కెరీర్‌కి నష్టం లేకుండా ఉండేలా చేయాలి.

శిశు సంరక్షణ కేంద్రాలు: శిక్షణా అకాడెమీలు, కార్యాలయాల్లో శిశు సంరక్షణా కేంద్రాలు అందుబాటులో ఉండాలి.అప్పుడే ప్రతీ మహిళా తమ కార్య నిర్వహణ విధులు సులువుగా ,దైర్యంగా నిర్వహించగలుగుతారు.

మెంటరింగ్ కార్యక్రమాలు: ఉన్నత పదవుల కోసం మహిళా అధికారులను సిద్ధం చేసే కార్యక్రమాలు చేపట్టాలి.

ప్రముఖ విభాగాల్లో సమాన అవకాశాలు: జిల్లా, ఆర్థిక, రెవెన్యూ విభాగాల్లో సమానంగా పోస్టింగ్స్ ఇవ్వాలి.మహిళా రిజర్వేషన్లు వున్నా ఇంకా ఆడవాళ్ళ నియామకాల్లో పురోగతి కనపడడం లేదు.

డేటా డ్యాష్‌బోర్డ్‌లు: కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో మహిళా అధికారుల శాతం, పోస్టింగ్, ర్యాంక్‌లను పర్యవేక్షించే విధానం ఉండాలి.

భారత సివిల్ సర్వీసుల్లో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. 2023 బ్యాచ్‌లో రికార్డు స్థాయిలో మహిళలు ఎంపిక కావడం ఈ మార్పుకు చిహ్నం. అయినప్పటికీ ఉన్నత స్థాయిల్లో మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువగానే ఉంది. కాబట్టి సంస్థాగత సంస్కరణలు, సామాజిక అవగాహన, మరియు నిబద్ధ విధానాల ద్వారా ఈ అభివృద్ధిని స్థిరపరచాలి. మహిళల ఎదుగుదల మార్గం సానుకూలంగా ఉంది. ఇప్పుడు దాన్ని స్థిరమైన సమానతగా మార్చడం మన తదుపరి లక్ష్యం.