
భారత్ సైనిక సమన్వయానికి ‘ఆపరేషన్ సింధూర్’ ఉదాహరణ: ఆర్మీ చీఫ్
‘ఆపరేషన్ సింధూర్’ భారత్ సంయుక్త సైనిక చర్యల (డొమైన్ జాయింట్‌నెస్) వైపు సాధించిన కీలక పురోగతిని చూపించిందని భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పాకిస్థాన్ భూభాగంలో నిర్వహించిన ఈ సైనిక చర్య సమగ్ర సమన్వయానికి ఒక ముఖ్యమైన అధ్యయన ఉదాహరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు మరణించిన తర్వాత భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ప్రతి దాడులు చేసింది. బెంగళూరులో నిర్వహించిన ‘రన్ సంవాద్’ కార్యక్రమంలో ‘మల్టీ డొమైన్ ఆపరేషన్స్ (ఎండీవో)’ అంశంపై మాట్లాడిన జనరల్ ద్వివేది, ఆపరేషన్ సింధూర్ భారత్ డొమైన్ జాయింట్‌నెస్ వైపు తీసుకున్న అత్యంత శక్తివంతమైన అడుగుగా అభివర్ణించారు. అయితే ఇంకా డొమైన్ ఇంటిగ్రేషన్, ఫ్యూజన్ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఆపరేషన్ తర్వాత సమాచారం యుద్ధం (ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్) కోసం ప్రత్యేక సంస్థను, అలాగే మానసిక రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్ సమయంలో సుమారు 15 శాతం తప్పుడు సమాచార ప్రచారాన్ని ఎదుర్కోవడంపైనే శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు.
యుద్ధ పరిస్థితులు మారాయి
ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు మారుతున్నాయని, హైబ్రిడ్ లేదా ‘గ్రే-జోన్’ యుద్ధాలు పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. సంప్రదాయ సైనిక పరిమితులను దాటకుండా ప్రత్యర్థి బలహీనతలను ఉపయోగించుకోవడం ఈ విధమైన యుద్ధాల లక్షణమని వివరించారు. భూమి, గాలి, సముద్రం, సైబర్, అంతరిక్షం, కాగ్నిటివ్ వంటి ఆరు రంగాలు ఇప్పుడు విడివిడిగా కాకుండా పరస్పరం అనుసంధానమై పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆధునిక యుద్ధం భౌగోళిక పరిమితులతో కాకుండా అనేక రంగాల సమన్వయంతో సాగుతోందని చెప్పారు. మల్టీ డొమైన్ ఆపరేషన్లలో యుద్ధరంగం ఇక మ్యాప్‌పై గీసిన గీత కాదని ఆయన అన్నారు. సైబర్ దాడులు మానసికంగా ప్రభావితం చేయడం, అంతరిక్ష వనరులు లక్ష్యాలను గుర్తించడం, ఎలక్ట్రానిక్ యుద్ధం ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీయడం వంటి అంశాలు ఇప్పుడు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
అన్ని రంగాల సమన్వయంతోనే ఆపరేషన్ సింధూర్
ఆపరేషన్ సింధూర్ సమయంలో గూఢచారి సమాచారం, సైబర్, ఎలక్ట్రానిక్ యుద్ధ సమాచారం ఆధారంగా ఆర్మీ-ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా లక్ష్యాలను గుర్తించాయని, అదే సమయంలో నౌకాదళం వ్యూహాత్మకంగా తన స్థానం మార్చడం ద్వారా సమగ్ర ప్రభావం చూపిందని ఆయన చెప్పారు. ఒక్క రంగం మాత్రమే ఈ ఆపరేషన్‌ను నిర్ణయించలేదని ఆయన స్పష్టం చేశారు. సైన్యంలో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయని కూడా ద్వివేది తెలిపారు. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూపులు, ‘రుద్ర’ బ్రిగేడ్లు, డ్రోన్ యూనిట్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ విభాగాలు, సైబర్ ఆపరేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్ యుద్ధాలకు సిద్ధం కావాలంటే సైన్యంలో సమగ్ర సమన్వయం, సమాచార వినియోగం, సాంకేతిక ఆధారిత వ్యవస్థలు కీలకమని ఆయన అన్నారు. అయినప్పటికీ తుది నిర్ణయాల్లో మానవ పాత్ర కీలకమని, ‘మనిషి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉండాలి’అని ఆయన స్పష్టం చేశారు.
