Let's talk: editor@tmv.in
భార‌త‌ క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత

భార‌త‌ క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత

Gaddamidi Naveen
28 ఫిబ్రవరి, 2026

భారత స్టార్ క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి ఖాన్ చంద్ సింగ్ (58), శుక్రవారం తెల్లవారుజామున గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాన్ చంద్ సింగ్ లివర్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఫిబ్రవరి 21న ఆసుపత్రిలో చేర్పించారు. గత మూడు నుంచి నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. రింకుసింగ్ మాజీ కోచ్ మసూద్ అమీనీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. రింకూ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తండ్రి కోసం టోర్నీ మధ్యలోనే..

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో సభ్యుడిగా ఉన్న రింకు సింగ్, తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసి టోర్నీ మధ్యలోనే నోయిడాకు చేరుకున్నారు. తండ్రిని పరామర్శించిన అనంతరం, తిరిగి జట్టులో చేరారు. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ సమయంలో ఆయన జట్టుతోనే ఉన్నారు. ఆ మ్యాచ్‌లో ఆయన ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోకపోయినా, జట్టుతో కలిసి కనిపించారు. ఆ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే ఈ విషాద వార్త వినాల్సి రావడం క్రికెట్ వర్గాలను కలిచివేసింది.

రింకు సింగ్ ఈ స్థాయికి చేరుకోవడంలో ఆయన తండ్రి పాత్ర ఎంతో ఉంది. అలీగఢ్‌లో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తూ, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తన కుమారుడి క్రికెట్ కలను ఖాన్ చంద్ సింగ్ ప్రోత్సహించారు. 28 ఏళ్ల రింకు సింగ్ తన విజయానికి ప్రధాన కారణం తన తండ్రేనని అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. 2025 జూన్‌లో లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకు సింగ్ నిశ్చితార్థం జరిగింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్నప్పటికీ, కొడుకు సంతోషం కోసం ఆయన ఆ వేడుకకు హాజరయ్యారు.

ఖాన్ చంద్ సింగ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన అలీఘర్ లో జరగనున్నాయి. తండ్రికి చివరి వీడ్కోలు పలికేందుకు రింకు సింగ్ అలీగఢ్ చేరుకోనున్నారు. యువ ఆటగాడికి ఎదురైన ఈ కష్ట సమయంలో బీసీసీఐ ప్రతినిధులు, సహచర ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.