Let's talk: editor@tmv.in
భారత దేశాభివృద్ధి వెనుక యువత మౌన రోదన

భారత దేశాభివృద్ధి వెనుక యువత మౌన రోదన

Dr.Chokka Lingam
2 నవంబర్, 2025

భారతదేశం ప్రపంచంలోనే యువజన దేశం అని గర్వంగా ప్రకటిస్తుంది. ప్రపంచ యువ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయ యువకుడే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇది సంఖ్యా పరంగా గర్వకారణమే అయినా, ఈ గర్వం వెనుక దాగి ఉన్న మరో బాధాకరమైన వాస్తవం ఉంది మన యువతలో పెరుగుతున్న మానసిక ఆందోళనలు, నిరాశ, ఆత్మహత్యల ముప్పు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా గణాంకాల ప్రకారం, దేశంలో జరిగే ప్రతి రెండవ ఆత్మహత్య 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతదే . ఇది కేవలం వ్యక్తిగత వైఫల్యం కాదు ఇది సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక అసమతుల్యతను ప్రతిబింబించే ఘోర సంకేతం. ఈ స్థితి ఒక తరం భవిష్యత్తును మాత్రమే కాదు, దేశ అభివృద్ధి దిశను కూడా ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

ఆలస్యంగా జీవితంలో స్థిరపడటం – అభివృద్ధి ముసుగు

ఇప్పటి యువత విద్యతో, నైపుణ్యాలతో ఉన్నా, స్థిరమైన జీవితం సాధించడం మరింత కష్టసాధ్యమవుతోంది. డిగ్రీలు పెరుగుతున్నాయి కానీ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. గతంలో 25 ఏళ్ల వయస్సులో ఉద్యోగం, పెళ్లి, కుటుంబం అన్నీ సాధ్యమైతే, నేడు 30 దాటినా అనిశ్చితి ఇంకా వెంటాడుతోంది. భారత యువకుడు రోజురోజుకు పోటీ పరీక్షల చక్రంలో చిక్కుకుంటున్నాడు SSC, UPSC, Groups, Banks, Police ఒకే లక్ష్యం, కానీ అంతులేని లూప్. ఈ “ఇంకా స్థిరపడలేదు” అనే భావన అతని మనసును మెల్లగా మింగేస్తోంది.

సమాజం “ఎప్పుడు ఉద్యోగం?”, “ఎప్పుడు పెళ్లి?”, “ఇతను ఏమి చేస్తున్నాడు?” అనే ప్రశ్నలతో నిరంతరం ఒత్తిడి పెడుతోంది. ఈ ప్రశ్నలు క్రమంగా అవమానంగా, ఆత్మవిశ్వాస హీనతగా మారుతున్నాయి. ఈ పరిస్థితి కేవలం వ్యక్తిగత స్థాయిలో కాదు — సామాజిక నిర్మాణం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. ఆలస్యం అవుతున్న వివాహాలు, తక్కువవుతున్న జనన రేట్లు, కుటుంబంపై ఆర్థికంగా ఆధార పడటం ఇవన్నీ ఒక సామాజిక విషయ వలయంగా మారాయి.

ఆర్థిక అస్థిరత, వ్యక్తిగత అనిశ్చితి కలిసి భారత యువతలో “భవిష్యత్తుపై భయం” అనే కొత్త మానసిక స్థితిని సృష్టిస్తోంది. ఈ భయం క్రమంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది, దీని ఫలితంగా ఒక సామూహిక నిశ్శబ్ద నిరాశ దేశమంతా వ్యాపిస్తోంది.

ఒంటరితనం – ఆధునిక సాంకేతికత వెనుక నిశ్శబ్ద శాపం

ఇంటర్నెట్, సోషల్ మీడియా మనుషుల్ని దగ్గర చేసిందనుకుంటాం కానీ నిజానికి అది వారిని దూరం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిరునవ్వులు, సెల్ఫీలు, రీల్స్ ఉన్నా ఆ ఫోన్ స్క్రీన్ వెనుక ఒంటరితనం, శూన్యత, మౌన వేదన దాగి ఉంటుంది. సంబంధాలు స్నేహాల స్థాయికి రావడమే కష్టం. వచ్చినా అవి “లైక్స్”, “వ్యూస్” పరిమితుల్లోనే ముగుస్తున్నాయి. సాంకేతిక మాధ్యమాలు అనుసంధానం పేరుతో వాస్తవ అనుబంధాలను బలహీనపరిచాయి. మాట్లాడే మాటలు తగ్గిపోయాయి, భావాలు ఎమోజీల్లో చిక్కుకున్నాయి.

సాంప్రదాయ విలువలు, ఆధునిక ఆకాంక్షల మధ్య యువత నలిగిపోతోంది. ఒక యువతి లేక యువకుడు స్వతంత్రంగా జీవించాలనుకుంటే లేదా పెళ్లి వద్దనుకుంటే , కుటుంబం దానిని తిరస్కరిస్తుంది. యువకులు ప్రేమలో విఫలమైతే లేదా నిరుద్యోగంతో బాధపడితే, కుటుంబం లేదా సమాజం వారిని అర్థం చేసుకోవడం కంటే తప్పు చూపించడంలోనే ఆసక్తి చూపుతుంది. పట్టణ యువతలో మానసిక ఒత్తిడి, ఒంటరితనం, ఆత్మగౌరవం కోల్పోవడం పెరుగుతోంది. ఇది నిశ్శబ్ద మహమ్మారిలా మారుతోంది కనిపించదు కానీ నాశనం చేస్తోంది.

విద్య – జ్ఞానం ఉంది, దిశ మాత్రం లేదు

భారత విద్యా వ్యవస్థలో మార్పులు మాటల్లో ఎక్కువగా ఉన్నా, ఆచరణలో తక్కువగా ఉన్నాయి. పిల్లలు పాఠశాలల్లో మార్కుల కోసం పరుగులు పెడతారు, కానీ జీవిత నైపుణ్యాలు నేర్చుకోరు. కళాశాలల్లో డిగ్రీలు సంపాదిస్తారు కానీ జీవన నైపుణ్యం లేక బయటపడతారు.

2024లో విడుదలైన Aspiring Minds Report ప్రకారం, భారత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 45% మందికే తగిన సాంకేతిక నైపుణ్యాలు ఉన్నాయని తేలింది. అంటే మిగిలిన సగానికి పైగా విద్యార్థులు “డిగ్రీ ఉంది కానీ దిశ లేదు” అనే స్థితిలో ఉన్నారు. ఇది కేవలం విద్యా వైఫల్యం కాదు దేశ నైపుణ్య ఆర్థిక వ్యవస్థలోని పెద్ద బలహీనతకు సంకేతం.

విద్యా వ్యవస్థలో సృజనాత్మకత, ఆవిష్కరణ, టీమ్ వర్క్, మానసిక స్థిరత్వం వంటి అంశాలు ప్రాముఖ్యం పొందాలి. కానీ ఇప్పటికీ పరీక్షలు, మార్కులు, ర్యాంకులు అనే సన్నని దారిలోనే మనం పిల్లల భవిష్యత్తును బంధిస్తున్నాం. విద్యా వ్యవస్థలో మానవత్వం, సహానుభూతి, సామాజిక అవగాహన వంటి విలువలను కూడా బలపరచాలి ఎందుకంటే ఇవే భవిష్యత్ నాయకులను తయారు చేస్తాయి.

మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం అంటే ఇంకా మన దేశంలో “బలహీనత”గా భావించే వాతావరణం ఉంది.

“డిప్రెషన్ అంటే ఏమిటి?”, “నీకు అంత సమస్య ఎందుకూ?” అనే మాటలు మానసిక సమస్యలున్నవారిని మరింత ఒంటరిని చేస్తున్నాయి. WHO గణాంకాలు ప్రకారం భారతదేశంలో ప్రతి 7 మందిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు, కానీ చికిత్స పొందేవారు 10% మందికంటే తక్కువ. ఈ దారుణ గణాంకం ఒక సామాజిక అవగాహన లోపాన్ని చూపిస్తుంది.

మన సంస్కృతిలో “ధైర్యంగా ఉండు” అనే మాటలు విరివిగా వినిపిస్తాయి కానీ అవి ఆచరణ లో సాధ్యం కావడం లేదు. పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు గుర్తించక ముందే ప్రాణాంతక దిశలో వెళ్తున్నాయి. మానసిక ఆరోగ్యంపై సరైన చర్చలు జరగాలంటే మనం ముందుగా మానసిక అనారోగ్యం తప్పు అనే భావన నుంచి బయటపడాలి. మానసిక ఆరోగ్యం శరీర ఆరోగ్యంతో సమానంగా చూడబడినప్పుడు మాత్రమే, మన యువతకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.

ప్రభుత్వం, కుటుంబం, సమాజం – ఎవరి బాధ్యత ఎక్కువ?

మానసిక ఆరోగ్యం, ఉపాధి, విద్య, కుటుంబ బంధాలు ఇవి వేర్వేరు అంశాలు అయినా, ఒకదానితో ఒకటి అంతర్లీనంగా ముడిపడ్డాయి. ప్రభుత్వం Skill India, Startup India, Digital India వంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది. కానీ యువత స్థిరత్వం కేవలం శిక్షణతో రాదు ఆత్మవిశ్వాసం, మానసిక భద్రత, సామాజిక గౌరవం కూడా అవసరం. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటం నేర్చుకోవాలి తీర్పు ఇవ్వడం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యం. సమాజం పెద్ద ఉద్యోగం లేదా పెద్ద జీతం ఆధారంగా విజయాన్ని కొలవడం ఆపాలి. ఒక క్రీడాకారుడు, కళాకారుడు, వృత్తిపరుడు కూడా దేశ నిర్మాణంలో సమాన పాత్ర వహిస్తాడు. ఈ విలువల మార్పు లేకుండా యువజన భారతం ఒక తాత్కాలిక కలగానే మిగిలిపోతుంది.

పరిష్కార మార్గాలు – ఆశకు నూతన వేదిక

• *మానసిక ఆరోగ్య సేవలను సాధారణ వైద్య వ్యవస్థలో భాగం చేయాలి.

• * ప్రతి విద్యాసంస్థలో కౌన్సెలింగ్ సెంటర్ తప్పనిసరి కావాలి.

• *వృత్తి విద్య మరియు నైపుణ్యాభివృద్ధిని పాఠశాల స్థాయిలోనే ప్రవేశపెట్టాలి.

• * 10వ తరగతి నుంచే విద్యార్థులు తమ బలాలు, ఆసక్తులు గుర్తించాలి.

• *తల్లిదండ్రుల మానసిక అవగాహన శిక్షణ.

• * పిల్లలపై ఒత్తిడి కాకుండా మద్దతు ఇచ్చే తల్లిదండ్రుల సంస్కృతి అవసరం.

• *మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

• * ఆత్మహత్య వార్తలను సంచలనంగా కాకుండా, అవగాహనాత్మకంగా చూపాలి.

• *‘యువ మానసిక ఆరోగ్య మిషన్’ ఏర్పాటు.

• * ఇది Skill India తరహాలో ఉండి, ఉపాధి–మానసిక ఆరోగ్యం–సమాజ మద్దతు కలిపిన సమగ్ర ప్రణాళిక కావాలి.

సహానుభూతి – భారత యువతకు కావలసిన కొత్త విలువ

ప్రతి యువజీవితం ఒక కొత్త అవకాశం, ఒక ఆశ. మన దేశానికి కావలసింది కేవలం టెక్నాలజీ లేదా పెట్టుబడులు కాదు అర్థం చేసుకునే మనసులు, వినే చెవులు. యువతకు పెద్ద జీతం కన్నా పెద్ద సహానుభూతి కావాలి. కుటుంబం అర్థం చేసుకోవాలి, సమాజం మద్దతు ఇవ్వాలి, ప్రభుత్వం మార్గం చూపాలి. అప్పుడు మాత్రమే భారత యువత శక్తి నిజంగా దేశ ప్రగతికి మూలం అవుతుంది. భారతదేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే, ముందుగా తన యువత మనసును రక్షించుకోవాలి. ఎందుకంటే, భారత భవిష్యత్తు ఏ బడ్జెట్‌లోనో కాదు మన యువజీవితాల హృదయాల్లో ఉంది.