
భారత ‘ఏ' హాకీ జట్టు కెప్టెన్‌గా సంజయ్
భారత 'ఏ' పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌గా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన జట్టు సభ్యుడైన సంజయ్ వ్యవహరించనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 18 వరకు చైనాలోని చాంగ్జౌ నగరంలో భారత హాకీ జట్టు గాన్సు క్లబ్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో తలపడనుంది. మొత్తం 20 మంది సభ్యులతో కూడిన భారత ‘ఏ’ జట్టులో సంజయ్‌తో పాటు మరో ఒలింపిక్ కాంస్య పతక సభ్యుడు వరుణ్ కుమార్ కూడా ఉన్నారు. ఈయన డ్రాగ్‌ఫ్లికర్‌గా, డిఫెండర్‌గా ఆడతారు.
జట్టు వివరాలు
ఈ జట్టులో గోల్‌కీపర్‌లుగా పవన్, మోహిత్ హొన్నెనహళ్లి శశికుమార్ ఉన్నారు. డిఫెండర్లుగా పూవన్న చంద్ర బోబీ, వరుణ్ కుమార్, అమన్‌దీప్ లక్రా, సంజయ్, యశ్‌దీప్ సివాచ్, సుఖ్వీందర్, పర్మోద్ ఉన్నారు. మిడ్‌ఫీల్డ్‌లో మొయిరాంగ్‌థెం రబిచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్, మహ్మద్ రహీల్ మౌసీన్, రాజ్‌కుమార్ పాల్, మణిందర్ సింగ్, వెంకటేష్ ధనంజయ్ కెంచె ఉన్నారు. ఫార్వర్డ్‌లైన్‌లో అంగద్ బీర్ సింగ్, బోబీ సింగ్ ధామి, ఉత్తమ్ సింగ్, సెల్వమ్ కార్తి, ఆదిత్య అర్జున్ లాలాగే ఉన్నారు. ఈ ఫార్వర్డ్ ఆటగాళ్లందరూ గతంలో సీనియర్ జాతీయ జట్టుకు కూడా ఆడారు.
అనుభవం పెంచడమే లక్ష్యం: ఫుల్టన్
భారత ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఈ పర్యటన ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, "మాకు 2026వ సంవత్సరం చాలా బిజీగా ఉంటుంది. దీనికి ముందు ఇండియా 'ఎ' జట్టులోని ఆటగాళ్లకు సరైన అనుభవాన్ని, అవకాశాన్ని కల్పించడం ద్వారా సీనియర్ పురుషుల జట్టు కోసం ప్రతిభావంతుల పూల్‌ను విస్తరించాలనే మా ప్రణాళికల్లో ఇది ఒక భాగం" అని పేర్కొన్నారు. ఆటగాళ్లు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు, ఎలా ప్రదర్శన ఇస్తారో నిశితంగా పరిశీలిస్తామని ఫుల్టన్ తెలిపారు.
మహిళా జట్టు పర్యటన
ఇదిలా ఉండగా, ఇండియా 'ఏ' మహిళల జట్టు కూడా గత శుక్రవారమే తమ ఐదు మ్యాచ్‌ల చైనా పర్యటనకు బయలుదేరింది. ఈ జట్టు అక్టోబర్ 13 నుండి 21 వరకు లియావోనింగ్ స్పోర్ట్స్ సెంటర్‌లో లియావోనింగ్ జట్టుతో తలపడుతుంది. మహిళల జట్టుకు కూడా ఇదే తరహా అనుభవాన్ని అందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. పురుషులు, మహిళల జట్ల ఈ రాబోయే మ్యాచ్‌లు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి, భవిష్యత్తు సవాళ్లకు వారిని సిద్ధం చేయడానికి ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తాయి.
