Let's talk: editor@tmv.in
భారత్‌ సహా 6 దేశాల రాయబారులను వెనక్కి పిలిపించిన నేపాల్

భారత్‌ సహా 6 దేశాల రాయబారులను వెనక్కి పిలిపించిన నేపాల్

Shaik Mohammad Shaffee
8 ఏప్రిల్, 2026

నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ సహా ఆరు దేశాల్లో పనిచేస్తున్న తమ రాయబారులను వెనక్కి పిలిపిస్తూ (రీకాల్) కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం రాజకీయ కోటాలో నియమించిన వీరిని వెనక్కి రావాల్సిందిగా ప్రస్తుత బాలేంద్ర షా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం విదేశాంగ శాఖ రాయబారులకు లేఖలు జారీ చేసినట్లు మంత్రుల మండలి వెల్లడించింది.

వెనక్కి వచ్చే వారిలో వీరే..

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, డెన్మార్క్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా దేశాల్లోని రాయబారులను ఉపసంహరించుకున్నారు. వెనక్కి రానున్న వారిలో శంకర్ ప్రసాద్ శర్మ (భారత్), చిత్రలేఖ యాదవ్ (ఆస్ట్రేలియా), పూర్ణ బహదూర్ నేపాలీ (శ్రీలంక), సుమ్నిమ తులధర్ (డెన్మార్క్), శివమయ తుంబాహంఫే (దక్షిణ కొరియా), కపిల్మాన్ శ్రేష్ఠ (దక్షిణాఫ్రికా) ఉన్నారు. వీరందరూ నెల రోజుల్లోగా స్వదేశానికి తిరిగి రావాలని విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి స్పష్టం చేశారు.

బాలేంద్ర షా సర్కారు ప్రక్షాళన

నేపాల్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ‘జెన్-జెడ్’ ఉద్యమం ఫలితంగా కేపీ ఓలీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన రాపర్-పొలిటీషియన్ బాలేంద్ర షా గత నెలలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాత ప్రభుత్వం రాజకీయ ప్రాతిపదికన నియమించిన రాయబారులను తొలగించి, ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించే ప్రక్రియలో భాగంగానే ఈ ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆయా దేశాల్లో పనిచేస్తున్న 17 మంది రాయబారుల్లో 11 మందిని తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి పిలిపించగా, తాజాగా మిగిలిన ఆరుగురిపై కూడా వేటు పడింది.