Let's talk: editor@tmv.in
భారత తొలి ఆర్చరీ లీగ్ షెడ్యూల్ విడుదల

భారత తొలి ఆర్చరీ లీగ్ షెడ్యూల్ విడుదల

Shaik Mohammad Shaffee
29 సెప్టెంబర్, 2025

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో మెరిసిన నేపథ్యంలో క్రీడాభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ భారతదేశపు మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) తన చారిత్రక తొలి సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా ఈ లీగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ లీగ్ అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 12 వరకు న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరగనుంది. భారత సంస్కృతిలో భాగమైన ఆర్చరీ వారసత్వాన్ని, ఒలింపిక్ స్ఫూర్తిని ఈ లీగ్ చాటిచెప్పనుంది.

తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ జట్లకు భారతీయ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పేర్లను పెట్టారు. పృథ్వీరాజ్ యోధాస్ (ఢిల్లీ), మైటీ మరాఠాస్ (మహారాష్ట్ర), కాకతీయ నైట్స్ (తెలంగాణ), రాజపుతానా రాయల్స్ (రాజస్థాన్), చెరో ఆర్చర్స్ (జార్ఖండ్), చోళ చీఫ్స్ (తమిళనాడు) అనే జట్లు తొలి సీజన్‌లో తలపడనున్నాయి.

ఫార్మాట్

అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 11 వరకు రెండు రౌండ్ రాబిన్ దశలు జరుగుతాయి. ఈ దశల్లో జట్లు రెండు సార్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ప్రతి జట్టు ప్రతి ప్రత్యర్థిపై బహుళ మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. మ్యాచ్‌లన్నీ సాయంత్రం/రాత్రి వేళల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 12న సెమీ-ఫైనల్స్, ఫైనల్ నిర్వహించి, తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌ను ప్రకటిస్తారు.

ప్రపంచ స్థాయి ఆటగాళ్లు

ఈ తొలి సీజన్‌లో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొనడం ఈ లీగ్‌కు ప్రధాన ఆకర్షణ. జ్యోతి సురేఖ వెన్నం, దీపికా కుమారి, అభిషేక్ వర్మ, ధీరజ్ బొమ్మదేవర వంటి అగ్రశ్రేణి భారత క్రీడాకారులు ఈ లీగ్‌లో ఆడనున్నారు. ప్రపంచ నెం.1 స్థానంలో ఉన్న మైక్ స్క్లోయెసర్, ఆండ్రియా బెసెర్రా, ఒలింపియన్లు బ్రాడీ ఎల్లిసన్, అలెజాండ్రా వాలెన్సియా వంటి ప్రముఖులు కూడా లీగ్‌లో పోటీపడనున్నారు.

లీగ్ డైరెక్టర్ అనిల్ కామినేని మాట్లాడుతూ "దసరా రోజున ఏపీఎల్‌ను ప్రారంభించడం నిజంగా శుభపరిణామం. ఈ లీగ్ కేవలం పోటీ మాత్రమే కాదు, ఒలింపిక్ విజయాన్ని సాధించాలనే భారత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది" అని తెలిపారు. భారత ఆర్చరీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించనున్న ఈ లీగ్ క్రీడాభిమానులకు సరికొత్త అనుభూతిని అందించనుంది అనడంలో సందేహం లేదు.

భారత తొలి ఆర్చరీ లీగ్ షెడ్యూల్ విడుదల - Tholi Paluku