
భారత తొలి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ ప్రారంభం
భారత తీర రక్షక దళం (ఐసీజీ) కోసం పూర్తిగా దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన తొలి కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం గోవాలో అధికారికంగా సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. ఈ నౌకను గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) నిర్మించింది. 114.5 మీటర్ల పొడవు, సుమారు 4,200 టన్నుల బరువుతో నిర్మించిన ఈ నౌకలో 60 శాతానికి పైగా స్వదేశీ కంటెంట్ ఉంది. గంటకు 22 నాట్స్‌కు పైగా వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగిన ఈ నౌకకు 6,000 నాటికల్ మైళ్ల పరిధి (ఎండ్యూరెన్స్) ఉంది. సముద్ర కాలుష్య నియంత్రణ చట్టాల అమలు, సముద్ర చట్ట పరిరక్షణ, శోధన–రక్షణ కార్యకలాపాలు, భారత్ ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) భద్రత వంటి కీలక బాధ్యతలను ‘సముద్ర ప్రతాప్’ నిర్వర్తించనుంది. గోవా షిప్‌యార్డ్ నుంచి డిసెంబర్‌లో భారత తీర రక్షక దళానికి అప్పగించిన ఈ నౌకను దక్షిణ గోవాలోని వాస్కోలో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ఐసీజీ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి పాల్గొన్నారు.
సముద్ర కాలుష్యం పెరిగింది
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ భారతదేశం గొప్ప సముద్ర తీరాన్ని కలిగి ఉంది. సముద్ర వనరులు ఏ ఒక్క దేశానికి చెందినవి కావు. అవి మానవజాతి వారసత్వం. వారసత్వం పంచుకుంటే, బాధ్యత కూడా పంచుకోవాలి. అందుకే భారత్ బాధ్యతాయుత సముద్ర శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. ‘సముద్ర ప్రతాప్’ భారత్‌లోనే రూపకల్పన చేసి నిర్మించిన తొలి కాలుష్య నియంత్రణ నౌకగా చరిత్ర సృష్టించిందని, ఇదే తీర రక్షక దళంలో ఇప్పటివరకు అతి పెద్ద నౌక అని ఆయన తెలిపారు. 60 శాతం స్వదేశీ కంటెంట్‌తో నిర్మించడం ‘మేక్ ఇన్ ఇండియా’కి ప్రత్యక్ష ఉదాహరణ. భవిష్యత్తులో ఈ శాతం 90కి పెరగాలన్నదే మా లక్ష్యమని చెప్పారు. ఇటీవలి కాలంలో సముద్ర కాలుష్యం తీవ్రమైన సవాలుగా మారిందని, ఇది మత్స్యకారుల జీవనోపాధి, తీరప్రాంత ప్రజల భవిష్యత్, రాబోయే తరాల భద్రతపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.
మహిళల సాధికారతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులు పైలట్, ఆబ్జర్వర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్స్ ఆఫీసర్ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు ఇప్పుడు కేవలం సహాయక పాత్రల్లోనే కాకుండా ముందువరుసలో యోధులుగా సేవలందిస్తున్నారని చెప్పారు.
అధునిక వ్యవస్థలతో నిర్మాణం
‘సముద్ర ప్రతాప్’ అనే పేరు ‘సముద్రాల మహిమ’ను సూచిస్తుందని, స్వచ్ఛమైన, సురక్షిత సముద్రాల కోసం భారత తీర రక్షక దళం తీసుకుంటున్న సంకల్పానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ఐసీజీ తెలిపింది. ఈ నౌకలో ఆధునిక కాలుష్య నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. వీటిలో సైడ్ స్వీపింగ్ ఆర్మ్స్, ఫ్లోటింగ్ బూమ్స్, అధిక సామర్థ్య స్కిమ్మర్లు, పోర్టబుల్ బార్జ్‌లు, కాలుష్య నియంత్రణ ప్రయోగశాల ఉన్నాయి. అలాగే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ (ఎఫ్ఐ-ఎఫ్ఐ క్లాస్ 1), డైనమిక్ పొజిషనింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జ్ సిస్టమ్, ఆటోమేటెడ్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఇందులో అమర్చారు. రక్షణ పరంగా ఈ నౌకలో 30 మిల్లీమీటర్ల సీఆర్ఎన్-91 గన్‌తో పాటు రెండు 12.7 మిల్లీమీటర్ల రిమోట్ కంట్రోల్డ్ గన్లు ఉన్నాయి. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అశోక్ కుమార్ భామా నేతృత్వంలో పనిచేసే ఈ నౌకను కోచి కేంద్రంగా మోహరించనున్నారు. ఇందులో 14 మంది అధికారులు, 115 మంది సిబ్బంది ఉండగా, తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు కూడా ఇందులో సేవలు అందించనున్నారు. మొత్తంగా, ‘సముద్ర ప్రతాప్’ కమిషనింగ్ భారత్ ఆత్మనిర్భరత, స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యం, సముద్ర భద్రత పట్ల నిబద్ధతకు బలమైన నిదర్శనంగా నిలుస్తోంది.
