
భారత్ వృద్ధిపై క్రిసిల్ ధీమా: 2026లో 7% జీడీపీ!
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (క్రిసిల్) తన అంచనాలను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-26లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.0 శాతం ఉంటుందని క్రిసిల్ ప్రకటించింది.
క్రిసిల్ అంచనాలుప్రకారం, మొదటి ఆరు నెలల్లో (మొదటి అర్ధభాగం) ఆర్థిక వృద్ధి అంచనాలను మించి 8 శాతంగా నమోదైన నేపథ్యంలో, క్రిసిల్ తన అంచనాను ఏకంగా 50 బేసిస్ పాయింట్లు పెంచింది. "ఆర్థిక సంవత్సరం 2025లో 6.5 శాతం వృద్ధి సాధించిన భారత్, రాబోయే 2026లో 7 శాతం వృద్ధిని సాధిస్తుందని మేము ఆశిస్తున్నాము" అని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది.
వృద్ధికి ప్రధాన కారణం దేశీయ వినియోగమే అని, దీనికి తోడుగా ద్రవ్యోల్బణం తగ్గుదల, జీఎస్టీ రేట్లలో హేతుబద్ధీకరణ (మార్పులు), ఆదాయపు పన్నులో లభించిన ఉపశమనం ఉన్నాయని తెలిపింది. అయితే, అమెరికా విధించే సుంకాలు భారతీయ ఎగుమతులు, పెట్టుబడులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని క్రిసిల్ హెచ్చరించింది. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం ఎలా ముందుకు వెళ్తుందో పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొంది.
జీడీపీ గణాంకాలు:
• 2026 రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.2 శాతానికి పెరిగి, ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది సెప్టెంబర్ 2025లో జీఎస్టీ రేటు తగ్గింపు కారణంగా జరిగింది.
• అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పూర్తి సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 7.3 శాతానికి పెంచింది.
ధరల నియంత్రణ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం
ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) విషయంలో క్రిసిల్ శుభవార్త చెప్పింది. 2026లో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2.5శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. (2025లో ఇది 4.6 శాతం). తక్కువ ఆహార ద్రవ్యోల్బణం, వ్యవసాయ వృద్ధి, ముడి చమురు ధరలు తగ్గడం దీనికి దోహదపడతాయని తెలిపింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 0.3శాతానికి పడిపోయి, రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆర్‌బీఐ తన అంచనాను మరింత తగ్గించి, 2025, 26కి ద్రవ్యోల్బణం కేవలం 2.0శాతం ఉంటుందని సవరించింది.
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ నిర్ణయం: గోల్డీలాక్స్ పీరియడ్
తగ్గుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గింపునకు మొగ్గు చూపింది. డిసెంబర్ సమావేశంలో, ద్రవ్య విధాన కమిటీ పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25శాతానికి చేరింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా భారత ఆర్థిక వ్యవస్థను "అరుదైన గోల్డీలాక్స్ పీరియడ్"గా అభివర్ణించారు. అంటే అధిక ఆర్థిక వృద్ధి, అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం ఏకకాలంలో ఉండటం.అయితే 2026 సంవత్సరంలో ముడి చమురు ధరలు సగటున బ్యారెల్‌కు 60 నుండి 65 డాలర్ల మధ్య ఉంటాయని క్రిసిల్ అంచనా వేసింది. (2025లో ఇది 65-70 డాలర్లుగా ఉంది). నవంబర్‌లో బ్రెంట్ ముడి చమురు ధర సగటున 63.6 డాలర్లకు పడిపోయిందని నివేదిక పేర్కొంది.
