Let's talk: editor@tmv.in
భారత ఈఈజెడ్‌లో అనుమానాస్పద నౌక పట్టివేత

భారత ఈఈజెడ్‌లో అనుమానాస్పద నౌక పట్టివేత

Pinjari Chand
23 ఫిబ్రవరి, 2026

భారత ప్రత్యేక ఆర్థిక ప్రాంతం (ఈఈజెడ్ )లో అనుమానాస్పద విదేశీ పడవను అడ్డుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ భారీ మొత్తంలో స్మగ్లింగ్ సిగరెట్లను స్వాధీనం చేసుకుంది. పడవలో ఇరాన్‌కు చెందిన నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 21న ద్వారకాకు పశ్చిమంగా సుమారు 115 నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను గుర్తించి అడ్డుకున్నట్లు కోస్ట్ గార్డ్ ఎక్స్‌లో వెల్లడించింది. ‘అల్ ముక్తార్’గా గుర్తించిన ఈ పడవలో అడుగు భాగాల్లో దాచిన 200 కార్టన్‌లు, సుమారు లక్ష ప్యాకెట్ల విదేశీ బ్రాండ్ సిగరెట్లు కనుగొన్నారు. ఈ సరుకు అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు రూ.2.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. పడవను, సిబ్బందిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ కోసం పోర్బందర్‌కు తరలిస్తున్నారు.

ఇటీవలే మరో ఆపరేషన్

ఇటీవల ఫిబ్రవరి 17న కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఏటీఎస్‌తో కలిసి సముద్రంలో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ నిర్వహించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐఎంబీఎల్) సమీపంలో డ్రగ్ స్మగ్లింగ్ అనుమానంతో ఒక విదేశీ చేపల పడవను వెంటపడి ఆపారు. పడవలో విదేశీయులైనఇద్దరు సిబ్బంది ఉండగా, తనిఖీలో ఒక్కొక్కటి 1 కిలో బరువున్న 203 ప్యాకెట్ల స్ఫటిక పదార్థం (డ్రగ్స్ అనుమానం) స్వాధీనం చేసుకున్నారు. ఆ పడవను కూడా పోర్బందర్‌కు తీసుకువచ్చి రసాయన విశ్లేషణకు పంపించారు. కోస్ట్ గార్డ్–ఏటీఎస్ సంయుక్త చర్యలు తీర భద్రత బలోపేతానికి దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.