Let's talk: editor@tmv.in
భారత నారీ.. జయహో

భారత నారీ.. జయహో

Shaik Mohammad Shaffee
16 ఫిబ్రవరి, 2026

భారత మహిళా క్రికెటర్లు ఆదివారం అద్భుత ప్రదర్శనతో హోరెత్తించారు. ఒకవైపు బ్యాంకాక్‌లో జరుగుతున్న ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పాకిస్థాన్‌ను మట్టికరిపించగా, మరోవైపు సిడ్నీలో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు.

పాక్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం

బ్యాంకాక్‌ వేదికగా జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో భారత ‘ఏ’ జట్టు పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. భారత బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ సాయిమా ఠాకూర్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టగా, రాధా యాదవ్, ప్రేమ రావత్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో వృందా దినేష్ (29 బంతుల్లో 55 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 12 ఫోర్లతో విరుచుకుపడటంతో భారత్ కేవలం 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి కోలుకున్న భారత్, ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. తదుపరి పోరులో నేపాల్‌తో తలపడనుంది.

సిడ్నీలో ఆసీస్‌కు షాక్

మరోవైపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి టీ20లో భారత సీనియర్ జట్టు ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో (డీఎల్ఎస్ పద్ధతిలో) అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను 133 పరుగులకే కట్టడి చేశారు. అరుంధతి రెడ్డి (4/22) తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌తో ఆసీస్ పతనాన్ని శాసించింది. రేణుకా సింగ్, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ కూడా వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఆసీస్ తరఫున వేర్హమ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

వరుణుడి ఆటంకం.. భారత్ జయభేరి

134 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ 5.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (21) ధాటిగా ఆడగా, స్మృతి మంధాన (16 నాటౌట్), జెమిమా (9 నాటౌట్) క్రీజులో ఉన్న సమయంలో వర్షం మొదలైంది. ఆట సాధ్యపడకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 21 పరుగులు అధికంగా ఉన్నట్లు తేలడంతో అంపైర్లు టీమ్ ఇండియాను విజేతగా ప్రకటించారు. ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది 8వ విజయం కావడం విశేషం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ గురువారం కాన్‌బెర్రాలో జరగనుంది.