Let's talk: editor@tmv.in
భారత గిగ్ కార్మికులు - యాప్ సౌకర్యాల వెనుక దాగిన అసమానత

భారత గిగ్ కార్మికులు - యాప్ సౌకర్యాల వెనుక దాగిన అసమానత

Dr.Chokka Lingam
9 నవంబర్, 2025

మన ఇంటి తలుపు వద్ద భోజనం అందించేవారు, ట్రాఫిక్‌లో మనను గమ్యానికి చేర్చేవారు, ఈ - కామర్స్ బూమ్‌ను నడిపించే చేతులు ఇవే గిగ్ కార్మికులు. అయితే వీరే భారత శ్రామిక సంక్షేమ వ్యవస్థకు వెలుపల ఉన్న “అదృశ్య శ్రామికులు”. యాప్‌ల సౌకర్యం వెనుక అస్థిర జీవన విధానంతో పోరాడుతున్న లక్షలాది మంది ఉన్నారు. గత దశాబ్దంలో భారతదేశంలో గిగ్ లేదా ప్లాట్‌ఫాం ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించింది. ఓలా, ఊబర్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ భాగస్వాములు, అమెజాన్ డెలివరీ సిబ్బంది, అర్బన్ కంపెనీ సర్వీస్ టెక్నీషియన్లు వీరందరూ “తాత్కాలిక, డిజిటల్ శ్రామిక శక్తి”లో భాగం. 2022 నాటి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో 77 లక్షల గిగ్ కార్మికులు ఉన్నారు. 2030 నాటికి ఇది 2.3 కోట్లకు పెరగవచ్చని అంచనా.

గిగ్ ప్రపంచం ఇచ్చిన వాగ్దానం - వాస్తవంలో అస్థిరత

గిగ్ కార్మికులు ఎక్కువగా “స్వతంత్ర కాంట్రాక్టర్లు”గా పరిగణించబడతారు. అందువల్ల వారికి ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, సెలవులు లేదా బీమా వంటి హక్కులు ఉండవు. యాప్‌లో అకస్మాత్తుగా “డీయాక్టివేట్” అయితే జీవనోపాధి ఒక్కరాత్రిలోనే కోల్పోతారు. ఇంధన ధరల పెరుగుదల, బోనస్‌ల తగ్గింపు, ఆల్గారిథమ్ ఆధారిత లక్ష్యాలు వీరిని 12–14 గంటల పని చేయించే పరిస్థితి తీసుకొచ్చాయి. సాంకేతికత స్వేచ్ఛను ఇస్తుందని వాగ్దానం చేసింది. కానీ వాస్తవంలో యాప్ ఆల్గారిథమ్‌లు “కనపడని యజమానులుగా” మారి, పనితీరును కొలుస్తూ, శిక్షలు విధిస్తూ, వేతనాలను నిర్ణయిస్తున్నాయి. గిగ్ ఆర్థిక వ్యవస్థ కొత్త రకం ఆధారపడటాన్ని సృష్టించింది.

చట్టబద్ధ గుర్తింపు - కానీ అమలు ఆగిపోయిన స్థితి

2020లో భారత ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా తొలిసారిగా గిగ్ మరియు ప్లాట్‌ఫాం కార్మికులను అధికారికంగా గుర్తించింది. ఈ చట్టం కింద కార్మికులకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధాప్య రక్షణ వంటి ప్రయోజనాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం అగ్రిగేటర్ కంపెనీలు (ఓలా, స్విగ్గీ, అమెజాన్ మొదలైనవి) వార్షిక టర్నోవర్‌లో 1–2% సోషల్ సెక్యూరిటీ ఫండ్ కు చెల్లించాలి. కానీ నాలుగేళ్లు గడిచినా ఈ చట్టం అమల్లోకి రాలేదు. కేంద్రం, రాష్ట్రాల మధ్య నియమాలు, అధికార పరిధి, డేటా సమన్వయం, సంస్థల ప్రతిఘటన అన్నీ కలిపి ఈ చట్టాన్ని “పేపర్ పై ఉన్న చట్టం”గా మార్చేశాయి.

సంస్థల ప్రతిఘటన, చట్టపరమైన సందేహాలు

ఓలా, ఊబర్, స్విగ్గీ వంటి కంపెనీలు తాము కేవలం టెక్నాలజీ మధ్యవర్తులమేనని, ఉద్యోగికి యజమానులు కాదని వాదిస్తున్నాయి. “సోషల్ ఫండ్”కు నిధులు చెల్లించడం వ్యయభారం పెంచుతుందని, స్టార్టప్ వృద్ధికి ఆటంకమని చెప్పి లాబీయింగ్ చేస్తున్నారు. మరోవైపు, గిగ్ కార్మికులు “ఉద్యోగులు”నా, “స్వతంత్ర కాంట్రాక్టర్లు”నా అన్న వివాదం కోర్టుల్లో కొనసాగుతోంది. ప్రభుత్వం తీర్పు కోసం వేచి చూసే ధోరణి తీసుకుంది.

కేంద్ర రాష్ట్రాల సమన్వయ‌ లోపం

శ్రమ చట్టాలు “కాంకరెంట్ సబ్జెక్ట్” కింద వస్తాయి. కాబట్టి కేంద్రం చట్టం చేసిందిగానీ, అమలు మాత్రం రాష్ట్రాల బాధ్యత. చాలా రాష్ట్రాల్లో శ్రామిక శాఖలు సిబ్బంది కొరతతో, డిజిటల్ వ్యవస్థల లోపంతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ–శ్రామ్ పోర్టల్ ద్వారా కార్మికుల నమోదు ప్రారంభమైనా, గిగ్ ప్లాట్‌ఫార్మ్‌లతో దానిని అనుసంధానం చేయడం చాలా మందగించింది.

రాజకీయ ప్రాధాన్యం లేకపోవడం

గిగ్ కార్మికులు సంఖ్యలో ఎక్కువైనా, విస్తరించి ఉన్నందున ఒకటిగా గళం ఎత్తలేకపోతున్నారు. వీరికి శక్తివంతమైన యూనియన్‌లు లేవు. అందువల్ల రాజకీయంగా పెద్ద ఒత్తిడి ఉండదు. కానీ యాప్ సంస్థలు ప్రభావవంతమైన లాబీ శక్తిగా మారాయి. ప్రభుత్వాలు వీరిని “నూతన ఆర్థిక వ్యవస్థ” చిహ్నంగా చూసి కఠిన చర్యలు తీసుకోవడంలో సంకోచిస్తున్నాయి.

రాజస్థాన్ మోడల్

2023లో రాజస్థాన్ రాష్ట్రం “ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్ కార్మికుల నమోదు మరియు సంక్షేమ చట్టం”ను ఆమోదించింది. ఇది దేశంలో మొట్టమొదటి సమగ్ర చట్టం. దీనిలో గిగ్ కార్మికుల బోర్డు, నమోదు వ్యవస్థ, సంక్షేమ నిధి ఏర్పాటుకు నిబంధనలు ఉన్నాయి. అయితే అమలుకు ఇంకా దూరమే. అయినప్పటికీ ఇది ఇతర రాష్ట్రాలకు నమూనాగా మారే అవకాశం ఉంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఈ అంశం పరిశీలనలో వుంది

చట్టం యొక్క ఆలస్యానికి మూల్యాన్ని చెల్లిస్తున్న కార్మికులు

ప్రతి ఆలస్యం ఒక జీవన వ్యయం. రోడ్డు ప్రమాదంలో మరణించిన డెలివరీ బాయ్ కుటుంబం, యాప్ రేటింగ్ తక్కువగా వచ్చినందుకు ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్ వీరికి రక్షణ లేదు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వేల మంది గిగ్ కార్మికులు రోజువారీ ఆదాయాన్ని కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో “సోషల్ సెక్యూరిటీ ఖాళీ” ఎంత ప్రమాదకరమో చూపించింది.

ముందున్న దారి

ఇప్పుడు భారత్ ఒక మలుపు వద్ద ఉంది. ఒకవైపు స్టార్టప్ విజయాలను సంబరంగా జరుపుకుంటోంది. మరోవైపు ఆ విజయాల వెనుక ఉన్న శ్రామికులను నిర్లక్ష్యం చేస్తోంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ ను తక్షణం అమలు చేయడం తొలి అడుగు కావాలి. ఇతర రాష్ట్రాలు రాజస్థాన్ మోడల్‌ను అనుసరించాలి. ప్లాట్‌ఫార్మ్ కంపెనీలు సమాజానికి తమ బాధ్యతగా నిధులు చెల్లించాలి. ప్రభుత్వం ఈ–శ్రామ్ డేటాను సమగ్రపరచి, పోర్టబుల్ బెనిఫిట్స్ వ్యవస్థను తీసుకురావాలి. అత్యంత ముఖ్యంగా, గిగ్ కార్మికులు తామే సంఘటితమై గళం ఎత్తాలి యూనియన్‌లు, సంఘాలు లేదా డిజిటల్ సహకార రూపంలో అయినా.

కొత్త సామాజిక ఒప్పందం అవసరం

డిజిటల్ యుగంలో “ఉద్యోగి–యజమాని” సంబంధం మారిపోయింది. కానీ ఒప్పందం లేకపోవడం అనే కారణంతో అన్యాయాన్ని సమర్థించకూడదు. గిగ్ కార్మికుల శ్రమను కేవలం సౌకర్యం అందించే సేవగా కాకుండా, గౌరవం, భద్రత పొందే హక్కుగా చూడాలి. యాప్‌ల ద్వారా వినియోగదారులు పొందుతున్న సౌకర్యం వెనుక శ్రమించే చేతులు అభివృద్ధి వాగ్దానానికి వెలుపల ఉండకూడదు. గిగ్ ఆర్థిక వ్యవస్థ భారత భవిష్యత్తు శక్తి. కానీ ఆ శక్తికి న్యాయం, భద్రత, గౌరవం కలగడం సమాజపు నిజమైన పరీక్ష