
భారత తయారీ రంగానికి ఊతం
తయారీ రంగ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన 22వ సీఐఐ గ్లోబల్ ఎంఎస్‌ఎంఈ బిజినెస్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. సేవల రంగంలో బలంగా ఉన్న భారతదేశం, ఇకపై ప్రపంచ తయారీ రంగంలో (తన ఉనికిని విస్తరించాలని మంత్రి శ్రీనివాస్ నొక్కి చెప్పారు. పరిశ్రమ దేశీయ వినియోగదారుల అవసరాలను తీర్చగలిగితే, అది స్వయంచాలకంగా ప్రపంచానికి సేవ చేయడానికి ఒక వేదికను పొందినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న స్థాయి నుండి పెద్ద సంస్థలుగా ఎదగడానికి వీలుగా ఎంఎస్‌ఎంఈలకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
ఎంఎస్‌ఎంఈల వృద్ధికి తోడ్పడే విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వ సంస్థలతో కలిసి మరింత సన్నిహితంగా పనిచేయాలని మంత్రి సీఐఐని కోరారు. ముఖ్యంగా భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలో ఆమోదం పొందడానికి వీలుగా ప్రమాణీకరణ, ధృవీకరణ (సర్టిఫికేషన్) పై దృష్టి పెట్టాలని, దేశవ్యాప్తంగా మరిన్ని టెస్టింగ్, ధృవీకరణ ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ అనుసరణ ప్రమాణాలపై పరిశ్రమకు అవగాహన కల్పించడం, ఉత్పత్తి ప్రమాణాలను ప్రపంచ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేయడం వలన భారతదేశ ఎగుమతి పోటీతత్వం పెరుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. అదేవిధంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు,ప్రపంచ మార్కెట్ అవకాశాల నుండి భారతీయ ఎంఎస్‌ఎంఈలు గరిష్ట ప్రయోజనం పొందేలా మార్గనిర్దేశం చేయాలని కోరారు.
ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ)లో వేగంగా జరుగుతున్న సాంకేతిక పురోగతిని హైలైట్ చేస్తూ కొత్త సాంకేతికతలు గ్లోబల్ ఇంటిగ్రేషన్‌ను మునుపెన్నడూ లేనంతగా అందుబాటులోకి తెస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. "ప్రపంచం చిన్నదై, మరింత అనుసంధానించడం జరిగిందని, భారతీయ వ్యవస్థాపకులను ప్రపంచ అవకాశాలకు అనుసంధానించడానికి ఎంఎస్ఎంఈలు సాంకేతికతను వినియోగించుకోవాలి," అని ఆయన అన్నారు. మరింత లోతైన సహకారం కోసం పిలుపునిస్తూ భారతదేశ ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి, దేశీయ సామర్థ్యాలను విస్తరించడానికి, ప్రపంచ విలువల గొలుసుకట్టును నిర్మించడానికి ప్రభుత్వంతో కలిసి మరింత సన్నిహితంగా పని చేయాలని నేను సీఐఐని అభ్యర్థిస్తున్నానని తెలియజేశారు. మనం కలిసి భారత పరిశ్రమ భవిష్యత్తును రూపొందించే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించవచ్చని అన్నారు.
సీఐఐ నేషనల్ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ చైర్మన్, రాజ్ రతన్ గ్లోబల్ వైర్ లిమిటెడ్ సీఎండీ సునీల్ చోర్డియా, సీఐఐ నేషనల్ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ కో-చైర్మన్, పోన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ ఎం పొన్నుస్వామి వంటి పలువురు ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు.
