Let's talk: editor@tmv.in
భారత కార్మిక చట్ట సంస్కరణలు: కార్మికులకు వరమా? వాణిజ్యానికి వరమా?

భారత కార్మిక చట్ట సంస్కరణలు: కార్మికులకు వరమా? వాణిజ్యానికి వరమా?

Dr.Chokka Lingam
1 డిసెంబర్, 2025

2025 నవంబర్ భారత కార్మిక చట్టాలను చరిత్రలో ఒక మలుపు మలిచిన నెల. స్వాతంత్య్రానంతరం దశాబ్దాలుగా మార్పు కోసం ఎదురుచూస్తూ, చర్చలు, నిరసనలు, బల్లగుద్దులు, అంతులేని న్యాయపోరాటాలు. ఇవన్నీ దాటి చివరకు భారత్ 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు సమగ్ర లేబర్ కోడ్స్‌ను అమల్లోకి తెచ్చింది.

• Code on Wages, 2019

• Code on Social Security, 2020

• Industrial Relations Code, 2020

• Occupational Safety, Health & Working Conditions Code, 2020

ఈ నాలుగు కోడ్లు కేవలం చట్టాల పునర్వ్యవస్థీకరణ మాత్రమే కావు. ఇవి కార్మిక–ఉద్యోగ సంబంధాల భవిష్యత్‌ను పునర్నిర్వచించే ప్రయత్నం. దేశంలోని కోట్లాది కార్మికులు ఫ్యాక్టరీలలోని నైపుణ్య కార్మికుల నుండి యాప్ ఆధారిత గిగ్ వర్కర్ల వరకు ప్రతీ ఒక్కరి జీవన విధానాన్ని ప్రభావితం చేసే పరిణామం ఇది.

మరి ఈ మార్పు ఎందుకు అవసరం అయింది? నిజంగా ఇది కార్మికులకు మంచిదేనా? లేక కంపెనీలకు ప్రయోజనం అయ్యేలా ఆకారమిచ్చిన విధానమా? ఈ వ్యాసం ఈ ప్రశ్నలన్నిటికీ స్పష్టమైన దిశలో సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో రాయబడింది.

పాత చట్టాలతో సమస్య: గాడి తప్పిపోయిన వ్యవస్థ

భారత కార్మిక చట్టాల నిర్మాణం చాలాకాలం పాటు ఒక పెద్ద పాత భవనం లాంటిదిగా కనిపించింది. ఎన్నో గదులు, ప్రతి గదికి వేరు నియమాలు, గది దారి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియని స్థితి—అదే భారత లేబర్ లా పరిస్థితి.

1. చట్టాలు చాలా ఎక్కువ, చాలా గందరగోళం

29 వేర్వేరు చట్టాలు వేతనం, కనీస వేతనం, బోనస్, ఫ్యాక్టరీ చట్టం, మైగ్రంట్ కార్మిక చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం. ఏ సంస్థ నడపాలన్నా నాలుగు–ఐదు రిజిస్ట్రేషన్లు, పది రిజిస్టర్లు, డజన్ల కొద్దీ పరిశీలనలు.

2. శ్రామికుల్లో 90% మంది ‘అదృశ్యులు

అనధికార రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, ఇంటి పనివారు… వీరికి ఏ సామాజిక భద్రతా దారి లేదు.

చట్టాలు వారిని గుర్తించలేదు.

3. ఆధునిక పరిశ్రమలు మారినా, చట్టాలు మారలేదు

ఫ్లెక్సిబుల్ పని, ప్లాట్ఫాం లేబర్, ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్టులు, డిజిటల్ వర్క్ ఏదికీ స్పష్టమైన చట్టపరమైన స్థానం లేదు. ఈ నేపథ్యంలో పరివర్తన తప్పనిసరి అయింది. కొత్త కోడ్లు ఈ శిథిలావస్థకు శుభ్రమైన బ్లూప్రింట్ అందించేందుకు వచ్చాయి.

నాలుగు కోడ్లలో ఉన్న ప్రధాన మార్పులు

ఇవన్నీ సులభమైన భాషలో అర్థం చేసుకుందాం.

1. వేతన కోడ్ (Code on Wages, 2019)

శ్రామికులకు కనీస వేతనం, వేతనాల నిర్వచనం: బేసిక్ + DA తప్పనిసరిగా మొత్తం వేతనంలో 50% ఉండాలి. వేతన చెల్లింపుల్లో ఆలస్యం, తప్పించుకునే మార్గాలపై గట్టి నియంత్రణ. ఇది ఉద్యోగుల కోసం చాలా కీలకం. అనేక సంస్థలు PF, గ్రాచ్యుయిటీ తగ్గించుకోవడం కోసం బేసిక్‌ను చాలా తక్కువగా చూపేవి. ఇక అది కుదరదు.

2. సామాజిక భద్రత కోడ్ (Code on Social Security, 2020)

ఈ కోడ్ ద్వారా:

• గిగ్, ప్లాట్‌ఫాం, కాంట్రాక్ట్, అనియంత్రిత కార్మికులకు సామాజిక భద్రతా పరిరక్షణ

• EPF, ESI, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలకు అర్హత

• జాతీయ కార్మిక డేటాబేస్

• యాప్ కంపెనీలు కార్మిక సంక్షేమ నిధికి భాగస్వామ్యం

• ఇది భారత కార్మిక లోకానికి ఒక భారీ పరివర్తన.

3. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (IR Code, 2020)

• ఇది వివాదాస్పద కోడ్.

• ఉద్యోగులను తొలగించడానికి అవసరమైన ప్రభుత్వ అనుమతి పరిమితి 100 నుండి 300 కార్మికులకు పెంపు

• ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాలకు పెద్దపీట

• సమ్మెకు ముందు పొడిగించిన నోటీసు

• రీ-స్కిల్లింగ్ ఫండ్

కంపెనీలు దీనిని ఫ్లెక్సిబిలిటీ అంటాయి. యూనియన్‌లు దీనిని ఉద్యోగ భద్రతా క్షీణత అంటాయి. రెండూ నిజమే.

4. సేఫ్టీ & వర్క్ కండిషన్స్ కోడ్ (OSHW Code, 2020)

• కాంట్రాక్టర్లకు ఒకే లైసెన్స్

• పనివేళలు, ఓవర్టైం, హెల్త్ & సేఫ్టీపై స్పష్టమైన నిబంధనలు

• మహిళలకు రాత్రిపూట పని అనుమతి కానీ కఠిన భద్రతా చర్యలతో

• మైగ్రంట్ కార్మికులకు ప్రత్యేక రక్షణ

ప్రమాదకర పరిశ్రమల్లో ఇది ముఖ్యమైన భద్రతా వలయం.

మార్పుల్లో ప్రధాన హైలైట్స్

● వేతనాల సమీకరణ – 50% నియమం, ఇది సంస్థలు వేతన నిర్మాణం పూర్తిగా మార్చే పరిస్థితిని తెచ్చింది.

● భారీ స్థాయిలో ఫార్మలైజేషన్ - డిజిటల్ రికార్డులు, ఒకే రిజిస్ట్రేషన్ ఇది చిన్న సంస్థలకు కూడా పెద్ద ఉపశమనమే.

● గిగ్ వర్కర్ల అధికారిక గుర్తింపు - ఇది యాప్ ఆధారిత కార్మికులకు చరిత్రాత్మక పరిణామం.

● మహిళల ఉద్యోగ అవకాశాలకు పాజిటివ్ ప్రభావం

● వివాదాల తగ్గింపు - స్పష్టమైన నిర్వచనాలు కేసుల మందగింపును తగ్గిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కోడ్ల ప్రయోజనాలు

1. వ్యవస్థ సులభం, స్పష్టత ఎక్కువ

29 చట్టాల బదులు నాలుగు కోడ్లు క్రమబద్ధత, పారదర్శకత మరియు తక్కువ ఇబ్బందులు.

2. కార్మికులకు రక్షణ పెరుగుతుంది

కనీస వేతనాలు, సమాన వేతనం, బోనస్ ఇవి అమలు సులభతరం.

3. గిగ్ & అనధికార కార్మికులకు భద్రత

ఇప్పటివరకు ఏ చట్టం పట్టించుకోని విభాగానికి ప్రయోజనం.

4. మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశం

సేఫ్టీ నిబంధనలతో రాత్రి షిఫ్ట్ అనుమతులు పని అవకాశాలు విస్తరిస్తాయి.

5. పరిశ్రమలకు ఫ్లెక్సిబిలిటీ

తొలగింపులు, హైరింగ్ ప్రక్రియల్లో సరళత ఇన్వెస్ట్‌మెంట్ ఆకర్షణ.

6. అవినీతి తగ్గింపు

ఇన్‌స్పెక్టర్ రాజ్ తరహా వేధింపులు తగ్గే అవకాశం.

ఈ కోడ్ల లోపాలు

1. ఉద్యోగ భద్రత బలహీనత

300 మంది వరకు ఉన్న సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండా retrench చేయొచ్చు—కార్మికులకు ఆందోళన.

2. ఫిక్స్‌డ్ టర్మ్ దోపిడీ ప్రమాదం

శాశ్వత ఉద్యోగాల స్థానంలో తాత్కాలిక ఉద్యోగాలు పెరగొచ్చు.

3. గిగ్ వర్కర్లకు ప్రయోజనం కాగలదా?

పరిధ్యం స్పష్టంగా ఉన్నప్పటికీ అమలు, నిధుల సమీకరణలో క్లిష్టత.

4. రాష్ట్రాల మధ్య అసమానతలు

సమయం, నిబంధనలు, చర్యలలో తేడాలు.

5. సంస్థలపై ఖర్చు భారం పెరగడం

50% వేతన నియమం వల్ల PF, gratuity వంటి బాద్యతలు పెరుగుతాయి.

6. మైగ్రంట్ వర్కర్లకు అమలు సమస్యలు

పత్రాల లేమి, రాష్ట్రాల పరిమితులు వాళ్ల ప్రయోజనాలకు అడ్డంకి.

ఈ చట్టాల ప్రభావం ఎలా ఉంటుంది?

కార్మికులపై ప్రభావం

తక్షణం:

గందరగోళం, అమలు ఆలస్యం, వేతన నిర్మాణ మార్పులు.

మధ్యకాలం:

పారదర్శకత, ఫార్మలైజేషన్, రక్షణ పెరుగుతుంది.

దీర్ఘకాలం:

అమలు నాణ్యతపై ఆధారపడి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగ దాతలపై ప్రభావం

ప్రయోజనాలు:

• తక్కువ పేపర్‌వర్క్

• సరళమైన రిజిస్ట్రేషన్

• హైరింగ్‌లో స్వేచ్ఛ

సవాళ్లు:

• ఖర్చు పెరుగుదల

• వేతన పునర్నిర్మాణం

• సేఫ్టీ ప్రమాణాల అమలు

భారత ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం

• ఫార్మల్ జాబ్స్ పెరుగుతాయని అంచనా

• విదేశీ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం

• పరిశ్రమల మధ్య కార్మిక కదలిక పెరుగుతుంది

• మహిళల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది

• చిన్న, మధ్య తరగతి సంస్థలకు తొలి దశలో ఒత్తిడి

సారాంశంగా చూసుకుంటే…

భారత కార్మిక సంస్కరణలు దైర్యమైనవి, విస్తృతమైనవి, కాలానుగుణమైనవి. భవిష్యత్ భారత వర్క్‌ఫోర్స్‌ను ఆధునిక ప్రపంచానికి దగ్గర చేసే ప్రచారం ఇది.

• కాని ప్రతి సంస్కరణలాగే

• ఇందులో లాభాలూ ఉన్నాయి,

• ప్రమాదాలూ ఉన్నాయి,

• ముఖ్యంగా అమలు నాణ్యతే విజయాన్ని నిర్ణయిస్తుంది.

భారత దేశం కార్మిక చట్టాల ప్రపంచంలో కొత్త యుగంలో అడుగుపెట్టింది. ఈ యుగాన్ని బలోపేతం చేయాలా? లేక పైపైన మార్పుల వరకు పరిమితం కావాలా? అది రాబోయే సంవత్సరాలు నిర్ణయిస్తాయి.