
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది: ఆర్‌బీఐ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని సాధిస్తోందని అన్నారు. 2025 సంవత్సరం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ, భారత్ మాత్రం స్థిరమైన వృద్ధిని, తక్కువ ధరలను (ద్రవ్యోల్బణం) నమోదు చేయడం విశేషమని ఆయన పేర్కొన్నారు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, వ్యాపారం చేయడం సులభతరం చేసేలా కొత్త నిబంధనలు వచ్చాయని ఆయన తెలిపారు. ఆర్‌బీఐ డిసెంబర్ బులెటిన్‌లో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
ధరల నియంత్రణ
ముఖ్యంగా ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) గురించి మాట్లాడుతూ.. అక్టోబర్‌లో తీసుకున్న నిర్ణయాల తర్వాత దేశంలో రేట్లు చాలా వేగంగా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ధరల పెరుగుదల రేటు కేవలం 1.7 శాతానికి పడిపోయింది. సాధారణంగా ఇది 2 శాతం కంటే తగ్గకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, అంతకంటే తక్కువకు రావడం గమనార్హం. ఇక అక్టోబర్ 2025 నాటికి ఈ రేటు మరింత తగ్గి కేవలం 0.3 శాతానికే చేరిందని, ఇది సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చే విషయమని ఆయన పేర్కొన్నారు
పెరిగిన జీడీపీ
దేశ ఆర్థిక వృద్ధి రేటు (జీడీపీ) రెండో త్రైమాసికంలో 8.2 శాతంగా నమోదైంది. పండుగ సీజన్‌లో ప్రజలు భారీగా కొనుగోళ్లు చేయడం, అలాగే ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లను తగ్గించడం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఆర్థిక పరిభాషలో దీనిని "గోల్డిలాక్స్ పీరియడ్" అని పిలుస్తారు. అంటే ధరలు తక్కువగా ఉండి, వృద్ధి రేటు ఎక్కువగా ఉండే అత్యంత అనుకూలమైన సమయం అని అర్థం.
భవిష్యత్తుపై ఆశలు
వచ్చే ఏడాది కూడా భారత్ ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తుందని ఆర్‌బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యంగా మన దేశంలో వ్యవసాయం బాగుండటం ఒక ప్రధాన కారణం. అలాగే, ప్రభుత్వం జీఎస్‌టీ పన్నులను తగ్గించడం వల్ల వ్యాపారాలు పుంజుకున్నాయని, ప్రజలు కూడా ఉత్సాహంగా వస్తువులను కొంటున్నారని ఆయన వివరించారు. మన దేశంలోని బ్యాంకులు, పెద్ద పెద్ద కంపెనీల దగ్గర తగినంత ధనం ఉండటం వల్ల అవి ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, భారత్ మాత్రం సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని గవర్నర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త కొత్త ఆర్థిక సంస్కరణలు మన దేశ వృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని ఆయన చెప్పారు. మొత్తానికి, బలమైన పునాదులతో మన దేశం ఆర్థిక రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు.
