
భారత్ రావాల్సిన ఇరాన్ విమానంపై అమెరికా దాడి!
ఇరాన్‌లోని మష్‌హద్ విమానాశ్రయంపై సోమవారం అమెరికా జరిపిన వైమానిక దాడిలో 'మహన్ ఎయిర్'కు చెందిన ఒక విమానం తీవ్రంగా దెబ్బతింది. భారత్ నుంచి మానవతా సాయం, అత్యవసర వైద్య సామాగ్రిని తరలించాల్సిన ఈ విమానంపై దాడి జరగడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఇరాన్‌కు అందాల్సిన కీలక సాయం నిలిచిపోయే ప్రమాదం ఉందని ఇరాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ నుంచి సాయం అందాల్సి ఉండగా..
ఇరాన్ ప్రజల కోసం భారత్ పంపిస్తున్న అత్యవసర మందులు, ఇతర వైద్య సామగ్రిని తీసుకువెళ్లేందుకు ఈ విమానం ఈ వారంలోనే న్యూఢిల్లీకి రావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన ఈ విమానం భారత్‌లో ల్యాండ్ కావాల్సి ఉండగా, అంతకంటే ముందే మష్‌హద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఇది దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరించారు. కాగా, ఈ దాడికి సంబంధించి అమెరికా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
భారత ప్రజలకు ఇరాన్ కృతజ్ఞతలు
ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, మార్చి 18వ తేదీనే భారత్ తొలి విడత వైద్య సామాగ్రిని 'ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ' ద్వారా పంపించింది. కష్టకాలంలో అండగా నిలుస్తున్న భారత ప్రజలకు న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.
మహన్ ఎయిర్ నేపథ్యం
మహన్ ఎయిర్ అనేది ఇరాన్‌కు చెందిన ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ. ఇది పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా మరియు తూర్పు ఆసియాలోని పలు దేశాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఇప్పుడు జరిగిన దాడితో ఈ సంస్థ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
