
భారత ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ సొంతం!
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో శనివారం ఒక సంచలనం నమోదైంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపాయి. ఈ మేరకు శనివారం ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్ అందుబాటులోకి రానుంది.
ఈ ఒప్పందంలోని అత్యంత కీలక అంశం దిగుమతి సుంకాల తగ్గింపు. అమెరికా ప్రస్తుతం భారతీయ వస్తువులపై విధిస్తున్న సుమారు 50 శాతం సుంకాన్ని నేరుగా 18 శాతానికి తగ్గించింది. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల ధరలు తగ్గి, ఇతర దేశాల వస్తువులతో పోటీ పడటంలో భారత్ ముందంజలో ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి పరిశ్రమలకు ఇది పెద్ద ఊరట.
గత ఏడాది రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం అదనపు శిక్షాత్మక సుంకాన్ని ఈ ఒప్పందంతో రద్దు చేశారు. రష్యా నుంచి నేరుగా లేదా పరోక్షంగా చమురు దిగుమతులను నిలిపివేస్తామని భారత్ హామీ ఇవ్వడంతో, ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ సుంకాలను తక్షణమే తొలగించారు.
500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు
ఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా, వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 41 లక్షల కోట్లు) విలువైన వస్తువులను కొనుగోలు చేస్తామని భారత్ ప్రకటించింది. ఇందులో ప్రధానంగా అమెరికా ఇంధన ఉత్పత్తులు, విమాన విడిభాగాలు, ఖరీదైన లోహాలు, అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులు ఉన్నాయి.
కీలక రంగాలకు ఊతం
ఈ ఒప్పందం వల్ల భారతదేశంలోని ఉపాధి కల్పన రంగాలు పండగ చేసుకోనున్నాయి. వస్త్ర పరిశ్రమ, తోలు వస్తువులు, ప్లాస్టిక్, రబ్బరు, గృహ అలంకరణ వస్తువులు, హస్తకళల ఎగుమతులు గణనీయంగా పెరగనున్నాయి. ఈ రంగాల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు, ముఖ్యంగా మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
సున్నా సుంకం లాభాలు
కొన్ని ప్రత్యేక రంగాల్లో భారత వస్తువులపై సుంకాలు ఏకంగా సున్నా శాతానికి చేరుకోనున్నాయి. జనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాల ఎగుమతులపై ఎటువంటి సుంకాలు ఉండవు. దీనివల్ల ప్రపంచ ఔషధ రాజధానిగా భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోనుంది.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ తలుపులు తెరిచినప్పటికీ, స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడలేదు. మొక్కజొన్న, గోధుమలు, వరి, పౌల్ట్రీ, పాలు మరియు పాల ఉత్పత్తులు (చీజ్ వంటివి) వంటి సున్నితమైన రంగాలను ఈ సుంకాల తగ్గింపు నుంచి మినహాయించారు. దీనివల్ల భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ముప్పు ఉండదు.
టెక్నాలజీ, డిజిటల్ వాణిజ్యం
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రెండు దేశాలు సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై కూడా దృష్టి సారించాయి. డేటా సెంటర్లలో ఉపయోగించే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి హై-టెక్ వస్తువుల వాణిజ్యాన్ని పెంచాలని నిర్ణయించుకున్నాయి. డిజిటల్ వాణిజ్యంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశాయి.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు స్వర్ణయుగం
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఒక వరం లాంటిదని అభివర్ణించారు. అమెరికా వంటి సంపన్న మార్కెట్లో భారతీయ చిన్న తరహా పరిశ్రమలు తమ ముద్ర వేయడానికి ఇది ఒక గొప్ప వేదిక అని, దీనివల్ల భారతదేశ జిడిపి వృద్ధికి బలమైన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.
సుంకాల తగ్గింపు వల్ల భారతదేశంలోని శ్రమశక్తి అధికంగా ఉండే రంగాలైన వస్త్రాలు దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, గృహాలంకరణ వస్తువులు, హస్తకళలు, కొన్ని రకాల యంత్రాల ఎగుమతులు భారీగా పుంజుకోనున్నాయన్నారు. దీనికి అదనంగా, జనరిక్ ఔషధాలు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలు వంటి అనేక వస్తువులపై సుంకాలు సున్నా శాతానికి చేరుకోనున్నాయని, ఇది భారత ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మరింత ఊతమిస్తుందని పీయూష్ గోయల్ తెలిపారు.
విమాన విడిభాగాలపై సెక్షన్ 232 కింద మినహాయింపులు, ఆటో విడిభాగాలపై టారిఫ్ రేట్ కోటా, జనరిక్ మౌషధాలపై చర్చల ద్వారా సాధించిన సానుకూల ఫలితాలు ఈ రంగాల్లో గణనీయమైన ఎగుమతి లాభాలకు దారితీయనున్నాయి.
"అదే సమయంలో, సున్నితమైన వ్యవసాయ, డైరీ ఉత్పత్తులైన మొక్కజొన్న, గోధుమలు, వరి, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాల్ (ఇంధనం), పొగాకు, కొన్ని రకాల కూరగాయలు, మాంసం వంటి వాటిని పూర్తిగా రక్షించడం ద్వారా మన రైతుల ప్రయోజనాలను, గ్రామీణ జీవనోపాధిని కాపాడటంలో భారతదేశం తన నిబద్ధతను చాటుకుంది" అని పీయూష్ గోయల్ తెలిపారు.
ఈ ఒప్పందం ప్రకారం, భారతదేశం కొన్ని అమెరికన్ వస్తువులపై ఒప్పందం అమలులోకి వచ్చిన రోజే దిగుమతి సుంకాలను తొలగించనుండగా, మరికొన్నింటిపై కాలక్రమేణా దశలవారీగా తగ్గిస్తుంది. కొన్ని రంగాల్లో సుంకాలు తగ్గించబడతాయి, మరికొన్నింటిలో కోటా ఆధారిత మినహాయింపులు ఇవ్వబడతాయి.
అమెరికా వాణిజ్య ప్రతినిధి మాట్లాడుతూ, భారత్‌తో జరిగిన ఈ ఒప్పందం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారతదేశ మార్కెట్‌లో అమెరికన్ రైతులు, ఉత్పత్తిదారులకు అధ్యక్షుడు ట్రంప్ విస్తృత అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
"భారతదేశం తన పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి లేదా తగ్గించడానికి అంగీకరించింది. దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య అడ్డంకులను తొలగించి, 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన అమెరికన్ వస్తువులను కొనుగోలు చేయనుంది," అని యూఎస్టీఆర్ మరో పోస్ట్‌లో పేర్కొంది.
భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి
ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీల్-మేకింగ్ నైపుణ్యం వల్ల అమెరికన్ కార్మికులు, ఉత్పత్తిదారుల కోసం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయని అన్నారు.
ఇరు దేశాలు ఈ ముసాయిదాను త్వరగా అమలు చేసి, పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని, ముగించే దిశగా పని చేస్తాయని ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ చర్చలు ఇప్పుడు చట్టపరమైన ఒప్పందంగా మారనున్నాయి. మార్చి మధ్య నాటికి దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉంది, ఆ తర్వాత భారత్ అమెరికన్ వస్తువులపై సుంకాలను తగ్గించడం ప్రారంభిస్తుంది.
అంతేకాకుండా, అమెరికా జాతీయ భద్రతా అవసరాలకు అనుగుణంగా, ఆటో విడిభాగాల కోసం భారత్ ప్రాధాన్యత కలిగిన టారిఫ్ రేట్ కోటాను పొందుతుంది. అమెరికాకు చెందిన వైద్య పరికరాలు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వస్తువుల మార్కెట్ ప్రవేశంలో ఉన్న అడ్డంకులను, లైసెన్సింగ్ విధానాలను భారత్ సడలించనుంది.
సాంకేతిక రంగంలో కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరగనుంది. ముఖ్యంగా డేటా సెంటర్లలో వాడే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర వస్తువుల వాణిజ్యాన్ని పెంచుకోవడంతోపాటు సంయుక్త సాంకేతిక సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించారు.
గణాంకాల ప్రకారం, 2021-25 మధ్య కాలంలో అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతంగా ఉంది. 2024-25లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికాతో వాణిజ్యంలో భారత్ 41 బిలియన్ డాలర్ల మిగులును కలిగి ఉంది.
అపారెల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ. శక్తివేల్ మాట్లాడుతూ, సుంకాల తొలగింపు వల్ల భారతీయ వస్త్ర, దుస్తుల రంగానికి ప్రపంచ పోటీతత్వం పెరుగుతుందని, దీనివల్ల భారత్ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన సోర్సింగ్ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కుదిరిన ఈ 'ముసాయిదా'ను మార్చి మధ్య నాటికి పూర్తిస్థాయి 'లీగల్ ప్యాక్'గా మారుస్తారు. మార్చి నెలలో ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే, భారత్ కూడా అమెరికా పారిశ్రామిక వస్తువులపై సుంకాలను తగ్గించడం ప్రారంభిస్తుంది. ఇది అంతిమంగా రెండు దేశాల మధ్య ఒక సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
