
భారత క్రీడల్లో ఈ ఏడాది మహిళలే టాప్
బాక్సింగ్ రింగ్‌లో బలమైన పంచులు, క్రికెట్ మైదానంలో పోరాటం, చెస్ బోర్డుపై వ్యూహాలు, షూటింగ్ రేంజ్‌లో ఖచ్చితమైన లక్ష్యాలు — 2025 సంవత్సరం భారత క్రీడల్లో నారీ శక్తి అద్భుతంగా రాణించిన సంవత్సరంగా నిలిచింది. వివిధ క్రీడల్లో భారత మహిళా క్రీడాకారిణులు అసాధారణ విజయాలతో దేశానికి గర్వకారణమయ్యారు. అయితే ఈ స్ఫూర్తిదాయక ప్రదర్శనల మధ్య డోపింగ్ వివాదాలు, క్రీడా పరిపాలనా వైఫల్యాలు భారత క్రీడలపై మచ్చగా మిగిలాయి.
19 ఏళ్ల చెస్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ మహిళల ప్రపంచకప్‌ను గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, ‘వంటగదికి పరిమితం కావాలి’ అన్న వ్యాఖ్యలను తట్టుకొని హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ వన్డే ఫార్మాట్‌లో ట్రోఫీని సొంతం చేసుకుంది.
షూటింగ్‌లో మరో 19 ఏళ్ల యువతి సురుచీ సింగ్ నాలుగు ప్రపంచకప్ స్వర్ణాలు సాధించి(మూడు వ్యక్తిగత విభాగాల్లో), ఇప్పటివరకు డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఆధిపత్యంగా ఉన్న 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తనదైన ముద్ర వేసింది.
పురుషుల ఫుట్‌బాల్ జట్టు వరుస వైఫల్యాలతో నిరాశపరిచిన వేళ, భారత మహిళల జట్టు వచ్చే ఏడాది జరగనున్న ఏఎఫ్‌సీ ఆసియా కప్ కు అర్హత సాధించి ఆశా దీపంగా నిలిచింది. ప్రస్తుత ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే హయాంలో పరిపాలనా సంక్షోభంతో కుదేలైన భారత ఫుట్‌బాల్‌కు ఇది కొంత ఊరట కలగించిన విజయంగా నిలిచింది.
శీతల్ దేవి – అసాధారణ స్ఫూర్తి
ఆర్చరీ రంగంలో 18 ఏళ్ల శీతల్ దేవి భారత క్రీడలకు గర్వకారణంగా మారింది. చేతులు లేకుండానే పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆమె, అలాగే సాధారణ అంతర్జాతీయ పోటీల కోసం భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌కు చెందిన ఈ యువతి, ఒలింపిక్ ఆత్మస్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది.
అదేవిధంగా శ్రీలంకలో జరిగిన ప్రపంచకప్‌లో భారత అంధ మహిళల క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. కెప్టెన్ దీపికా టీసీ నేతృత్వంలో ఈ జట్టు సభ్యులు రోజుకు మూడు పూటల భోజనం కూడా కష్టంగా మారిన తమ జీవితాలను తలుచుకుంటూ, కష్టాల్ని అధిగమించి ట్రోఫీని గెలుచుకున్నారు. ఆ విజయం తర్వాత స్పాన్సర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్థికంగా చేయూతనిచ్చాయి.
బాక్సింగ్‌లో పురుషులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, జైస్మిన్ లాంబోరియా, మీనాక్షి హూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచి భారత బాక్సింగ్‌కు కొత్త ఊపునిచ్చారు. ఒలింపిక్ విభాగమైన 57 కేజీల్లో పోటీపడే జైస్మిన్, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో పతాక రేసులో నిలిచింది.
చాను ఆధిపత్యం కొనసాగింపు
వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు మరోసారి ఎదురు లేకుండా పోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ మణిపురి క్రీడాకారిణి, వెన్నునొప్పితో బాధపడుతూనే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. అయితే ఆమె ప్రధాన విభాగమైన 49 కేజీలు ఒలింపిక్స్ జాబితా నుంచి తొలగించడంతో, లాస్ ఏంజెలెస్ 2028కు ఆమె ఎలా సిద్ధమవుతుందన్నది ఆసక్తిగా మారింది.
రెజ్లింగ్‌లో ఆంటిమ్ మెరుపులు
రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతక విజేత అమన్ సెహ్రావత్ నిరాశపరిచినా, ఆంటిమ్ పాంగాల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గెలిచిన కాంస్యం.. భారత రెజ్లింగ్‌కు ఊరటనిచ్చింది. డోపింగ్ వివాదాలు, బరువు సమస్యలతో భారత రెజ్లింగ్ కష్టాల్లో ఉన్న వేళ, ఆమె విజయం మరింత విలువైనదిగా నిలిచింది.
90 మీటర్లు దాటిన నీరజ్, క్రికెట్ ఊగిసలాట
పురుషుల క్రీడల్లోనూ కొన్ని అద్భుతాలు ఉన్నాయి. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల మైలురాయిని దాటగా, క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్‌ను గెలుచుకుంది. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ పతకం సాధించలేకపోగా, భారత టెస్ట్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశంలోనే వైట్‌వాష్‌కు గురైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్లతో భారత క్రికెట్ సంధి దశలోకి ప్రవేశించింది. శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా, వన్డేల్లో మాత్రమే ఆడుతున్న రోహిత్, కోహ్లీ అభిమానుల్లో ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా కొనసాగుతున్నారు.
కొత్త క్రీడా చట్టం, డోపింగ్ మచ్చ
క్రీడా పరిపాలనలో లోపాలను సరిదిద్దేందుకు కేంద్ర క్రీడా శాఖ జాతీయ క్రీడా పరిపాలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది వచ్చే ఏడాది అమల్లోకి రానుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం దక్కించుకోవడం భారత్‌కు గౌరవం తెచ్చినా, డోపింగ్ విషయంలో భారత్ వరుసగా మూడో ఏడాది ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన దేశంగా నిలిచింది. 2025 కొత్త క్రీడాకారులను పరిచయం చేస్తే, 2026 వారికి నిజమైన పరీక్షగా నిలవనుంది. పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్‌లు, హాకీ ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలతో వచ్చే ఏడాది భారత క్రీడలకు కీలకంగా మారనుంది.
