
భారత ఆత్మనిర్భరతకు ఆపరేషన్ సిందూరే సజీవ సాక్ష్యం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
భారత ఆత్మనిర్భరతకు ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూరే సజీవ సాక్ష్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం పుణెలోని సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ భారత ఆత్మనిర్భరతకు సజీవ సాక్ష్యమని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన వీరత్వాన్ని ప్రపంచం మొత్తం చూసింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్‌లో మన సైన్యం ఎక్కువగా భారతదేశంలో తయారు చేసిన ఆయుధాలు, పరికరాలనే వినియోగించింది. ఇది మన ఆత్మనిర్భర భారత్ సాధనకు బలమైన నిదర్శనమన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రక్షణ రంగం పరిస్థితి మనకు అనుకూలంగా ఉండేది కాదు. కానీ మేం దానిని మార్చాం. మా సైనికుల కోసం అవసరమైన ఆయుధాలు దేశంలోనే తయారుచేయాలనే దృక్పథంతో ముందడుగు వేశాం. ఫలితంగా మనకు సానుకూల ఫలితాలు వస్తున్నాయి.
టెక్నాలజీలో నిరంతరం మార్పులు వస్తున్నాయి
ఈసందర్భంగా స్నాతకోత్సవంలో భాగంగా పట్టాలు పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచంలో నిరంతరం టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయని వివరించారు. దేశంలో జనాభా పెరిగిందని, దాన్ని అభివృద్ధిలో భాగం చేస్తే ప్రపంచలోనే నంబర్ వన్ గా నిలుస్తామన్నారు. 2014లో కొత్త భారత దిశగా అడుగులు వేసినప్పుడు ప్రధాని మోడీ ‘స్కిల్ ఇండియా’ ‘స్టార్ట్-అప్ ఇండియా’ ‘మేక్ ఇన్ ఇండియా’ పథకాలను ప్రాధాన్యంగా తీసుకున్నారు. యువత నైపుణ్యం పెరిగితేనే దేశం ఆత్మనిర్భరంగా మారుతుంది అని ఆయన విశ్వసించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘స్కిల్ ఇండియా’ ‘స్టార్ట్-అప్ ఇండియా’ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ యువతలో నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యాన్ని రక్షణ మంత్రి వివరించారు. విశ్వకర్మ యోజనను గురించి వివరించారు. ప్రధాని నైపుణ్యాభివృద్ధి పథకం కింద ఇప్పటివరకు 1.63 కోట్లు మంది అభ్యర్థులు శిక్షణ పొందారు.జన్ శిక్షణ సంస్థల ద్వారా గ్రామాల్లో ఉన్న యువతకు 30 లక్షల మందికి కుట్టు, ఎంబ్రాయిడరీ, హస్తకళలు, ఆరోగ్య సహాయక సేవలలో శిక్షణ అందించామని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యం
మే 7న జమ్మూ–కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. అనంతరం భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు చెందిన మౌలిక వసతులపై దాడి చేసింది. భారత ప్రతిఘటనతో పాకిస్తాన్ దళాలు తొకముడిచాయన్నారు. భారత సైన్యం పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై ప్రతిదాడులు కూడా జరిపింది. తరువాత పాకిస్తాన్ డీజీఎంవో, భారత డీజీఎంవోను సంప్రదించి శత్రుత్వం నిలిపివేయాలని కోరింది.
