
భారత నౌకల భద్రతకు యుద్ధ నౌకలు మోహరించిన నేవీ
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ నౌకల రక్షణ కోసం భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఇరాన్ సమీపంలోని కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ గ్యాస్, ముడి చమురు నౌకలకు భద్రత కల్పించేందుకు రెండు టాస్క్‌ఫోర్స్ యుద్ధనౌకలను మోహరించింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు నౌకాదళం ఎస్కార్ట్‌గా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తోంది.
ట్యాంకర్ల మార్పిడిపై ఇరాన్ రాయబారాలు
హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇచ్చేందుకు గాను, భారత్ వద్ద సీజ్ చేయబడిన మూడు ట్యాంకర్లను విడిచిపెట్టాలని ఇరాన్ ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో గుర్తింపు మార్చడం, అక్రమంగా సరుకు మార్పిడి వంటి ఆరోపణలతో భారత అధికారులు 'అస్ఫాల్ట్ స్టార్', 'అల్ జఫ్జియా', 'స్టెల్లార్ రూబీ' అనే మూడు నౌకలను సీజ్ చేశారు. వీటిని తమకు అప్పగించాలని కోరుతూ భారత్‌లోని ఇరాన్ రాయబారి సోమవారం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. వీటితో పాటు కొన్ని మందులు, వైద్య పరికరాలను కూడా సరఫరా చేయాలని ఇరాన్ కోరినట్లు తెలుస్తోంది.
ముంద్రా పోర్టుకు చేరిన 'శివాలిక్'
నౌకాదళ రక్షణ మధ్య 40,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ గ్యాస్‌తో ప్రయాణిస్తున్న భారత నౌక 'శివాలిక్' సోమవారం సాయంత్రం గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఈ నౌక హోర్ముజ్ జలసంధిని దాటే సమయంలో నౌకాదళం పూర్తి రక్షణ కల్పించింది. దేశంలో గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు, ఈ నౌకలోని సరుకును వెంటనే అన్లోడ్ చేసేలా పోర్టులో ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు షిప్పింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించారు.
ప్రవాసుల కోసం 24 గంటల నిఘా
పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల సహాయార్థం విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. భారత రాయబార కార్యాలయాలు 24 గంటల హెల్ప్‌లైన్లను నిర్వహిస్తూ, అక్కడ నివసిస్తున్న భారతీయులకు అవసరమైన వీసా, రవాణా సహాయాన్ని అందిస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి సుమారు 2,20,000 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. మరోవైపు సముద్ర ప్రయాణాల్లో ఉన్న భారతీయ నావికుల భద్రత కోసం షిప్పింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
